విడాకులు తీసుకున్న ఆమిర్ ఖాన్ దంపతులు

విడాకులు తీసుకున్న ఆమిర్ ఖాన్ దంపతులు

ముంబై: ప్రముఖ బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ ఆయన భార్య కిరణ్ రావులు విడిపోయారు. 15 ఏళ్ల తమ వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతున్నట్లు ఆమిర్, కిరణ్ రావు ప్రకటించారు. ఇకపై తాము భార్యాభర్తలం కాదని, జీవితాల్లో కొత్త అధ్యయనాన్ని ప్రారంభించబోతున్నట్లు తెలిపారు. కొడుకు ఆజాద్ రావు ఖాన్ పెంపకం బాధ్యతను ఇద్దరమూ కలసి పంచుకుంటామని స్పష్టం చేశారు. అయితే ప్రొఫెషనల్ పరంగా పానీ ఫౌండేషన్ పనులనూ కొనసాగిస్తామని ఓ ప్రకటనలో చెప్పారు.

‘ఈ పదిహేనేళ్లు చాలా అద్భుతంగా గడిచాయి. మేం ఇద్దరమూ కలసి జీవితంలో ఎన్నో అపురూపమైన అనుభవాలు, సంతోషకరమైన క్షణాలను పంచుకున్నాం. మా బంధం నమ్మకం, గౌరవం, ప్రేమతో మరింత బలపడింది. అయితే ఇప్పుడు మా జీవితాల్లో కొత్త అధ్యయనాన్ని ప్రారంభించాల్సిన సమయం ఆసన్నమైంది. ఇకపై మేం భార్యాభర్తలం కాదు. కానీ ఒకరికొకరం ఫ్యామిలీగా, పేరెంటింగ్ బాధ్యతలను  కలసి పంచుకుంటాం’ అని ఆమిర్, కిరణ్ రావులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. లగాన్ మూవీ షూటింగ్‌లో ఆమిర్, కిరణ్ రావు తొలిసారి కలుసుకున్నారు. ఆ సినిమాకు కిరణ్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసింది. అనంతరం 2005, డిసెంబర్ 28న ఇద్దరూ పెళ్లి చేసుకొని ఒక్కటయ్యారు. ఆమిర్‌కు ఇది రెండో వివాహం. ఆయన మొదటి భార్య పేరు రీనా దత్తా. రీనాతో విడిపోయిన తర్వాత కిరణ్‌ రావును ఆయన వివాహం చేసుకున్నాడు. ఆమిర్, రీనా దంపతులకు ఇద్దరు పిల్లలున్నారు. వారి పేర్లు జునైద్ ఖాన్, ఇరా ఖాన్.