నిర్మల్, వెలుగు: నిర్మల్ కలెక్టరేట్ పైకి ఎక్కి ఓ మహిళ హల్ చల్ చేసింది. రెండేళ్ల కింద తన ఖాళీ స్థలంలో నిర్మించుకున్న బేస్మెంట్ ఉండగానే, తనకు ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలంటూ భైంసా మండలం దేగామ గ్రామానికి చెందిన గంగామణి చాలా రోజుల నుంచి అధికారులను కోరుతోంది. ఇది నిబంధనలకు విరుద్ధమని పాత బేస్మెంట్ తొలగించి ఖాళీ స్థలాన్ని చూపితేనే ఇందిరమ్మ ఇల్లు మంజూరు అవుతుందని అధికారులు నచ్చజెబుతూ వస్తున్నారు.
ఈక్రమంలో సోమవారం నిర్మల్‌కు వచ్చిన ఆమె కలెక్టరేట్ పైకి ఎక్కి తాను ఆత్మహత్య చేసుకుంటానని హల్ చల్ చేసింది. ఇది గమనించిన ఉద్యోగులు ఆమెను కిందికి తీసుకువచ్చారు. ఈక్రమంలో ఆమె చేతికి స్వల్ప గాయాలయ్యాయి. కలెక్టర్ తో పాటు పోలీసులు ఆమెకు నచ్చజెప్పి పంపించారు.
