టీయూ ఈసీ నిర్ణయాలపై  ఏసీబీ విచారణ

టీయూ ఈసీ నిర్ణయాలపై  ఏసీబీ విచారణ

 

  • టీయూ ఈసీ నిర్ణయాలపై  ఏసీబీ విచారణ
  • ఏసీబీ డీజీకి లెటర్ ​రాయాలని ఈసీ నిర్ణయం
  • విద్యావర్థిని  సస్పెన్షన్​కు తీర్మానం 
  • నవీన్​మిట్టల్​కు సభ్యులు భయపడుతున్నరు : వీసీ రవీందర్​ గుప్తా 

నిజామాబాద్,  వెలుగు:  తెలంగాణ యూనివర్సిటీ వీసీ రవీందర్​గుప్తా ఆర్థిక నిర్ణయాలపై ఏసీబీ విచారణ కోరాలని ఈసీ మెంబర్స్​ నిర్ణయించారు. బుధవారం హైదరాబాద్​లోని రూసా బిల్డింగ్​లో విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ అధ్యక్షతన నిర్వహించిన మీటింగ్​లో ఏసీబీ డీజీకి లెటర్​ రాయాలని తీర్మానించారు. రూల్స్​కు విరుద్ధంగా రిజిస్ట్రార్​ హోదాలో ఖర్చులను ప్రోత్సహించారంటూ విద్యావర్థినిని సస్పెండ్​ చేయాలని నిర్ణయించారు.

ఏడాది కింద రద్దు చేసిన పోస్టులను కొత్త నోటిఫికేషన్​తో  భర్తీ చేయాల్సి ఉండగా పట్టించుకోలేదని, ప్రమోషన్ల విషయంలోనూ వీసీ ఇష్టమున్నట్టు వ్యవహరించారని సభ్యులు ప్రస్తావించారు. రాష్ట్రంలో పలు పోస్టుల భర్తీకి  నోటిఫికేషన్లు వచ్చినందున వర్సిటీ హాస్టల్​ను యథావిధిగా నడిపించాలని నిర్ణయించారు. విద్యా సంవత్సరం ముగిసిందనే కారణంతో హాస్టల్​కు తాళం వేయొద్దని కరుణ అదేశించారు. ఈ మీటింగ్​కు వీసీ రవీందర్​గుప్తా  గైర్హాజరు కాగా..కొత్తగా రిజిస్ట్రార్​ బాధ్యతలు చేపట్టిన యాదగిరి హాజరయ్యారు. తాను వీసీకి సమాచారం చేరవేశానన్నారు.  

మీటింగ్​ ఎలా పెడ్తరు : వీసీ రవీందర్​గుప్తా

ఈసీ కమిటీకి చైర్మన్​అయిన తాను లేకుండా మీటింగ్​ ఎలా నిర్వహిస్తారని వీసీ రవీందర్​గుప్తా ప్రశ్నించారు. బుధవారం ఆయన వెలుగుతో మాట్లాడారు. ఉన్నత విద్యాశాఖ కమిషనర్​ఈసీలో సభ్యుడు మాత్రమే అని, అన్నీ అయన అనుకున్నట్టు జరగాలంటే వీసీ ఎందుకని ప్రశ్నించారు. మీటింగ్​సమాచారాన్ని రిజిస్ట్రార్​నంటూ యాదగిరి అర్ధరాత్రి మెసేజ్​పెట్టారన్నారు. అసలు యాదగిరికి రిజిస్ట్రార్​ఆర్డరే లేదన్నారు. మీటింగ్ ఎజెండాను తనతో చర్చించలేదన్నారు.

తాను నియమించిన విద్యావర్ధినిని రిజిస్ట్రార్​బాధ్యత నుంచి తప్పించారన్నారు. యూనివర్సిటీ యాక్టు ప్రకారం ఛాన్స్​లర్​లేక వీసీ ఆర్డర్లే చెల్లుతాయన్నారు. నవీన్​ మిట్టల్​ బెదిరింపులకు సభ్యులు భయపడుతున్నారన్నారు. ఆయన అనవసర జోక్యాన్ని ఛాన్స్​లర్​హోదాలోని గవర్నర్​తమిళసైకి , ముఖ్యమంత్రి కేసీఆర్​కు, సీఎస్​శాంతికుమారికి లెటర్​ద్వారా తెలిపానన్నారు. వారి నుంచి పిలుపు వచ్చాక వ్యక్తిగతంగా కలుస్తానన్నారు.