విద్యార్థుల్లో సామర్థ్యాలు పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమం

విద్యార్థుల్లో సామర్థ్యాలు పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమం
  • కరోనా టైంలో అటకెక్కిన చదువులను గాడిన పెట్టే ప్రణాళిక
  • విద్యార్థుల్లో సామర్థ్యాలు పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమం
  • వెక్కిరిస్తున్న ఉపాధ్యాయ ఖాళీలు
  • డిప్యూటేషన్​పై వెళ్లని టీచర్లు
  • నష్టపోతున్న స్టూడెంట్లు

సిరిసిల్ల కలెక్టరేట్, వెలుగు: కరోనా తర్వాత విద్యార్థుల సామర్థ్యాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం ‘తొలిమెట్టు’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. స్టూడెంట్ల అభ్యసనా స్థాయులను పెంచేందుకు రాష్ట్రవ్యాప్తంగా టీచర్లకు తొలిమెట్టు శిక్షణ ఇచ్చింది. అయితే విద్యాశాఖలో చాలా ఖాళీలు ఉండటంతో ఆఫీసర్లు తక్కువ సంఖ్య ఉన్న పాఠశాలల నుంచి టీచర్లను ఎక్కువ సంఖ్య ఉన్న పాఠశాలలకు డిప్యూటేషన్ పై వెళ్లాల్సిందిగా ఆదేశాలు ఇచ్చినా చాలా జిల్లాలలో అమలు కావడం లేదు. విద్యాశాఖ ఆధికారులు కఠినంగా వ్యవహరించపోవడంతో తొలిమెట్టు కార్యక్రమం విజయంతం కావడంలేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.  

తొలిమెట్టు లక్ష్యాలు..

కరోనా టైంలో రెండేండ్లు స్కూళ్లు మూతపడటంతో విద్యార్థుల సామర్థ్యాలు బాగా తగ్గాయి. ప్రైమరీ పాఠశాలల విద్యార్థులు బేసిక్స్ కూడా మరిచిపోవడంతో స్టూడెంట్స్ ను గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం తొలిమెట్టు కార్యక్రమాన్ని ప్రారంభించింది. జూలై చివర్లో ప్రారంభమై ఆగస్టు మొదటి వారం వరకు రాష్ట్రవ్యాప్త ప్రైమరీ స్కూల్​టీచర్లు శిక్షణ ఇచ్చారు. ఈమేరకు ఆగస్టు 19 నుంచి ప్రాథమిక పాఠశాలల్లో పిల్లలకు బేస్ లైన్ టెస్ట్ లు నిర్వహించి స్టూడెంట్ల అభ్యసన స్థాయులను గుర్తించాలి. అనంతరం స్టూడెంట్ల స్థాయికి తగ్గట్టు బోధనా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. వారంలో ఐదు రోజులు బోధించి ఒక రోజు మూల్యాంకన చేయాలి. నెలకోసారి పిల్లల ప్రగతిని నమోదు చేసి కాంప్లెక్స్ స్థాయిలో ప్రతీనెల 26న టీచర్లతో రివ్యూ నిర్వహించాలి.  ప్రతీనెల 28న మండలాలవారిగా, 30న జిల్లాలవారిగా రివ్యూలు నిర్వహించాలి. విద్యార్థులకు మౌలిక భాష, గణితంలో సామర్థ్యం పెరిగేలా బోధించడం కోసం తొలిమెట్టులో ప్రత్యేక ప్రోగ్రాంను డిజైన్ చేశారు.   

ఉమ్మడి కరీంనగర్​లో భారీ ఖాళీలు.. 

జిల్లాలోని స్కూళ్లల్లో టీచర్ల కొరత ఎక్కువగా ఉండటంతో తొలిమెట్టు కార్యక్రమం సక్రమంగా అమలు కావడం లేదు. కరోనాకు ముందు విద్యా వలంటీర్లతో కొంత సర్దుబాటు జరిగింది. ఈ ఏడాది వలంటీర్లను రెన్యూవల్ చేయలేదు. దీంతో బోధన కుంటుపడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా డీఈఓ పోస్టులు 7, డిప్యూటీ డీఈఓ 58, డిప్యూటీ ఐఓఎన్​20, గ్రేడ్ వన్ హెడ్మాస్టర్ పోస్టులు15,  గ్రేడ్ 2 పోస్ట్ లు 2474, ఎంఈఓ 467, ప్రిన్సిపల్ పోస్టులు 11 ఖాళీ ఉన్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా ఒక్క రెగ్యూలర్ ఎంఈఓ కూడా లేరు. ఇన్​చార్జి ఎంఈఓలతోనే స్కూళ్ల  పర్యవేక్షణ నడుస్తోంది.     

డిప్యూటేషన్లపై చర్యలు శూన్యం..

ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా విద్యార్థులు తక్కువగా ఉన్న స్కూళ్ల నుంచి.. ఎక్కువ ఉన్న పాఠశాలలకు డిప్యూటేషన్ గా వెళ్లాలని టీచర్లకు ఆదేశాలు వచ్చినా వాళ్లు వెళ్లడం లేదు. రాజన్న సిరిసిల్లలో 113 మంది, జగిత్యాల జిల్లాలో 94, పెద్దపల్లిలో 84,  కరీంనగర్ లో 157 మంది టీచర్లకు డిప్యూటేషన్ పై ఆర్డర్లు ఇచ్చినా పట్టించుకోవడం లేదు. అయినా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడం లేదు. ఖాళీలు నింపకున్నా, ఉన్న టీచర్లు సర్దుబాటు చేసేందుకు ఆఫీసర్లు చర్యలు తీసుకోకపోవడంతో తొలిమెట్టు కార్యక్రమం విజయవంతం కావడం లేదు. 

ఖాళీలను భర్తీ చేయాలి

ఏళ్లుగా టీచర్ల ఖాళీలు భర్తీ చేయకపోవడంతో బోధనకు ఆటంకం కలుగుతోంది. నాలుగేళ్లుగా బదిలీలు, ఏడేళ్లుగా పదోన్నతులు, 17 ఏళ్లుగా పర్యవేక్షణ అధికారుల నియామకాలు జరపడం లేదు. టీచర్ల భర్తీ ప్రక్రియ పూర్తయ్యే దాకా బోధనకు ఆటంకం కలగకుండా వలంటీర్లను నియమించాలి. విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న స్కూళ్లకు తాత్కాలికంగానైనా టీచర్లను  సర్దుబాటు చేయాలి. 

- శంకర్ గౌడ్, యూటీఎఫ్  జిల్లా అధ్యక్షుడు,

రాజన్న సిరిసిల్ల

జాయిన్ కాకపోతే షోకాజ్ నోటీసులు

జిల్లాలో 79 మందికి డెప్యూటేషన్ ఆర్డర్స్​ఇచ్చాం. కొంత మంది జాయిన్ అయ్యారు. ఇప్పటి వరకు జాయిన్ కాని వారికి షోకాజ్ నోటీసులు ఇస్తాం. త్వరలో అందరూ జాయిన్ అయ్యేలా చర్యలు తీసుకుంటాం.

- రాధాకిషన్, డీఈఓ, 
రాజన్న సిరిసిల్ల