దళితబంధులో మాలలకు ప్రత్యేకస్థానం కల్పించాలి : చెన్నయ్య

దళితబంధులో మాలలకు ప్రత్యేకస్థానం కల్పించాలి : చెన్నయ్య
  • మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య డిమాండ్ 

బోధన్, వెలుగు : రాష్ట్ర  ప్రభుత్వం అమలు చేస్తున్న దళితబంధు పథకం రెండో విడతలో మాలలకు ప్రత్యేక స్థానం కల్పించాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య డిమాండ్ చేశారు. ఆదివారం  పట్టణంలోని రైస్ మిల్లు అసోసియేషన్​ఆఫీస్​లో మాల మహానాడు డివిజన్ సమావేశం నిర్వహించారు. ముందుగా ప్రజా గాయకుడు గద్దర్ మృతికి శ్రద్ధాంజలి ఘటించి, రెండు నిమిషాలు మౌనం పాటించారు. గద్దర్ విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై చేయాలని డిమాండ్ చేశారు. చెన్నయ్య మాట్లాడుతూ.. రాష్ట్రంలో మాలలకు అన్ని రకాలుగా అన్యాయం జరుగుతోందన్నారు. ఎస్సీ వర్గీకరణ సాధ్యం కాదని, మాల, మాదిగలు సమష్టిగా పోరాడి తమ హక్కులను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శిగా నిరుడి రవిని ఎంపిక చేశారు. బోధన్ డివిజన్ నూతన కమిటీనీ ఎన్నుకున్నారు. డివిజన్ అధ్యక్షుడిగా శ్రావణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి మచికూరి దేవేందర్, ఉపాధ్యక్షులుగా కారం స్వామి, సంజీవ్, సహాయ కార్యదర్శులుగా శ్యామ్, రాహుల్, ప్రచార కార్యదర్శిగా అంతయ్య, కోశాధికారిగా బస్వంత్, సలహాదారులుగా పల్నాటి యాదగిరి, సాలెం సంజీవ్ లను ఎన్నుకున్నారు. సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీధర్, జిల్లా అధ్యక్షులు ఆనంపల్లి ఎల్లయ్య, లీడర్లు ఈశ్వర్, పాండు, బాల్​రాజ్ పాల్గొన్నారు.