నదౌన్: రంజీ ట్రోఫీలో వరుసగా రెండు డ్రాల తర్వాత హైదరాబాద్ విజయం అందుకుంది. అభిరథ్ రెడ్డి (200 బాల్స్‌లో 19 ఫోర్లు, 3 సిక్సర్లతో 175 నాటౌట్) అద్భుత సెంచరీతో విజృంభించడంతో హిమాచల్ ప్రదేశ్‌తో జరిగిన గ్రూప్–డి మ్యాచ్‌లో నాలుగు వికెట్ల తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది.
హిమాచల్ ఇచ్చిన 344 రన్స్ టార్గెట్‌ను 75.3 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి ఛేజ్ చేసింది. ఓవర్‌నైట్ స్కోరు 8/0తో ఆట కొనసాగించినహైదరాబాద్ ఆరంభంలోనే ఓపెనర్ తన్మయ్ అగర్వాల్ (5) వికెట్ కోల్పోయింది. కానీ, రాహుల్ రాధేశ్ (66)తో కలిసి రెండో వికెట్‌కు 145 రన్స్ జోడించిన అభిరథ్ ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు.
ఆపై హిమతేజ (33), రాహుల్ సింగ్ (24), తనయ్ త్యాగరాజన్ (29) తోడుగా జట్టును ఒడ్డుకు చేర్చాడు. అభిరథ్‌కే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఈ విజయంతో మూడు పాయింట్లు అందుకున్న హైదరాబాద్ ఈ నెల 8 నుంచి సొంతగడ్డపై జరిగే తర్వాతి మ్యాచ్‌లో రాజస్తాన్‌తో తలపడనుంది.
