నాన్న గుర్తుగా.. బేకరీ నడుపుతోంది

నాన్న గుర్తుగా.. బేకరీ నడుపుతోంది

అప్పటివరకు అన్నీ తానై కుటుంబాన్ని నడిపించిన తండ్రి చనిపోయాడు. కానీ, ఆ బాధలోనే ఉండిపోవాలనుకోలేదు కూతురు. తమలాంటి కష్టం మరొకరికి వద్దనుకుంది. దానికోసం తన తండ్రికి ఇష్టమైన ఫుడ్​నే బిజినెస్​గా మార్చుకుంది. తండ్రి పేరుతో బేకరీ పెట్టి  సక్సెస్​ఫుల్​గా నడిపిస్తోంది. దాని ద్వారా వచ్చే 
లాభాల్ని కూడా ట్రీట్​మెంట్​కి డబ్బులేక ఇబ్బంది పడుతున్న పేదవాళ్ల కోసం ఖర్చు చేస్తోంది. అలా ఇప్పటివరకు ఎంతోమంది ప్రాణాలు కాపాడింది 23 యేండ్ల 
స్వాతి అరుణ్​. ఆమె ఇన్​స్పిరేషనల్​ జర్నీ ఇది. ఏ కూతురికైనా నాన్నను మించిన సూపర్​ హీరో ఉండడు. అయితే  నా విషయంలో నాన్న నా హీరో మాత్రమే కాదు... ఎమోషనల్​ అండ్​ మోరల్​ సపోర్ట్​ కూడా. అన్నింటికన్నా ముఖ్యంగా నా బెస్ట్​ ఫ్రెండ్​ అంటుంది స్వాతి. ఆయన ఉన్నాడన్న ధైర్యమే నన్ను ఎప్పుడూ ముందడుగు వేయిస్తుంది. అలాంటి నాన్న సడెన్​గా​ చనిపోవడం నన్ను చీకట్లోకి నెట్టేసింది. బతకాలన్న ఆశని పట్టుకెళ్లింది. కానీ, అక్కడితో నా జీవితం ఆగిపోతే నాన్న సంతోషంగా ఉండరు కదా!. అందుకే జీవితంతో పోరాడాలనుకున్నా.. నాన్న జ్ఞాపకాలతోనే  కొత్త జీవితం మొదలుపెట్టాలనుకున్నా. అలా వచ్చిందే ఈ బేకరీ ఐడియా అంటూ  తన కథంతా చెప్పుకొచ్చింది స్వాతి.
 

అన్నీ ఫెయిలే


‘‘నేను పుట్టి, పెరిగిందంతా ఢిల్లీలోనే.  అమ్మ చేతి కమ్మటి  వంట.. నా కుకింగ్​పై నాన్న వేసే సెటైర్లు.. చెల్లితో గిల్లికజ్జాలు ఇదే నా ప్రపంచం. వీకెండ్స్​ వస్తే చాలు.. ఫ్యామిలీ అంతా  ఏదో ఒక పిక్నిక్​ స్పాట్​కి చేరుకునేవాళ్లం. అందరం కలిసి వంట చేసేవాళ్లం. ఎక్కువగా బనానా వాల్​నట్​, మార్బుల్​ కేక్స్​ తయారుచేసేవాళ్లం. అప్పుడప్పుడు కొత్త రకం వంటకాల్ని కూడా ట్రై చేసేదాన్ని నేను. కానీ, అడుగంటి పోయి తినడానికి పనికొచ్చేవి కాదు. లేదంటే ఉడికీ ఉడక్కుండానే స్టవ్ ఆపేసేదాన్ని. కిచెన్​ పరిస్థితి అయితే  మాటల్లో చెప్పలేను. అవి  చూసి నాన్న  నన్ను ఏడిపించేవాళ్లు. ‘‘నీ వంట తినిపించి నన్ను హాస్పిటల్​ పాలు చేయాలనుకుంటున్నావా? నా పళ్లు విరగొట్టాలనుకుంటున్నావా?’’ అంటుండే వాళ్లు ఎప్పుడూ. ఆ సరదాల మధ్యనే నాన్నకి పారిస్​లో ఉద్యోగం వచ్చింది. అప్పట్నించీ సెలవుల్లో మేము ఆయన దగ్గరకి వెళ్లడమో.. లేదా ఆయన ఇండియాకి రావడమో  జరిగేది. అలా నాన్న బర్త్​ డే కోసం ప్యాండెమిక్​కి ముందు చివరిసారి పారిస్​ వెళ్లాం. 

ఆ బాధని మాటల్లో చెప్పలేను

నాన్న బర్త్​డే కోసం అమ్మ, చెల్లి ఏవేవో సర్​ప్రైజ్​లు ప్లాన్​ చేశారు. కానీ, నేను మాత్రం నాన్న కోసం  స్పెషల్​గా కేక్​ తయారుచేయాలనుకున్నా. అది కూడా పర్ఫెక్ట్​గా. నాన్నపై నాకున్న ప్రేమనంతా కలిపి చేశా ఆ కేక్​​.. అందుకే లైఫ్​లో ఫస్ట్​ టైం బాగా వచ్చింది. నాన్న మనసారా తిన్నారు కూడా. ఆ తర్వాత కొన్నిరోజులకే పరిస్థితులన్నీ మారిపోయాయి. ఒకరోజు ఆఫీసుకి వెళ్తూ దారి మధ్యలోనే కుప్పకూలిపోయారు నాన్న. హాస్పిటల్​లో చేర్పిస్తే కార్డియాక్​ అరెస్ట్​ అన్నారు. సర్జరీ చేసి  స్టెంట్​ వేశారు. ఆ స్టెంట్​ వేసిన నాలుగురోజులకే మళ్లీ కార్డియాక్​ అరెస్ట్​ అయింది. పదిహేడు రోజులు హాస్పిటల్​లో పోరాడి ఓడిపోయారు నాన్న. ఆ బాధ నుంచి బయటపడటానికి తిరిగి ఇండియా రావాలనుకున్నాం. అప్పుడే​ లాక్​డౌన్​ అనౌన్స్​ చేశారు. దాంతో దేశం కాని దేశంలో నాన్న లేరన్న నిజంతో నెలల పాటు సతమతమయ్యాం. పైగా ప్యాండెమిక్​ భయంతో ఇంట్లోంచి కాలు బయటపెట్టలేకపోయాం. బ్రెడ్​ కూడా ఇంట్లోనే బేక్ చేసుకుని తినేవాళ్లం. అలా మూడు నెలల స్ట్రగుల్​ తర్వాత తిరిగి ఢిల్లీ వచ్చేశాం. 

అందుకే పేదవాళ్లకి సాయం చేస్తున్నా

సరిపడా డబ్బు లేకపోవడం వల్ల మా నాన్నకి మంచి​ ట్రీట్​మెంట్​​ ఇప్పించలేకపోయాం. నాన్నలాంటి వాళ్లు మన చుట్టూరా చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్లకి సాయం చేయాలనే బేకరీని నడుపుతున్నా. ప్రస్తుతం 5 లక్షలు ఖర్చు చేసి ఒకరికి స్టెంట్​ వేయించాం. మరొకరికి అపాయింట్​మెంట్ తీసుకున్నాం. అలాగే పారిస్​లో నాన్న ట్రీట్మెంట్​ తీసుకున్న హాస్పిటల్​లో ఎవరైనా పేషెంట్స్​ డబ్బుల్లేక ఇబ్బంది పడుతుంటే.. అక్కడి కార్డియాలజిస్ట్​ మమ్మల్ని కాంటాక్ట్​ అవుతారు. వాళ్లకి కొంతమేర సాయం చేస్తున్నాం. ఫ్యూచర్​లో మరింతమందికి సాయం చేయాలనుకుంటున్నామని చెప్పింది స్వాతి. అంతేకాదు ఈ తల్లీకూతుళ్లు లాక్​డౌన్​లో​ చాలా మంది పేదవాళ్లకి నిత్యావసర సరుకులు పంచారు. 
 

యూట్యూబ్ చూసి.. బేకింగ్​

నాన్న  లేరన్న బాధ నుంచి నాతో పాటు నా కుటుంబాన్ని కూడా బయటపడేయాలను కున్నా. ఆ ప్రయత్నంలో అమ్మతో కలిసి యూట్యూబ్​లో కేక్​ బేకింగ్​ వీడియోలు చూశా. నాన్న ఫుడ్డీ అవడంతో.. ఆయన జ్ఞాపకంగా బేకరీ పెట్టాలని డిసైడ్​ అయ్యా. దాని ద్వారా వచ్చే లాభాల్ని  ట్రీట్​మెంట్​కు​​ డబ్బుల్లేక ఇబ్బంది పడుతున్న పేషెంట్స్​కి ఇవ్వాలనుకున్నా. అమ్మ కూడా ఓకే చెప్పడంతో.. పదివేల పెట్టుబడితో నాన్న పేరు మీద ‘అరుణ్​ బేకరీ’ పెట్టా.  కొద్దిరోజుల్లోనే కస్టమర్స్​ సంఖ్య పెరుగుతూ పోయింది. మౌత్​ పబ్లిసిటీ ద్వారా సిటీలోనే టాప్​ బేకరీల్లో మాది ఒకటిగా నిలిచింది. అమ్మా, నేను ఒక పక్క ఉద్యోగాలు చేస్తూనే ఈ బేకరీ నడుపుతున్నాం. రోజూ ఉదయం ఏడింటి నుంచి పదింటి వరకు బేకింగ్​తో బిజీగా ఉంటాం.  ఆ తర్వాత ఆఫీసుకెళ్లి తిరిగి ఆరింటికి ఇంటికొచ్చేస్తాం. మళ్లీ రాత్రి ఎనిమిది నుంచి పదకొండు వరకు బేకరీలోనే గడుపుతాం. రెండింటీని బ్యాలెన్స్​ చేయడం కష్టమే. కానీ, ఇష్టంతో చేస్తున్నాం.  కాబట్టి అలిసిపోయిన ఫీలింగ్​ రాదు. పైగా మా బేకరీలో ఆర్గానిక్​  ఇంగ్రెడియెంట్స్​ని మాత్రమే వాడతాం.