కరోనా హాస్పిటల్స్ వివరాల కోసం ఓ వెబ్‌సైట్

కరోనా హాస్పిటల్స్ వివరాల కోసం ఓ వెబ్‌సైట్

కరోనా సోకిన వాళ్లలో టైంకి ట్రీట్​మెంట్​ అందక చనిపోయిన వాళ్లే ఎక్కువ. నాలుగైదు హాస్పిటల్స్​ తిరిగినా కూడా ఎక్కడా సరైనా చికిత్స దొరక్క ఊపిరి వదిలినోళ్లు చాలామందే. కరోనా బారినపడి మంచి హాస్పిటల్​ కోసం వెతికే వాళ్లకు అహ్మదాబాద్​కు చెందిన ఇంజనీర్​ శివం ధ్రువ తయారుచేసిన ‘కొవిడ్​ట్వీట్​’ వెబ్​సైట్​ సాయం చేస్తోంది.  ఏ హాస్పిటల్​లో బెడ్స్​ ఖాళీ ఉన్నాయి, వెంటిలేటర్​, ఆక్సిజన్​ ఫెసిలిటీ ఉంది వంటి వివరాలను ఈ వెబ్​సైట్​లో చూడొచ్చు. 

బాగా దగ్గరి వాళ్లు, మనతో కలిసి ఉన్నవాళ్లు చనిపోతే ఆ బాధ చెప్పలేం. శివం ధ్రువ ఫ్యామిలీ డ్రైవర్​ కరోనాతో చనిపోయాడు. అతడికి ట్రీట్​మెంట్​ చేయించేందుకు చాలా దవాఖానలు తిరిగారు కుటుంబ సభ్యులు. అయితే ఏ హాస్పిటల్​​లో బెడ్స్, వెంటిలేటర్, ఆక్సిజన్​ వసతులున్నాయో ముందే తెలిస్తే తమ డ్రైవర్​ బతికేవాడని అనుకున్నాడు శివం ధ్రువ. “మా డ్రైవర్​కు 40 ఏళ్లు. ఆరోగ్యంగానే ఉండేవాడు. అతను కరోనాతో చనిపోవడంతో నేను షాక్​ అయ్యాను. ఎక్కడ అన్ని వసతులు ఉన్నాయో తెలియక పోవడం వల్ల చాలామంది కరోనా పేషెంట్స్​ ఇబ్బంది పడడం చూశాను. అప్పుడే నా ఫ్రెండ్​ మహేంద్ర రాథోడ్ తో కలిసి కొవిడ్​ చికిత్సకు సంబంధించిన తాజా విషయాలతో ఉన్న ‘కొవిడ్​ ట్వీట్​’ వెబ్​సైట్​ను రెండు రోజుల్లోనే​ డెవలప్​ చేశాను. కరోనాకు వెంటనే ట్రీట్​మెంట్​ అందాల్సిన వాళ్లకు ఈ వెబ్​సైట్​​ ఎంతో ఉపయోగపడుతుంది”అంటున్నాడు ఈ యువ ఇంజనీర్​.

ఇలా పనిచేస్తుంది
కరోనా చికిత్స వివరాలతో సగటున రోజుకు వీళ్ల వెబ్​సైట్లో 50 వేల ట్వీట్లు వస్తాయి. వీటిలో పది వేల ట్వీట్లు కాంటాక్ట్ నెంబర్లతో ఉంటాయి. వచ్చిన ట్వీట్లను ఈ వెబ్​సైట్లోని ఆల్గారిథమ్​ సెపరేట్​ చేస్తుంది. వెరిఫై చేసిన ట్వీట్లను హ్యాష్​ట్యాగ్​, కీబోర్డ్​ ద్వారా గుర్తిస్తారు.  ఇందులో ట్వీట్​ చేసేందుకు లాగిన్​, సైనిన్​ కావాల్సిన అవసరం లేకపోవడంతో ఎవరైనా ట్వీట్​ చేయొచ్చు. ​‘కొవిడ్​ట్వీట్​’ వెబ్​సైట్​ ఇన్​స్టాల్ చేసుకున్నవాళ్లు సోషల్​ నెట్​వర్కింగ్​ సైట్లో ఉన్నా, ఏ గ్రూప్​లో ఉన్నా కూడా వాళ్ల టైమ్​లైన్​లో బెడ్​ రిక్వెస్ట్స్, వెంటిలేటర్స్, ప్లాస్మా దాత వంటి వివరాలన్ని అప్​డేట్​ అవుతాయి. అన్ని రాష్ట్రాల్లోని హాస్పిటల్స్​ వివరాలు ఇందులో ఉంటాయి. ఈ వెబ్​సైట్లో​ ఒక ట్వీట్​ 4 రోజులు ఉంటుంది. 4 రోజులు దాటిన ట్వీట్లను ప్రతి ఆరు గంటలకు ఒకసారి ఆల్గారిథమ్​ తొలగిస్తుంది. 

ఎక్కువ మందికి సాయం
‘‘ఈ కష్టకాలంలో వీలైనంత మందికి సాయం చేసేలా మా వెబ్​సైట్​ను డెవలప్​ చేయాలనుకుంటున్నా. ట్వీట్లు ఎక్కువ వస్తుండడంతో డేటా స్టోర్​ కోసం పెద్ద సర్వర్​ కావాలని మా కంపెనీలో అడిగాను. వాళ్లు ఎక్కువ ట్వీట్లను స్టోర్​ చేసే పెద్ద ప్రొడక్షన్​ సర్వర్​ ఇస్తామన్నారు.’’
- శివం ధ్రువ, ‘కొవిడ్​ట్వీట్​’ కో ఫౌండర్​