ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ రద్దు

ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ రద్దు
  • అవి రాజ్యాంగ విరుద్ధమంటూ సుప్రీం తీర్పు
  • వెంటనే ఆపేయాలంటూ ఎస్​బీఐకి ఆర్డర్
  • ఇప్పటికే జారీ చేసిన వాటి వివరాలు కోరిన బెంచ్
  • మార్చి 31 లోగా వెబ్ సైట్​లోఉంచాలంటూ ఈసీఐకి సూచన
  • సీజేఐ నేతృత్వంలోని ఐదుగురు జడ్జిల రాజ్యాంగ ధర్మాసనం తీర్పు

న్యూఢిల్లీ, వెలుగు: రాజకీయ పార్టీలు అందుకునే విరాళాలలో పారదర్శకత కోసం కేంద్రం తీసుకొచ్చిన ఎలక్టోరల్ బాండ్ స్కీమ్​ను సుప్రీంకోర్టు తప్పుబట్టింది. పారదర్శకత కన్నా గోప్యతే ఎక్కువుందని, విరాళాలు ఎవరు, ఎవరికి, ఎంతిస్తున్నారనే వివరాలు తెలియడం లేదని వ్యాఖ్యానించింది. ఇది రాజ్యాంగం భారత పౌరులకు కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛ, సమాచారం తెలుసుకునే హక్కులకు విరుద్ధంగా ఉందని బెంచ్​ పేర్కొంది. ఈ క్రమంలో ఎలక్టోరల్ బాండ్ల జారీని వెంటనే నిలిపివేయాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)ను ఆదేశించింది. ఈమేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్​ ఆధ్వర్యంలోని ఐదుగురు జడ్జిల రాజ్యాంగ ధర్మాసనం గురువారం చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. 

 ఈ ధర్మాసనంలో జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్‌‌‌‌ గవాయి, జస్టిస్ జేబి పార్థివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలు ఉన్నారు. ఈమేరకు సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ గవాయి, జస్టిస్ పార్థివాలా, జస్టిస్ మిశ్రాలు 152 పేజీల తీర్పు వెలువరించగా.. జస్టిస్ సంజీవ్ ఖన్నా  విడిగా 80 పేజీల తీర్పు వెలువరించారు. ధర్మాసనం ఏకగ్రీవంగా 232 పేజీల తీర్పు వెలువరించింది. ఎలక్టోరల్ బాండ్లను ప్రవేశ పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం చెప్పిన విషయాలను ఈ సందర్భంగా కోర్టు ప్రస్తావించింది. రాజకీయ పార్టీలకు సమకూరే నిధులలో పారదర్శకత, బ్లాక్ మనీ కట్టడి ప్రధాన లక్ష్యంగా ఈ బాండ్లను ప్రవేశ పెట్టినట్లు తెలిపింది. 

అయితే, బ్లాక్ మనీ కట్టడికి ఇదొక్కటే మార్గం కాదని సుప్రీం బెంచ్​ అభిప్రాయపడింది. బాండ్లపై అమ్మిన వారి పేరు కానీ కొన్న వారి పేరుకానీ ఉండదని బెంచ్​ సభ్యులు తెలిపారు. దీనివల్ల బాండ్లు ఎవరి చేతుల్లో ఉంటాయో వారే వాటికి యజమానులని వివరించారు. ఈ గోప్యతతో ఎవరు ఏ పార్టీకి ఎంత విరాళం ఇస్తున్నారనే వివరాలు తెలియవన్నారు. రూ. వెయ్యి నుంచి రూ. కోటి వరకు లభించే ఎలక్టోరల్ బాండ్ల కొనుగోలుపై పరిమితి పెట్టలేదని, ఎవరైనా ఎన్నైనా కొనుగోలు చేయవచ్చని చెప్పారు. ఇది క్విడ్​ ప్రో కో కు దారితీసే అవకాశం ఉందన్నారు.

మార్చి 6 లోపు ఈసీఐ కి సమర్పించండి..

సంస్థల నుంచి అపరిమిత రాజకీయ విరాళాలు అనుమతించే ‘కంపెనీస్ యాక్ట్’లో చేసిన సవరణలు ఏకపక్షంగా రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నాయని రాజ్యాంగ ధర్మాసనం పేర్కొంది. కంపెనీలు అందించే విరాళాలను తప్పనిసరిగా ప్రజలకు వెల్లడించాల్సిందేనని తేల్చి చెప్పింది. ఆయా పార్టీలకు ఎవరెవరు నిధులు సమకూరుస్తున్నారనే వివరాలు తెలిస్తే ఎవరికి ఓటేయాలో నిర్ణయించునేందుకు ఓటరుకు వీలుంటుందని పేర్కొంది. ఎలక్టోరల్ బాండ్ల విషయంలో ఈ సౌలభ్యం లేదు కాబట్టి తక్షణమే వాటి జారీని నిలిపేయాలని ఎస్బీఐని కోర్టు ఆదేశించింది.

 2019 ఏప్రిల్ 12 నుంచి ఇప్పటి వరకు ఎలక్టోరల్ బాండ్ల వివరాలను ఈ ఏడాది మార్చి 6 లోపు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) కు సమర్పించాలని ఎస్బీఐకి స్పష్టంచేసింది. బాండ్​ విలువ, కొనుగోలుదారు పేరు,  క్యాష్ చేసుకున్న పార్టీ, తేదీ.. వివరాలను తెలపాలని పేర్కొంది. మార్చి 13 నాటికి ఈ వివరాలను ఈసీఐ తన అధికారిక వెబ్ సైట్​లో ప్రజలకు అందుబాటులోకి ఉంచాలని వెల్లడించింది.

అపరిమిత నిధుల మళ్లింపునకు దోహదం..

ఎస్బీఐ నుంచి బేరర్ బాండ్లను కొనుగోలు చేసి, దాతలు అజ్ఞాతంగా రాజకీయ పార్టీకి నిధులు పంపడానికి అనుమతించేలా కేంద్రం ఎలక్టోరల్ బాండ్ల స్కీమ్​ను తీసుకువచ్చింది. ఫైనాన్స్ యాక్ట్-2017 ను పరిగణలోకి తీసుకొని కేంద్రం స్కీమ్​ను రూపొందించింది. దీని ఆధారంగా ఆర్బీఐ యాక్ట్, ఇన్ కం ట్యాక్స్ యాక్ట్, ప్రజాప్రాతినిధ్య చట్టం అనే మూడు ఇతర చట్టాలను సవరించారు. 2018 జనవరి 2 న ఎలక్టోరల్ బాండ్ స్కీమ్​ను కేంద్రం అమలులోకి తెచ్చింది.

ఏమిటీ బాండ్లు?

రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చేందుకు కేంద్రం తీసుకొచ్చిన ఫైనాన్షియల్​ ఇన్ స్ట్రుమెంట్.. సింపుల్​ గా చెప్పాలంటే ఓ ప్రామిసరీ నోటు లాంటిది. ఈ బాండ్లను రాజకీయ పార్టీలు జారీ చేస్తాయి. రూ. వెయ్యి, రూ.పదివేలు, రూ.లక్ష, రూ.పది లక్షలు, రూ. కోటి చొప్పున బాండ్ల డినామినేషన్ ఉంటుంది. ఈ బాండ్ పై కొనే వారి పేరు కానీ, అమ్మే వారి పేరు కానీ ఉండదు. బాండ్ పేపర్ ఎవరి దగ్గర ఉంటే వారే దానికి యజమాని. ఎస్బీఐ ద్వారా పార్టీలు వీటిని జారీ చేస్తాయి. కొనుగోలు పూర్తయిన 15 రోజుల్లోగా పార్టీలు వీటిని నగదుగా మార్చుకోవాలి. 

ఆ గడువు దాటితే సదరు బాండ్లను పీఎం రిలీఫ్​ ఫండ్​కు జమ చేస్తారు. భారతీయ పౌరులు, కంపెనీలు, సంస్థలు.. మన దేశానికి చెందిన ఎవరైనా, ఎన్నైనా కొనుగోలు చేయవచ్చు. కొనుగోలు చేయడానికి ఎలాంటి పరిమితి విధించలేదు. ప్రారంభంలో ఏడాదిలో 70 రోజులు మాత్రమే వీటిని జారీ చేయడానికి అవకాశం కల్పించగా.. తర్వాత ఈ గడువును కేంద్రం పెంచింది.

బాండ్ల జారీ వల్ల సమస్యలేంటి..

బాండ్లను ఎవరు కొనుగోలు చేస్తున్నారనే వివరాలు తెలియదు.. పార్టీలకు వస్తున్న విరాళాలు ఎవరు ఇస్తున్నారనే వివరాలు గోప్యంగా ఉంటాయి. ఇది ప్రాథమిక హక్కులకు విరుద్ధమని, క్విడ్ ప్రో కో కు దారితీయొచ్చని అసోసియేషన్ ఫర్ ​డెమోక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) ఆందోళన వ్యక్తం చేస్తోంది. రాజకీయ పార్టీలకు నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయనే వివరాలు ఈ విధానం వల్ల ప్రజలకు తెలియదని, ఆర్టీఐ ద్వారా కూడా తెలుసుకోవడం వీలు కాదని ఉద్యమకారులు 
ఆరోపిస్తున్నారు. నిధుల సేకరణలో పారదర్శకత లోపిస్తుందని చెప్పారు.

ఎన్నికల బాండ్ల విలువ 16 వేల కోట్లు

న్యూఢిల్లీ: ఎన్నికల బాండ్ల స్కీం మొదలైన 2018 నుంచి ఇప్పటి వరకు రాజకీయ పార్టీలు అన్ని కలిసి మొత్తం రూ.16, 518.11  కోట్లు సేకరించినట్లు అసోసియేషన్ ​ఫర్ ​డెమొక్రటిక్ ​రిఫార్మ్స్ అనే సంస్థ వెల్లడించింది. ఇలా బాండ్ల అమ్మకం ద్వారా అత్యధికంగా బీజేపీ రూ.10,122 కోట్లు సేకరించింది. ఇది మొత్తం ఎన్నికల బాండ్ల స్కీం ద్వారా సేకరించిన నిధుల్లో దాదాపు 63 శాతం. ఎలక్టోరల్ బాండ్ల అమ్మకాల లిస్ట్​లు ఉన్న మిగతా పార్టీలకు అందిన మొత్తంతో పోల్చితే ఇది దాదాపు రెండున్నర రెట్లు కావడం గమనార్హం. 

ప్రధాన ప్రతిపక్షమైన కాంగెస్ ఈ స్కీం ద్వారా మొత్తం రూ.1547 కోట్లు స్వీకరించింది. ఇది మొత్తం విలువలో 10 శాతం కంటే తక్కువ. ఆ తర్వాతి స్థానంలో రూ. 823 కోట్లతో బెంగాల్​లో అధికారంలో ఉన్న తృణ‌‌మూల్ కాంగ్రెస్ (టీఎంసీ), అలాగే సీపీఎం రూ.360 కోట్లు, ఎన్సీపీ రూ.231 కోట్లు, బీఎస్పీ రూ.85 కోట్లు, సీపీఐ రూ.13 కోట్లు ఈ రూపంలో సేకరించాయి.

బాండ్లు ఎప్పుడు ప్రవేశ పెట్టారంటే..

  • 2017:  ఫైనాన్స్ బిల్లులో ప్రతిపాదించిన కేంద్ర ప్రభుత్వం
  • సెప్టెంబర్ 14: ఎలక్టోరల్ బాండ్స్ పై సుప్రీంలో ఏడీఆర్ పిటిషన్
  • అక్టోబర్ 03: కేంద్రానికి, ఈసీకి సుప్రీం నోటీసులు
  • 2018 జనవరి 02: ఎలక్టోరల్ బాండ్ స్కీమ్​కు కేంద్రం గుర్తింపు
  • 2022 నవంబర్ 07: అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సిన రాష్ట్రాల్లో బాండ్ల జారీ గడువు 75 నుంచి 85 రోజులకు పెంపు
  • 2023 అక్టోబర్ 16: ఎలక్టోరల్​ బాండ్లపై పిటిషన్​ను ఐదుగురు జడ్జిల రాజ్యాంగ ధర్మాసనానికి రిఫర్ చేసిన సుప్రీంకోర్టు
  • అక్టోబర్ 31: సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆధ్వర్యంలోని ఐదుగురు జడ్జిల బెంచ్​ విచారణ ప్రారంభం
  • నవంబర్ 02: తీర్పు రిజర్వ్
  • 2024 ఫిబ్రవరి 15: ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ రాజ్యాంగ విరుద్ధమంటూ ఏకగ్రీవంగా తీర్పిచ్చిన సుప్రీం బెంచ్

రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చిన వారి పేర్లను రహస్యంగా ఉంచడం అంటే ఇన్​కమ్​ ట్యాక్స్ యాక్ట్​ను దుర్వినియోగం చేయడమే. కంపెనీలు ఇచ్చే విరాళాలు పూర్తిగా క్విడ్ ప్రో కో ప్రయోజనాలకు దోహదపడేలా ఉంటాయి. కంపెనీలిచ్చే విరాళాలను తప్పనిసరిగా ప్రజలకు చెప్పాలి. రాజకీయ పార్టీలు ఎన్‌క్యాష్ చేసిన ప్రతి ఎలక్టోరల్ బాండ్ వివరాలను ఈసీఐకి తప్పనిసరిగా వెల్లడించాలి. 
- సుప్రీంకోర్టు