ఓటీటీ నా టర్నింగ్ పాయింట్​: రసిక దుగ్గల్​

ఓటీటీ నా టర్నింగ్ పాయింట్​: రసిక దుగ్గల్​

ఇండస్ట్రీలో అడుగుపెట్టి పదిహేనేండ్లు దాటింది. కానీ, ఇన్నేండ్లలో ఎప్పుడూ తొందరపడి ప్రాజెక్ట్​లు చేయలేదు. ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ బ్రేక్​ కోసం ఎదురుచూస్తారు. కానీ, ఆమె కెరీర్​లో బెస్ట్​ క్యారెక్టర్స్​ చేయాలి అనుకుంది. ఆడియెన్స్​ కంటే ముందు ఆ రోల్, యాక్టింగ్​ తనకు నచ్చాలి అనుకుంటుంది. అనుకున్నట్లే వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరచుకుంది రసిక దుగ్గల్​. లేటెస్ట్​గా ‘మీర్జాపూర్ సీజన్ 3’తో తెరపై కనిపించబోతోంది. ఆమె మాటల్లోనే తన పర్సనల్ లైఫ్, కెరీర్ గురించి... 

జార్ఖండ్​లోని జంషెడ్​పూర్​లో1985లో పుట్టా.అమ్మ జెస్సీ, నాన్న రవీన్. ఢిల్లీలో ‘లేడీ శ్రీ రామ్’ ఉమెన్స్ కాలేజీలో బి.ఎస్సీ. మ్యాథ్స్ చదివా. తర్వాత పీజీ చేయాలని, ‘సోఫియా పాలిటెక్నిక్​ కాలేజీ’లో సోషల్ కమ్యూనికేషన్స్ మీడియాలో చేరా. అలాగే యాక్టింగ్​ కోసం ఫిల్మ్​ అండ్ టెలివిజన్ ఇనిస్టిట్యూషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్​.టి.ఐ.ఐ)లో పీజీ డిప్లొమా చేశా. ఆ టైంలో అక్కడ ఉన్న వాళ్లలో ఎక్కువమంది ఒక బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న వాళ్లే కనిపించారు నాకు. కానీ, నేను మాత్రం ‘పెద్ద బ్రేక్ రాకపోయినా పర్వాలేదు. మంచి పాత్రల్లో నటించాలి. ఎక్కువ కాలం ఇండస్ట్రీలో ఉండాలి’ అనుకునేదాన్ని.  డిప్లొమా అయిపోగానే, అవకాశాల కోసం ముంబై వెళ్లా. అలా 2007లో నా కెరీర్ స్టార్ట్ మొదలైంది. అదే ఏడు ‘అన్వర్’ అనే సినిమాలో అవకాశం వచ్చింది. అందులో నాది చిన్న పాత్రే. అయినా, దాని తర్వాత నాకు అవకాశాలు బాగానే వచ్చాయి. అవి కూడా చిన్న రోల్స్ కావడంతో, సినిమాలతో పాటు, టీవీ సీరియల్స్​లో కూడా నటించా. 2018లో వచ్చిన ‘మీర్జాపూర్’ ఫస్ట్ సీజన్​తో నా లైఫ్ మారిపోయింది. అక్కడి నుంచి ‘అవుట్ ఆఫ్ లవ్’ సిరీస్​లలో లీడ్ రోల్ చేశా. ​ఏదైనా బయోపిక్​ మూవీలో లీడ్ రోల్ చేయాలనేది నా డ్రీమ్. 

కెరీర్​లో బెస్ట్​ మూవీ అది...

నా దగ్గరకి వచ్చిన ప్రతి కథ నాకు సరైనదా? మిగతా యాక్టర్స్​తో నాకు సింక్​ అవుతుందా? అని ఆలోచిస్తా. ‘కిస్సా’ నాకు చాలా ప్రత్యేకమైన సినిమా. ఆ సినిమాలో ప్రతి సీన్ బాగా వచ్చింది. సెకండాఫ్, క్లైమాక్స్ సీన్ చేస్తున్నప్పుడు ‘ఇది మిగతావాటికంటే ఇంకా బాగా రావాలి. అద్భుతంగా ఉండాలి’ అనుకునేదాన్ని. కానీ, ఆ సీన్ చేస్తున్నప్పుడు నాకలాంటి ఫీలింగ్​ కలగలేదు. దాంతో డైరెక్టర్ దగ్గరికి వెళ్లి, ​‘ఈ సీన్ మళ్లీ చేద్దాం’ అని అడిగా. కానీ, ‘ఇప్పుడు అంత టైం లేదు’ అని చెప్పాడాయన. అప్పుడు ఆ మూవీ హీరో ఇర్ఫాన్​కి డైరెక్టర్​కి చెప్పిన విషయమే చెప్పా. ‘మళ్లీ చేసే రోజు వస్తుంది లే. ఫీలవ్వకు’ అని చెప్పాడు. కొన్ని రోజుల తర్వాత, డైరెక్టర్ నాకు ఫోన్ చేసి, ఆ సీన్​ని రీషూట్ చేయాలన్నాడు. కొరియోగ్రఫీ కూడా కొంచెం మార్చాడు. ఆ  సీన్ ఎనిమిది టేక్​లు చేశాం. అవన్నీ అద్భుతంగా వచ్చాయి. అప్పుడు నాకు చాలా సంతృప్తిగా అనిపించింది. ఆ ఎక్స్​పీరియెన్స్​ ఇప్పటికీ మర్చిపోలేను. ఎందుకంటే ఎన్ని రిహార్సల్స్​, ఎంత అద్భుతంగా చేసినా.. యాక్షన్, కట్​కి మధ్య నేను పొందిన అనుభూతి చాలా గొప్పది. ‘కిస్సా’ రిలీజ్ అయినప్పుడు నా యాక్టింగ్ ఆడియెన్స్​కి నచ్చుతుందో లేదో అని చాలా భయపడ్డా. మొదటిసారి నేను ఆ సినిమా చూసి, రాత్రంతా ఏడుస్తూ కూర్చున్నా. ‘మంచి క్యారెక్టర్​ అది. కానీ, నేను సరిగా నటించలేదు’ అని ఫీలయ్యా. అప్పుడు నా కో– యాక్టర్ నాతో ఉండి, ఓదార్చింది. నేను ఇండస్ట్రీకి కొత్త. నాకు ఎక్స్​పీరియెన్స్​ లేదు. దానివల్ల ఆ సిచ్యుయేషన్​ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియలేదు. కానీ, ఆడియెన్స్ దాన్ని ఆదరించారు. నాకు చాలా ప్రశంసలు వచ్చాయి. అందుకే ‘కిస్సా’ నాకు చాలా స్పెషల్.


 

ఓటీటీ ఓ వరం

ఓటీటీ వల్ల టాలెంట్​ ఉన్న చాలామందికి  అవకాశాలు దొరికాయి. ఒక ఫార్ములాను నమ్ముకుని కథ, స్క్రీన్ ప్లే రాయాలనే ఆలోచన మారింది. ఓటీటీలో నాకు కూడా చాలా అవకాశాలు వచ్చాయి. పాపులారిటీ పెరిగింది. నటిగా నాకు ఇదొక టర్నింగ్ పాయింట్. ఓటీటీలో రిలీజ్ అయిన ‘మీర్జాపూర్​’ సిరీస్​లో నేను బీనా త్రిపాఠి రోల్​లో చేశా. ఆ క్యారెక్టర్​లో నన్ను చూస్తారని ఆడియెన్స్ ఎక్స్​పెక్ట్​ చేసి ఉండరు. అంత డిఫరెంట్ రోల్ అది. దానికి కాస్టింగ్ డైరెక్టర్స్ నా యాక్టింగ్ కెపాసిటీపై నమ్మకం పెట్టుకోకపోతే, ఆ రోల్ నాకు వచ్చేది కాదు. అందులో నా బాడీ లాంగ్వేజ్ వెరైటీగా ఉంటుంది. నేనొక నటిగా కథను చెప్పడం, దాన్ని ఒప్పించడం నా బాధ్యత. నేను చేసే రోల్స్​ని జడ్జ్ చేయను. ఎవరైనా జడ్జ్ చేసినా బాధపడను. బాగా నటిస్తే ప్రజలు ఆదరిస్తారు. సో, ఆ జడ్జ్​మెంట్​ దాటి ముందుకెళ్లొచ్చని భావిస్తా. ‘మీర్జాపూర్​’లో నా పాత్రలోని కొన్ని విషయాలు తమకు కనెక్ట్​ అయ్యాయని చాలామంది మహిళలు నాకు రాశారు. అది చాలా గొప్ప అనుభూతి.

ఎంకరేజ్​మెంట్‌ దొరికింది

యాక్టింగ్ డిప్లొమా చేస్తున్నప్పుడు, అక్కడున్న వాళ్లందరం ఒకరి గురించి ఒకరం అభిప్రాయాలు చెప్పుకోవాలి అనుకున్నాం. అప్పుడు, ‘రసిక చాలా కష్టపడి పనిచేస్తుంది. మంచి నటి. డెడికేషన్ ఎక్కువ. క్లాస్​లోనే టాప్​ స్టూడెంట్​. కానీ, ఆమెను ఎప్పుడూ ఎవరో ఒకరు ఎంకరేజ్​ చేస్తుండాలి. లేకపోతే తను యాక్టింగ్‌ చేయలేదు. ముంబైలో తనకు అలాంటి మనుషులు ఎక్కడా దొరకరు. పైగా ఆమెను ఎంకరేజ్​ చేయడానికి బదులు డిస్కరేజ్ చేస్తారు. కాబట్టి ఆమెకు ఇబ్బంది అవుతుంది’’ అని చెప్పారు ఒకరు. కెరీర్ స్టార్ట్ అయ్యాక కూడా ‘నువ్వు చిన్న రోల్స్ చేయొద్దు. పెద్ద క్యారెక్టర్స్ చేయాలి’ అని చెప్పేవాళ్లు చాలామంది. కానీ, నేను అది ఫాలో కాలేదు. నేనెప్పుడూ ఆడియెన్స్​తో కనెక్ట్​ అవ్వాలంటే రెగ్యులర్​గా కనిపించాలి. ఎంటర్​టైన్ చేయాలి అనుకుంటా. అందుకని, మొదట్లో చిన్న రోల్స్ చేశా. యాక్టింగ్ స్కూల్​ నుంచి వచ్చా కాబట్టి పెద్ద రోల్స్​ చేయాలనేం లేదు. ఎందుకంటే స్టేజీ నాటకాలు వేరు, సినిమా వేరు అనుకునేదాన్ని. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే, చాలామంది వ్యక్తులు నన్ను ఎంకరేజ్ చేశారు. సపోర్ట్ చేశారనే ఫీలవుతా. నా సక్సెస్​లో వాళ్లూ భాగమే. 

సోషల్ మీడియా నుంచి నేర్చుకున్నా

ఒక సెలబ్రిటీ లైఫ్​లో సోషల్ మీడియా చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. పబ్లిక్​తో ఎప్పుడూ కనెక్షన్​లో ఉండాలి. నేను ఈ మధ్యే సోషల్ మీడియాపై దృష్టి పెట్టా. కెమెరా ముందు అందంగానే కనిపించాలేమో అని భయపడేదాన్ని. కానీ, అది అపోహ మాత్రమే. మనం మనలా ఉన్నా జనాలు ఇష్టపడతారని తెలిసింది. అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి ‘మేడ్ ఇన్ హెవెన్’ డైరెక్టర్స్​లో ఒకరైన అలంకృత శ్రీవాస్తవ నా ఫ్రెండ్. మేమిద్దరం కలిసి ఒక ప్రాజెక్ట్ చేయాలనుకున్నాం. కానీ, కుదరలేదు. ‘ఈ స్క్రిప్ట్​లో ఒక చిన్న రోల్ ఉంది. దీంతో మన జర్నీ కలిసి స్టార్ట్ చేద్దాం’ అని చెప్పింది. దాంతో నేను ‘ఓకే’ చెప్పా. ‘ఢిల్లీ క్రైమ్2’ డైరెక్టర్​తో నాకు ఇంతకుముందే పరిచయం ఉంది. కానీ, ‘ఢిల్లీ క్రైమ్2’ కథ అనుకున్నప్పుడు ఆ క్యారెక్టర్​కి నన్ను అనుకోలేదదు. నేను ఢిల్లీలో ‘మేడ్ ఇన్ హెవెన్’ షూటింగ్​లో చేస్తున్నప్పుడు, అతను అక్కడికి వచ్చాడు. తను చేయాలనుకున్న కథకు తగ్గ యాక్టర్స్​ కోసం వెతుకుతున్నాడట. అప్పుడు నేను కనిపించగానే, ‘నువ్వు ఈ కథలో నటిస్తావా?’ అని అడిగాడు. నాకు కథ నచ్చడంతో ‘ఓకే’ చెప్పా. ఇప్పుడు తలుచుకుంటే అదంతా ఒక కలలా అనిపిస్తుంది. 

ఆ రోజులు గుర్తొచ్చాయి 

‘ఢిల్లీ క్రైమ్ 2’ ఢిల్లీలో జరిగే హత్యల చుట్టూ నడుస్తుంది. ఈ సినిమా చేస్తున్నప్పుడు ఢిల్లీలో నేను ఉన్న రోజులు గుర్తొచ్చాయి. పీజీ కాలేజీ నుంచి నడుచుకుంటూ రూమ్​కి వెళ్లాలి. ఎడారిలో కనిపించే ఒక చిన్న దారిలా ఉంటుంది ఆ రోడ్. అక్కడ నడవాలంటే నాకు చాలా భయంగా ఉండేది. అక్కడ ఒక స్కూల్ కూడా ఉంది. అది మూడు లేదా నాలుగు గంటలకు క్లోజ్​ చేస్తారు. అందుకని నేను అంతకంటే ముందే వెళ్తే ఓకే. లేదంటే, ఆ దారిలో వెళ్తున్నట్లు ముందే పది మందికి చెప్పాలి. ‘వస్తున్నా’ అని చెప్పి అటు కాకుండా వేరే దార్లో వెళ్తే, అది తెలియని మనవాళ్లు ఆ దారిలో వెతుకుతారు. అంత భయానకంగా ఉంటుంది ఆ వాతావరణం. 

ప్రయోగాలు చేయడం ఇష్టం

మొదటి నుంచి ప్రయోగాలు చేయడమంటే ఇష్టం నాకు. అప్పుడే చేసే పనిని సరదాగా ఎంజాయ్ చేయొచ్చని నమ్ముతా. నిజాయితీగా పని చేయడానికి ట్రై చేస్తా. అందుకే అంచనాలు అందుకోవాలనే ఆలోచన ఉండదు. నా వరకు నేనెప్పుడూ డిఫరెంట్​ స్క్రిప్ట్స్ ట్రై చేయాలనుకుంటా. ‘ది మినియేచరిస్ట్​ ఆఫ్ జునాగఢ్​’ షార్ట్ ఫిల్మ్​లో నేను గురువుగా భావించే నసీరుద్దీన్​ షాతో నటించా. దాంతో నిజంగా నా కల నెరవేరినట్లైంది. ఆయన నుంచి యాక్టింగ్​ స్కిల్స్ చాలా నేర్చుకున్నా. ఆయనతో నటించేటప్పుడు చాలా నెర్వస్​గా ఫీలయ్యా. 2010లో ముకుల్ చద్దాతో పెండ్లి అయింది.  2020లో ఇద్దరం కలిసి  ‘బనానా బ్రెడ్’ అనే షార్ట్ ఫిల్మ్​ రాశాం. మొదటిసారి మేమిద్దరం కలిసి నటించిన ‘ఫెయిరీ ఫోక్’ ఈ ఏడాది జూన్​లో రిలీజ్ అయింది.
 

‘హామిద్’ చేయకూడదనుకున్నా

‘హామిద్’​లో కశ్మీరి అమ్మాయి పాత్ర నాది. అది కూడా షూటింగ్​కి ఒక నెల ముందే నా దగ్గరికి వచ్చింది. నేను చేస్తే నిజంగా కశ్మీరీ అమ్మాయే అనిపించేలా చేయాలి. ‘నేను కశ్మీరీ కాదు’ అని ఎక్కడా అనిపించకూడదు అని ఫిక్స్ అయ్యా. కానీ, ప్రిపరేషన్​కి టైం లేదు. అందుకని కాస్త భయపడ్డా. అందుకే ఫస్ట్​ ‘నో’ చెప్పా. కానీ, ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల నేనే చేయాల్సి వచ్చింది.:ప్రజ్ఞ

పూర్తిగా ఇండిపెండెంట్​

‘ఆడపిల్లలు ఇండిపెండెంట్​గా బతకాలంటే సంపాదనలో ఎంతో కొంత దాచుకోవాలి’ అని చిన్నప్పటి నుంచి నా చుట్టూ ఉండేవాళ్లు చెప్పేవాళ్లు. ఆ మాటలు నా మీద బాగా పనిచేశాయి. నేను జాబ్​లో చేరాక, మొదట డబ్బు దాచుకోవాలి అని డిసైడ్ అయ్యా. అనుకున్నట్లే నాకొచ్చే చిన్న జీతంలో కొంత దాచా. నా మొదటి జాబ్ రీసెర్చ్ అసిస్టెంట్. ఏడు వేల రూపాయల జీతం. అందులో ఐదు వందలు సేవ్​ చేశా. అప్పుడు నాకు చాలా గర్వంగా, సంతోషంగా అనిపించింది. యాక్టింగ్ కెరీర్ మొదలుపెట్టాక నెలవారీ ఖర్చులు పోనూ కొంత మొత్తాన్ని దాచుకుంటా. ఇప్పుడు నాకు ఇండిపెండెంట్​గా బతుకుతున్నా అనే ఫీలింగ్​ వచ్చింది.