ఆకస్మిక మరణాలకు కారణమవుతున్న హెయిర్ ట్రాన్స్ ప్లాంట్..!

ఆకస్మిక మరణాలకు కారణమవుతున్న హెయిర్ ట్రాన్స్ ప్లాంట్..!

కరోనా కలకలం సృష్టించినప్పటి నుంచి మృత్యువు ఎక్కడ్నుంచి.. ఎలా వస్తుందో అస్సలు ఊహించలేకపోతున్నారు. దానికి కారణాలు కూడా తెలుసుకోలేకపోతున్నారు. ఈ తరుణంలో ఓ కీలక విషయం వెలుగులోకి వచ్చింది. అకస్మాత్తుగా సంభవించే మరణాలకు హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ కూడా కారణమని కొన్ని వాస్తవ పరిణామాలు రుజువు చేస్తున్నాయి. ఈ రోజుల్లో అందంగా కనిపించాలని కొందరు, పెళ్లి కావాలని మరికొందరు ఇలా ఏదో ఒక కారణంతో చాలా మంది హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ పై ఆసక్తి కనబరుస్తున్నారు. కానీ ప్రస్తుత జనరేషన్ లో సమయం లేకపోవడం, సరైన సమయానికి తినకపోవడం, నిద్ర లేకపోవడంతో అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. దీంతో చాలా మంది ఆరోగ్య సమస్యలతో పాటు జుట్టు రాలే సమస్యనూ ఫేస్ చేస్తున్నారు. 

పురుషులలో అయితే ఈ కాలంలో ఈ సమస్య మరింత ఎక్కువగా కనిపిస్తోంది. చాలా మందికి బట్టతల వస్తుండడంతో పెళ్లి మరింత ఆలస్యమవుతోంది. దీంతో పురుషులకు ఇది కూడా ఓ సమస్యగా మారుతోంది. ఈ నేపథ్యంలో బట్టతల లేదా తక్కువ జుట్టు ఉన్న వారు జుట్టు మార్పిడి చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే దీనివల్ల ఆకస్మిక మరణాలు జరుగుతున్నాయని ఢిల్లీలోని ఓ ఘటన నిరూపించింది. ఓ క్లినిక్‌లో హెయిర్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ చేయించుకున్న రషీద్ అనే వ్యక్తికి కొన్ని రోజులయ్యాక తలలో వాపులు వచ్చాయని, ఆ తర్వాత కిడ్నీలు కూడా పనిచేయడం ఆగిపోయాయని అతని తల్లి వాపోయింది. ఇతర అవయవాలు కూడా పాడయ్యి, ముఖమంతా ఉబ్బిపోయిందని, చనిపోయే ముందు ఆఖరి గంటల్లో అతని శరీరం అంతా దద్దుర్లు వచ్చాయని చెప్పింది. దీనిపై కంప్లైంట్ చేయడంతో శస్త్రచికిత్స చేసిన ఇద్దరు వ్యక్తులతో సహా నలుగురిని అరెస్టు చేసి విచారణ జరుపుతున్నామని పోలీసులు వెల్లడించారు. అయితే నిజానికి హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ వల్ల ఇబ్బందులేమీ కలగవు. కానీ కొందరు మోసపూరిత వ్యక్తుల వల్ల ఈ రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదురవుతున్నాయని వైద్యులు చెబుతున్నారు.