రూ.38 వేలిస్తేనే లైసెన్స్​ రెన్యూవల్!

రూ.38 వేలిస్తేనే లైసెన్స్​ రెన్యూవల్!
  •     ఫర్టిలైజర్​ షాప్​ ఓనర్​ దగ్గర దహెగాం ఏవో లంచం డిమాండ్​
  •     పట్టుకున్న ఏసీబీ అధికారులు

దహెగాం, వెలుగు : ఆసిఫాబాద్​ జిల్లా దహెగాం మండల అగ్రికల్చర్ ​ఆఫీసర్​ గూడెపువార్​వంశీకృష్ణ లైసెన్స్​ రెన్యూవల్​ కోసం లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి కథనం ప్రకారం..అయినం గ్రామానికి చెందిన మారుతి ట్రేడర్స్​ఫర్టిలైజర్ యజమాని చౌదరి శ్యాంరావ్ ​తన ఫర్టిలైజర్, సీడ్స్​ షాపు లైసెన్స్ రెన్యూవల్ ​కోసం గత నెల 27న ఆన్​లైన్​లో అప్లై చేసుకున్నాడు. వెరిఫికేషన్ ​కోసం షాపుకు వచ్చిన ఏవో వంశీకృష్ణ..శ్యాంరావ్​ను డబ్బులు డిమాండ్ ​చేశాడు.

ప్రస్తుతం తన దగ్గర లేవని, తర్వాత ఇస్తానని చెప్పాడు. దీంతో ఈ నెల 7న లైసెన్స్ ​రెన్యూవల్​చేశాడు. కానీ, అడ్రస్ ​తప్పుగా నమోదు చేశాడు. దీంతో శ్యాంరావ్​అడ్రస్​ సరిచెయ్యమని ఏవో దగ్గరికి వెళ్లగా పాతవి, కొత్తవి కలిపి రూ.38 వేలు ఇస్తేనే సరిచేస్తానని చెప్పాడు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. వారి సూచనల మేరకు సోమవారం ఏవోకు అగ్రికల్చర్​ఆఫీసులో డబ్బులు అందజేస్తుండగా ఏసీబీ రెడ్​హ్యాండెడ్​గా పట్టుకుంది.

ఏసీబీ ఇన్​స్పెక్టర్ ​కృష్ణకుమార్, హెడ్​కానిస్టేబుల్ ​వేణుగోపాల్​ పాల్గొన్నారు. గతంలో చెన్నూర్ మండలంలో ఏవోగా పని చేసినప్పుడు కూడా వంశీకృష్ణ రైతు బీమా విషయంలో అవకతవకలకు పాల్పడగా సస్పెండ్​అయ్యాడు. అయినా తీరు మార్చుకోలేదు.