ఫేక్ సర్టిఫికెట్లను నివారించేందుకు వెబ్ పోర్టల్

ఫేక్ సర్టిఫికెట్లను నివారించేందుకు వెబ్ పోర్టల్

ఫేక్ సర్టిఫికెట్లను నివారించేందు కు రాష్ట్ర సర్కారు  వెబ్ పోర్టల్ అందుబాటులోకి తెచ్చింది. www.tsche.ac.in వెబ్ సైట్​లో 15 వర్సిటీల పరిధిలో చదివిన 25 లక్షల మంది వివరాలు ఉంచారు.

హైదరాబాద్, వెలుగు: ఫేక్ సర్టిఫికెట్లను నివారించేందుకు రాష్ట్ర సర్కారు చర్యలు తీసుకుంటోందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. అందులో భాగంగానే వెబ్ పోర్టల్ తెచ్చామన్నారు. ప్రస్తుతం డిగ్రీ, పీజీ, పీహెచ్​ డీ సర్టిఫికెట్లు మాత్రమే వెబ్ పోర్టల్​లో అందుబాటులో ఉన్నాయని, త్వరలోనే టెన్త్, ఇంటర్ సర్టిఫికెట్లను కూడా పోర్టల్​లో పెడతామని చెప్పారు. శుక్రవారం ఉన్నత విద్యామండలి ఆఫీసులో స్టూడెంట్ అకడమిక్ వెరిఫికేషన్ సర్వీస్ (ఎస్​ఏవీఎస్​) పోర్టల్​ను డీజీపీ మహేందర్ రెడ్డి, కౌన్సిల్ చైర్మన్ లింబాద్రి, వైస్ చైర్మన్ వెంకటరమణ, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణతో కలిసి ఆమె ప్రారంభించారు. విద్యాశాఖలో రాష్ట్రం ఒక మైలురాయిని చేరుకున్నదన్నారు. మనం అభివృద్ధి చేసి చూపెడితే దేశం మనల్ని ఫాలో అవుతుందని సీఎం కేసీఆర్ చెప్తుంటారని, ఈ వెబ్ పోర్టల్ ఏర్పాటు కూడా అదే విధానంలో ఉంటుందని మంత్రి చెప్పారు. ఉద్యోగాల కోసం కొంతమంది ఫేక్ సర్టిఫికెట్లను ఆశ్రయిస్తున్నారని, ఫేక్ సర్టిఫికెట్ల కల్చర్​కు అడ్డుకట్ట వేసేందుకు ఈ వెబ్ పోర్టల్ ఉపయోగపడుతుందని డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. దీని ద్వారా విద్యార్థి ఎక్కడ చదివాడు.. ఏ వర్సిటీ నుంచి, ఎప్పుడు పాసయ్యాడు అనేది ఈజీగా తెలుసుకోవచ్చని తెలిపారు. ప్రస్తుతం 2010 నుంచి 2021 వరకు రాష్ట్రంలోని 15 వర్సిటీల పరిధిలో చదివిన 25 లక్షల మంది స్టూడెంట్ల వివరాలు పోర్టల్​లో ఉన్నాయని లింబాద్రి, వెంకటరమణ చెప్పారు. 

28 భాషల్లో కౌన్సిల్ వెబ్ సైట్​

హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ వెబ్ సైట్​ను 28 భాషాల్లో రీడిజైన్ చేశారు. www.tsche.ac.in వెబ్ సైట్​ను మంత్రి సబిత ఆవిష్కరించారు. రాష్ట్రంలోని విద్యారంగానికి సంబంధించి, ప్రపంచవ్యాప్తంగా అందరికీ చేరవేసేందుకు దీన్ని అందుబాటులోకి తెచ్చినట్టు కౌన్సిల్ చైర్మన్ లింబాద్రి చెప్పారు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్​తో పాటు మలయాళం, తమిళం,ఉర్దూ, సంస్కృతం, ఫ్రెంచి, జర్మన్, స్పానిష్, ఇండోనేషియన్, డచ్,అరబిక్, చైనీస్, రష్యన్, ఐరిష్, పర్షియన్, నేపాలీ, మరాఠా, కన్నడ, మంగోలియన్, తాయ్, గుజరాతీ, ఇటాలియన్, హంగేరియన్ తదితర భాషల్లో వెబ్ సైట్ రూపొందించినట్టు తెలిపారు.