టీచర్ల డిప్యూటేషన్లు, ఓడీలు రద్దు

టీచర్ల డిప్యూటేషన్లు, ఓడీలు రద్దు
  •      ఆదేశాలు జారీ చేసిన సర్కార్  
  •     త్వరలో ఖాళీల భర్తీకి కసరత్తు
  •     ఎస్సీఈఆర్టీ ప్రక్షాళన షురూ

హైదరాబాద్, వెలుగు : స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రెయినింగ్ (ఎస్సీఈఆర్టీ) ప్రక్షాళన మొదలైంది. ఏండ్ల ఆఫీసుల్లోనే పాతుకుపోయిన టీచర్లంతా ఇకనుంచి బడులకు పోవాల్సిందేనని సర్కారు ఆదేశించింది. ఎస్సీఈఆర్టీలో రెండేండ్లకు మించి డిప్యూటేషన్ల కింద పనిచేస్తున్న టీచర్లు, ఏడాదికి మించి ఓడీలను రద్దు చేసింది. ఈ మేరకు మంగళవారం విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం ఆదేశాలు జారీ చేశారు.

ఫిబ్రవరి1 నాటికి ప్రక్రియను పూర్తి చేసి, నివేదిక ఇవ్వాలని స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్​ శ్రీదేవసేన, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ రాధారెడ్డిని ఆదేశించారు. డిప్యూటేషన్లు రద్దు అయిన టీచర్లను స్కూళ్లకు పంపించాలని సూచించారు. ఎస్సీఈఆర్టీ అధికారులు, సిబ్బంది కేవలం ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, వాల్యువేషన్ అండ్ రీసెర్చ్ స్టడీస్, మెటీరియల్ ప్రిపేర్ చేయాలని స్పష్టం చేశారు. కేవలం పర్యవేక్షణ సంస్థగా ఉండొద్దని, ఆ పనిని ఎంఈవోలు, డిప్యూటీఈవోలు, డీఈవోలు చేస్తారని పేర్కొన్నారు.  

గత ప్రభుత్వ అండదండలతో..

ఎస్​సీఈఆర్టీలో నోటిఫికేషన్లు, రాత పరీక్షలు లేకుండానే ఏండ్ల నుంచి వర్క్ డిప్యూటేషన్, ఓరల్ డిప్యూటేషన్ పేరుతో పదుల సంఖ్యలో టీచర్లు పనిచేస్తున్నారు. ప్రొఫేసర్లు పనిచేయాల్సిన చోట ఎస్జీటీ స్థాయి టీచర్లను పెట్టి పనిచేయిస్తున్నారు. గత ప్రభుత్వం అండదండలతో కొందరు టీచర్లు ఏండ్ల నుంచి బడులకు పోకుండా, ఎస్సీఈఆర్టీలోనే పాతుకుపోయారు. దీనిపై, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే దృష్టి పెట్టింది. విద్యాశాఖ సెక్రటరీ బుర్రా వెంకటేశం ఎస్సీఈఆర్టీ ఆఫీసులోనే రివ్యూ చేశారు. అక్రమ డిప్యూటేషన్లు రద్దుకు ప్రపోజల్స్ రెడీ చేయాలని అధికారులను ఆదేశించారు. సర్కారు పెద్దల అనుమతి తీసుకుని డిప్యూటేషన్లు రద్దు చేశారు. అయితే, ఆ పోస్టుల్లో  వెంటనే కొత్త వారిని నియమించాలని టీచర్ల సంఘాలు కోరుతున్నాయి. 

త్వరలోనే నోటిఫికేషన్..

ఎస్సీఆర్టీలో ఖాళీ అయిన పోస్టుల స్థానంలో కొత్తవారిని తీసుకోవాలని విద్యాశాఖ నిర్ణయించింది. మూడేండ్ల కాలపరిమితికి మించకుండా, పారదర్శకంగా నోటిఫికేషన్ ద్వారా అర్హులైన వారిని తీసుకోవాలని స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్​ను సర్కారు ఆదేశించింది. ఖాళీల వివరాలు సేకరించి, క్వాలిఫికేషన్లకు అనుగుణంగా నోటిఫికేషన్ ఇచ్చేందుకు అధికారులు రెడీ అయ్యారు. నెలరోజుల్లోనే ఈ ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు.