డిజిటల్‌ అరెస్టు.. ఇండియాలో మరో సరికొత్త సైబర్‌ స్కామ్

డిజిటల్‌ అరెస్టు.. ఇండియాలో మరో సరికొత్త సైబర్‌ స్కామ్

ఈ మధ్య రోజుకో కొత్తరకం సైబర్ స్కామ్ పుట్టుకొస్తుంది. మోసం చేయడానికి కొత్తకొత్త ఎత్తుగడలు ఆలోచిస్తున్నారు సైబర్ నేరగాళ్లు. ఏదో ఒక ఆశ చూపి మాయ చేసే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఓ మహిళకు వింత అనుభవం ఎదురైంది. డిజిటల్‌ అరెస్టు పేరుతో ఆమె నుంచి రూ.11.11 లక్షలను సైబర్‌ నేరగాళ్లు దోచుకున్నారు. నోయిడా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఈ తరహా కేసు నమోదు కావడం ఇదే ఫస్ట్ టైం. తమను ఐపీఎస్‌, సీబీఐ అధికారులుగా పరిచయం చేసుకున్న నేరగాళ్లు.. ఈ దోపిడీకి పాల్పడినట్లు నోయిడా పోలీసులు చెప్పారు. 

నోయిడాలోని ఓ మహిళకు నవంబర్‌ 13వ తేదీన ఐవీర్‌ (ఇంటరాక్టివ్‌ వాయిస్‌ రెస్పాన్స్‌) కాల్‌ వచ్చింది. ఆమె ఆధార్‌ కార్డు నెంబర్‌తో ఎవరో సిమ్‌కార్డు కొనుగోలు చేసి మహిళలను వేధించారని చెబుతూ... ఆ కాల్‌ వేరే వ్యక్తికి ట్రాన్స్‌ఫర్‌ అయ్యింది. తనను నోయిడా పోలీస్‌ అధికారిగా పరిచయం చేసుకున్న అవతలి వ్యక్తి.. ఈ కేసుపై విచారణ చేపట్టాలని.. అందుకోసం ఆన్‌లైన్‌లో స్కైప్‌ ద్వారా కనెక్టయి ఉండాలని చెప్పాడు. స్కైప్‌ ద్వారా ఆమెను విచారించిన అతడు.. మహిళపై మనీలాండరింగ్‌ కేసు కూడా నమోదై ఉన్నట్లు చెప్పాడు. సుప్రీంకోర్టు అరెస్టు వారెంట్‌ జారీ చేసిందని భయపెట్టాడు.

ఈ విచారణ చాలా గోప్యంగా జరగాలని, బయటి వాళ్లకి చెబితే, శిక్ష మరింత పెరిగే అవకాశముందని సదరు మహిళను హెచ్చరించాడు. తన విచారణ ముగిసిందని, ముంబయి నుంచి వేరే అధికారి విచారణ చేస్తాడని చెప్పి... స్కైప్‌ ఐడీని ఆమెకు ఇచ్చాడు. వీలైనంత త్వరగా విచారణ పూర్తి చేయాలని ఆయన్ని కోరాలని చెప్పాడు.

ఇంతలోనే స్కైప్‌లో కనెక్టయిన మహిళను సీబీఐ అధికారిగా చెప్పుకొన్న మరో సైబర్ నేరగాడు విచారణ చేసినట్లు నమ్మించాడు. మనీలాండరింగ్‌కు పాల్పడిన ఓ ఎయిర్‌లైన్స్ సంస్థ వ్యవస్థాపకుడి ఇంట్లో 246 డెబిట్‌కార్డులు లభ్యమయ్యాయని, అందులో మీ పేరుతో ఉన్న కార్డు కూడా ఉందని చెప్పాడు. మీ ఖాతాకు రూ.2 కోట్లు ట్రాన్స్‌ఫర్‌ అయ్యాయని, అందుకు ఎయిర్‌లైన్స్‌ సంస్థ రూ.20 లక్షలు చెల్లించిందని చెప్పాడు. కోర్టు ఆదేశాల మేరకు ఆ మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని లేదంటే.. కఠిన శిక్ష ఉంటుందని మహిళను బెదిరించాడు. 

డబ్బు మొత్తాన్ని ఐసీఐసీఐ అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్‌ చెయ్యాలని, అక్కడి నుంచి అక్కడి నుంచి పీఎఫ్‌సీ ఖాతాకు బదిలీ చేయాలని చెప్పాడు. తనకేమీ తెలియదని ముందుగా మహిళ చెప్పింది. రకరకాలుగా ఆమెను బెదిరించాడు. చివరికి భయపడిన సదరు మహిళ తన పేరిట ఉన్న వివిధ ఖాతాల్లోని రూ.11.11 లక్షల సొమ్మును ఐసీఐసీఐకి బదిలీ చేసింది. అంతకు ముందే ఆ ఖాతా వివరాలు తీసుకున్న సైబర్‌ నేరగాళ్లు.. ఒకేసారి ఆ మొత్తాన్ని దోచుకున్నారు. ఆ తర్వాత అసలు విషయం తెలుసుకుని షాక్ అయ్యింది. లబోదిబోంటూ నోయిడా సైబర్‌ క్రైం పోలీసులను ఆశ్రయించింది. తనకు న్యాయం చేయాలని పోలీసులను వేడుకుంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న నోయిడా పోలీసులు.. దర్యాప్తు ముమ్మరం చేశారు.