ఇంట్లో చోరీకి పాల్పడిన దొంగ అరెస్ట్

ఇంట్లో చోరీకి పాల్పడిన దొంగ అరెస్ట్

హాలియా, వెలుగు : ఓ ఇంట్లో చోరీకి పాల్పడిన దొంగను నిడమనూరు పోలీసులు అరెస్టు చేశారు. గురువారం హాలియా పోలీస్ స్టేషన్​లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు వివరాలు వెల్లడించారు. నిడమనూరు మండలం ముకుందాపురం గ్రామానికి చెందిన షేక్  ఉస్మాన్ అతడి కుటుంబ సభ్యులు ఆగస్టు 17న రుద్రారం గ్రామంలో జరిగే పీర్ల పండుగకు వెళ్లారు. 

అదే గ్రామానికి చెందిన షేక్ అబ్దుల్ నబీ సుతార్ ఉస్మాన్ కుటుంబ సభ్యులు ఊరికి వెళ్లిన విషయం తెలుసుకొని అదే రోజు రాత్రి 8 గంటలకు వారి ఇంటి తాళం పగలగొట్టి బీరువాలో ఉన్న రూ.73 వేల నగదు, 12 తులాల బంగారం, 15 తులాల వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లాడు. బాధితుడు ఉస్మాన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిడమనూరు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. 

నల్గొండ సీసీ ఎస్ సీఐ జితేందర్ రెడ్డి, నిడమనూరు పోలీసులు కలిసి దర్యాప్తులో భాగంగా దొంగను అరెస్టు చేశారు. దీంతో అతడి వద్ద  నుంచి 10 తులాల బంగారు ఆభరణాలు, 15 తులాల వెండి పట్టీలు, బైక్, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని నిడమనూరు కోర్టులో హాజరుపర్చి రిమాండ్ కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. సమావేశంలో సీఐలు జనార్దన్ గౌడ్, జితేందర్ రెడ్డి, ఎస్ఐలు డి.సతీశ్ రెడ్డి, గోపాలరావు తదితరులు పాల్గొన్నారు.