నా అరెస్ట్ అక్రమం : కేజ్రీవాల్

నా అరెస్ట్ అక్రమం : కేజ్రీవాల్
  • వెంటనే ఈడీ కస్టడీ నుంచి రిలీజ్ చేయాలి 
  • ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్ పిటిషన్ 
  • హోలీ తర్వాత 27న విచారిస్తామన్న హైకోర్టు 

న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ తనను అరెస్ట్ చేయడం చట్ట విరుద్ధమంటూ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చీఫ్, ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ హైకోర్టును ఆశ్రయించారు. స్పెషల్ కోర్టు జారీ చేసిన రిమాండ్ ఆర్డర్ కూడా అక్రమమని, తనను ఈడీ కస్టడీ నుంచి వెంటనే రిలీజ్ చేయాలని కోరుతూ ఆయన ఈ మేరకు శనివారం ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిని అత్యవసర అంశంగా పరిగణించి హైకోర్టు యాక్టింగ్ చీఫ్ జస్టిస్ ఆదివారమే (ఈ నెల 24) విచారణ చేపట్టాలని కోరారు. 

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కేజ్రీవాల్ ను గురువారం రాత్రి అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు శుక్రవారం సాయంత్రం రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చారు. కేసులో ఇంటరాగేషన్ కోసం కోర్టు ఆయనను ఈ నెల 28 వరకూ ఈడీ కస్టడీకి అప్పగించింది. దీంతో ఈడీ అరెస్టుతోపాటు కింది కోర్టు రిమాండ్ ఆర్డర్ ను కూడా సవాల్ చేస్తూ కేజ్రీవాల్ హైకోర్టును ఆశ్రయించారు. 

అయితే, కేజ్రీవాల్ పిటిషన్ ను అత్యవసరంగా విచారించాల్సిన అవసరం లేదని ఢిల్లీ హైకోర్టు శనివారం స్పష్టం చేసింది. ఈ పిటిషన్ పై హోలీ సెలవుల తర్వాత ఈ నెల 27న విచారిస్తామని స్పష్టం చేసింది. కాగా, తనను అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు గురువారం తిరస్కరించింది. ఆ తర్వాత కొన్ని గంటలకే ఈడీ ఆయనను అరెస్ట్ చేయడం గమనించదగ్గ విషయం. మరోవైపు కేజ్రీవాల్ అరెస్టుకు వ్యతిరేకంగా ఢిల్లీలో వారం రోజులపాటు నిరసనలు చేపట్టాలని ఆప్ పిలుపునిచ్చింది. ఢిల్లీలోని ఆప్ ఆఫీస్ వద్ద పోలీసులు 144 సెక్షన్ అమలును కొనసాగిస్తున్నారు. 

ప్రతి రక్తపు బొట్టూ దేశానికే అంకితం: కేజ్రీవాల్ 

ఢిల్లీ ప్రజలు, ఆమ్ ఆద్మీ పార్టీ క్యాడర్ ను ఉద్దేశించి కేజ్రీవాల్ శనివారం ఓ మెసేజ్ లెటర్ ను రిలీజ్ చేశారు. కేజ్రీవాల్ రాసిన లేఖను ఆయన భార్య సునీతా కేజ్రీవాల్ చదివి వినిపించగా, ఆ వీడియోను రికార్డ్ చేసి ఆప్ రిలీజ్ చేసింది. ఆప్ కార్యకర్తలు సమాజ సేవను కొనసాగించాలని ఆ లెటర్ లో కేజ్రీవాల్ సూచించారు. బీజేపీ నేతలు కూడా తమకు అన్నదమ్ములు, అక్కచెల్లెండ్ల వంటి వారేనని, వారితోపాటు ఎవరినీ ద్వేషించొద్దని కోరారు. ‘‘ఇండియాను ప్రపంచంలోనే శక్తిమంతమైన, గొప్ప దేశంగా నిలబెట్టాల్సి ఉంది. 

కానీ దేశంలోని, దేశం వెలుపలి శక్తులు అనేకం ఇండియాను బలహీనపర్చాలని చూస్తున్నాయి. ఇప్పుడు వాటిపై పోరాడాల్సిన అవసరం ఉంది.  నేను జైలులో ఉన్నా, బయట ఉన్నా.. నా జీవితంలోని ప్రతి క్షణం దేశ సేవకే అంకితం. నా ప్రతి రక్తపు చుక్కా దేశానికే అంకితం. నేను పోరాటాలు చేసేందుకే పుట్టాను. భవిష్యత్తులో మరిన్ని పెద్ద సవాళ్లనూ ఎదుర్కొంటా. నన్ను దీర్ఘకాలంపాటు ఊచల వెనక ఉంచగల జైలు లేదు. నేను త్వరలోనే బయటకొస్తా. నా వాగ్దానాలను నిలబెట్టుకుంటా” అని కేజ్రీవాల్ పేర్కొన్నారు. 

ఆ డబ్బులు బీజేపీకే ముట్టినయ్: ఆతిశీ 

ఢిల్లీ లిక్కర్ స్కాంలో కేజ్రీవాల్ ప్రధాన కుట్రదారు అని, డబ్బులు కూడా హవాలా ద్వారా చేతులు మారాయన్న ఈడీ ఆరోపణలను ఆప్ ఖండించింది. శనివారం ఢిల్లీలో మినిస్టర్​అతిశీ మీడియాతో మాట్లాడారు. ‘‘అరబిందో ఫార్మా కంపెనీ ఓనర్ శరత్ చంద్రా రెడ్డి ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగా కేజ్రీవాల్ ను అరెస్ట్ చేశారు. నిజానికి ఆయనే బీజేపీకి ఎలక్టోరల్ బాండ్ల రూపంలో డబ్బులు అందజేశారు” అని చెప్పారు. ‘‘కేజ్రీవాల్​ను తాను ఎన్నడూ కలవలేదని, ఆప్ తో ఎలాంటి సంబంధం లేదన్నందుకే ఆయనను ఈడీ అరెస్ట్ చేసింది. 

ఆ తర్వాత ఆయన మాట మార్చారు. కేజ్రీవాల్ ను కలిశానని, లిక్కర్ పాలసీ గురించి మాట్లాడానని చెప్పిన వెంటనే బెయిల్ వచ్చింది. మరి స్కాంలో చేతులు మారాయంటున్న డబ్బులు ఎక్కడ?” అని ఆమె ప్రశ్నించారు. కాగా, ఢిల్లీలోని ఆప్ ఆఫీసును అన్ని వైపుల నుంచీ క్లోజ్ చేశారంటూ అతిశీ ఆరోపించారు. దీనిపై ఎన్నికల సంఘాన్ని ఆశ్రయిస్తామని తెలిపారు. అయితే, ఢిల్లీ ఆప్ ఆఫీస్ ను సీల్ చేశామన్నది నిజం కాదని పోలీసులు తెలిపారు. అక్కడ 144 సెక్షన్ మాత్రమే అమలులో ఉందన్నారు. 

విచారణ నిష్పక్షపాతంగా జరగాలి

  •     కేజ్రీవాల్ అరెస్ట్​పై జర్మనీ కామెంట్​
  •     ఆ దేశ కామెంట్​పై కేంద్ర ప్రభుత్వం ఫైర్

న్యూఢిల్లీ: కేజ్రీవాల్ పై విచారణ నిష్పక్షపాతంగా జరగాలని జర్మనీ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఒకరు కామెంట్ చేశారు. ఇండియా ఒక ప్రజాస్వామ్య దేశమని, కేజ్రీవాల్ పై నిష్పక్షపాత దర్యాప్తు జరుగుతుందని ఆశిస్తున్నామంటూ ఆయన గురువారం రాత్రి చేసిన కామెంట్లపై మన విదేశాంగ శాఖ ఫైర్ అయింది. జర్మనీ కామెంట్లను ఇండియా తీవ్రంగా ఖండించింది. 

ఇది ఇండియా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమేనని స్పష్టం చేసింది. శనివారం ఉదయం ఢిల్లీలోని జర్మనీ డిప్యూటీ చీఫ్​ఆఫ్ మిషన్ జార్జ్ ఎంజ్విలర్ ను పిలిచి విదేశాంగ శాఖ ఈ మేరకు నిరసనను తెలియజేసింది. ‘‘జర్మనీ వ్యాఖ్యలు మా దేశ న్యాయ వ్యవస్థలో జోక్యం చేసుకోవడంగానే పరిగణిస్తున్నాం. మా దేశ న్యాయవ్యవస్థ స్వతంత్రతను తక్కువ చేసి మాట్లాడటంగానే భావిస్తున్నాం. 

ఇండియా చట్టబద్ధమైన పాలన ఉన్న, శక్తిమంతమైన ప్రజాస్వామ్య దేశం. ప్రపంచంలోని అన్ని ప్రజాస్వామ్య దేశాలలాగే ఇక్కడా చట్ట ప్రకారమే న్యాయ విచారణ కొనసాగుతుంది. ఈ విషయంలో పక్షపాతంతో కూడిన ఊహాత్మక ప్రకటనలు చేయడం ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థనీయం కాదు” అని తేల్చిచెప్పినట్లు విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

ఆప్​వి నీచ రాజకీయాలు: బీజేపీ

లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ అయినా.. సీఎంగా కొనసాగడం దేశ రాజకీయ చరిత్రలోనే అత్యంత దురదృష్టకర విషయమని బీజేపీ విమర్శించింది. ఆప్ నీచ రాజకీయాలు చేస్తోందని ఫైర్ అయింది. కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలు కేజ్రీవాల్​కు మద్దతు ఇవ్వడం కూడా దారుణమని ఈ మేరకు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. ‘‘దొంగలంతా కలిసి సోదరభావాన్ని చాటుకుంటున్నారు” అని ఆయన ఎద్దేవా చేశారు.

తిహార్ జైలుకు స్వాగతం

కేజ్రీవాల్​కు సుఖేశ్ చంద్రశేఖర్ మెసేజ్

కేజ్రీవాల్​ను తిహార్ జైలులోకి స్వాగతిస్తూ ఆర్థిక నేరగాడు సుఖేశ్ చంద్రశేఖర్ మెసేజ్ పెట్టాడు. శనివారం ఈ మేరకు లేఖను రాశాడు. ‘‘నిజం గెలిచింది. తిహార్ జైలులోకి కేజ్రీవాల్​ను స్వాగతిస్తున్నాను. అప్రూవర్​గా మారి ఆయన అసలు రూపాన్ని బయటపెడతా. ఆధారాలు బయటపెట్టి శిక్ష పడేలా చేస్తా’’ అని సుఖేశ్ తెలిపాడు. బీఆర్ఎస్ నాయకురాలు  కవితకు కూడా ఇటీవల ఇలాంటి మెసేజ్​నే సుఖేశ్ పంపించాడు. కాగా, 200 కోట్ల మనీలాండరింగ్ కేసులో ప్రస్తుతం సుఖేశ్ తిహార్ జైలులో ఉన్నాడు.