
హైదరాబాద్, వెలుగు: కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ (సీఎస్ఆర్) ప్రాజెక్ట్ పేరుతో ఓ అంతర్రాష్ట్ర ముఠా భారీ మోసానికి తెరతీసింది. మధ్యప్రదేశ్ కేంద్రంగా సంస్థను స్థాపించి దేశవ్యాప్తంగా ఎన్జీఓలకు రూ.కోట్లు కుచ్చుటోపి పెట్టింది. ‘ఒనెక్స్ మెడికల్ అండ్ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ సొసైటీ’ తమను మోసం చేసిందని ఎన్జీఓ సంస్థల నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎల్బీనగర్, కేపీహెచ్ బీ పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన చీటింగ్ కేసుల్లో పురోగతి లేకపోవడంతో బాధితులు మానవహక్కుల కమిషన్ ను ఆశ్రయించారు.
మధ్యప్రదేశ్ రెవా జిల్లా నెహ్రూనగర్ లో ఏర్పాటు చేసిన ‘ఒనెక్స్ మెడికల్ అండ్ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ సొసైటీ’ దేశవ్యాప్తంగా సీఎస్ఆర్ ప్రాజెక్ట్ ను ప్రారంభించింది. ‘ఒనెక్స్ ఇండియా’ పేరుతో ఈ ప్రాజెక్ట్ కింద స్కిల్ డెవలప్ మెంట్ కోసం ఎన్జీఓలతో ఒప్పందం కుదుర్చుకుంది. నిరుద్యోగ యువతతో పాటు గృహిణుల స్వయం ఉపాధి కోసం శిక్షణ ఇచ్చేలా ప్రాజెక్ట్ రూపొందించారు. ఈ ప్రాజెక్ట్ లో ట్రైనింగ్ సెంటర్లు నిర్వహించేందుకు తెలంగాణ, ఏపీతో పాటు దేశవ్యాప్తంగా ట్రైనింగ్ సెంటర్లను ఎన్జీఓలు రిజిష్టర్ చేసుకున్నాయి. రిజిస్ట్రేషన్ ఫీజ్ తో పాటు అగ్రిమెంట్ ప్రకారం చెల్లించాల్సిన రుసుం ఎన్జీఓలు చెల్లించారు. అందుకోసం రాష్ట్రంలో సుమారు 37 ఎన్జీఓ సంస్థల నిర్వాహకులు ‘ఒనెక్స్ ఇండియా’ ఆధ్వర్యంలో ట్రైనింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారు.
బ్యూటిషియన్, టైలరింగ్, మల్టీమీడియా, పీజీడీసీఏ, రిటైల్ మార్కెటింగ్ లాంటి కోర్సుల్లో ట్రైనింగ్ ఇచ్చారు. ఒనెక్స్ ఇండియాతో ఒప్పందం చేసుకుని రాష్ట్రంలోని ఎక్సెల్ టెక్నాలజీస్, విజయక్రిష్ణ స్కిల్ డెవలప్ మెంట్ అకాడమీ, ద్వారక ఎడ్యుకేషనల్ సొసైటీ, బంజారా ట్రైబల్ ఎన్జీఓతో పాటు మరో 33 NGOలు ఇలా నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చాయి.
30 రోజుల నుంచి ఆరు నెలల పాటు వివిధ కోర్సుల్లో ట్రైనింగ్ ఇచ్చారు. ఒక్కో సెంటర్లో సుమారు వంద మందికి తగ్గకుండా ట్రైనింగ్ పొందారు. ఇలా ట్రైనింగ్ పొందిన ప్రతి అభ్యర్థి కోసం రూ.3 వేల నుంచి 4 వేల ఫీజ్ ను ఒనెక్స్ ఇండియాకు చెల్లించారు. ప్రాజెక్ట్ పూర్తైన తరువాత NGOలతో ఒనెక్స్ చేసుకున్న ఒప్పందం ప్రకారం తిరిగి డబ్బులు చెల్లించాలి. సొంత ఖర్చులతో ట్రైనింగ్ సెంటర్లను ఏర్పాటు చేసుకున్న NGOలు ఒనెక్స్ ఇండియాకు తొలుత ఫీజులు చెల్లించారు. ఐతే కోర్సుల గడువు పూర్తైనా తమకు రావలసిన డబ్బు రాకపోవడంతో ఒనెక్స్ ఇండియా సంస్థపై ఆరా తీశారు.
మధ్యప్రదేశ్ రెవా జిల్లాకు వెళ్లి సంస్థ అధ్యక్షుడు ధర్మేంద్ర సింగ్ ను కలిశారు. దీంతో బాధితులను నమ్మించేందుకు ఒనెక్స్ మెడికల్ అండ్ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ సొసైటీ పేరుతో చెక్కులు ఇచ్చారు. ఆ తరువాత బ్యాంకులో డిపాజిట్ చేసిన చెక్కులు బౌన్స్ అయ్యాయి. అనేకసార్లు ఇలా జరగడంతో తమకు రావలసిన డబ్బుతో పాటు తాము ఒనెక్స్ ఇండియాకు చెల్లించిన డబ్బు కూడా నష్టపోయామని గుర్తించారు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు.
లక్ష నుంచి రూ. 1.5 కోట్ల వరకు…
సీఎస్ఆర్ ప్రాజెక్ట్ పేరుతో ఒనెక్స్ ఇండియా తమను మోసం చేసిందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇలా ఒక్కో ఎన్జీఓ తమ సెంటర్ నుంచి సుమారు లక్ష నుంచి రూ.1.5 కోట్ల వరకు ఒనెక్స్ అకౌంట్లలో డిపాజిట్ చేశారు. దీంతోపాటు వారి వద్ద ట్రైనింగ్ పొందిన అభ్యర్థులకు అర్హత సర్టిఫికెట్లు కూడా ఇవ్వకుండా సంస్థ మోసం చేసిందని బాధిత ఎన్జీఓలు ఆందోళన వ్యక్తం చేశారు. ఒనెక్స్ఇండియా సంస్థ అధ్యక్షుడు ధర్మేంద్ర సింగ్ పథకం ప్రకారమే సీఎస్ఆర్ ప్రాజెక్ట్ పేరుతో తమను మోసం చేశాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపారు.