భర్త అడ్డు తొలగించుకుందామనుకుంది... కానీ చివరికి

భర్త అడ్డు తొలగించుకుందామనుకుంది... కానీ చివరికి

ప్రియుడితో కలిసి ఓ ఇల్లాలు కట్టుకున్న భర్తను హత్య చేయాలనుకుంది. అందుకోసం కొందరు రౌడీలకు సుపారీ కూడా ఇచ్చింది. కానీ ఎవరు తీసిన గోతిలో వారే పడతారన్నట్లు  చివరికి ప్రియుడి ప్రాణాలు పోవడంతో షాక్ కు గురైంది. పోలీసులు అరెస్ట్  చేయడంతో  కటకటాలు లెక్కబెడుతోంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన జులై 23న బెంగళూరులో జరిగింది.

ఇక వివరాల్లోకి వెళ్తే...  

బెంగళూరుకు చెందిన అనుపల్లవికి కొన్నేళ్ల క్రితం నవీన్ కుమార్ అనే వ్యక్తితో వివాహమైంది. కొంతకాలం పాటు వారి దాంపత్య జీవితం హ్యాపీగానే సాగింది. అయితే అనుపల్లవి హిమవత్ కుమార్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధాన్ని ఏర్పరుచుకుంది. దీంతో దంపతుల మధ్య తరచుగా గొడవలు జరిగేవి. ఈ క్రమంలోనే  భర్తను హత్య చేయించేందుకు ప్రియుడితో కలిసి అనుపల్లవి ప్లాన్ వేసింది. అనుకున్నదే తడవుగా హరీశ్, నాగరాజ్, ముగిలన్ అనే  వ్యక్తులతో  రూ.2 లక్షలకు సుపారీ కుదుర్చుకుంది. ముందుగా రూ.90 వేలు అడ్వాన్స్ ఇచ్చి... మిగతావి పని అయ్యాక ఇస్తానని చెప్పింది. ఇక పనిలోకి దిగిన కిరాయి హంతకులు ఆమె భర్త నవీన్ కుమార్ ను కిడ్నాప్ చేసి తమిళనాడుకు తీసుకెళ్లారు. కానీ అతడిని చంపడానికి వాళ్లకు ధైర్యం సరిపోలేదు. దీంతో వాళ్లు మంచి ఫ్రెండ్స్ గా మారారు. మందు పార్టీ కూడా చేసుకున్నారు. 

ఇక అనుపల్లవి తన భర్త హత్య గురించి  కిరాయి రౌడీలకు ఫోన్ చేసి ఆరా తీసింది. దీంతో ఆ ముగ్గురు భర్తను హత్య చేసినట్లు ఆమెతో అబద్ధం చెప్పారు. ప్రూఫ్ గా టమాట కెచప్ ఆమె భర్త శరీరంపై చల్లి ... ఆ పోటోలను ఆమెకు పంపించారు. ఫోటోలను చూసిన ఆమె ప్రియుడు హిమవత్ కుమార్ తీవ్ర భయాందోళనకు గురయ్యాడు. పోలీసులు అరెస్ట్ చేస్తారన్న భయంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో ప్రియుడితో కలిసి  జీవిద్దామనుకున్న  అనుపల్లవి షాక్ కు గురైంది. ఇదిలా ఉండగా వారం రోజుల తర్వాత భర్త తిరిగి రావడం, పోలీసులకు జరిగిందంతా చెప్పడంతో ఆ ఇల్లాలు ఖంగుతింది. పోలీసులు రంగప్రవేశం చేసి సుపారీ గ్యాంగ్ తో పాటు ఆమెను, ఆమెకు సహకరించిన ఆమె తల్లిని అరెస్ట్ చేశారు. అటు భర్తకు దూరం అయ్యి, ఇటు ప్రియుడిని కోల్పోయి ప్రస్తుతం ఆమె కటకటాలు లెక్కబెడుతోంది.