
వరంగల్: డోర్నకల్ సీఐ భూక్య రమేష్ నివాసంలో ఏసీబీ రైడ్స్ జరిగాయి. ఓ కేసు విషయంలో రమేష్ 30 వేల రూపాయల లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీకి సమాచారం అందింది. పక్కా సమాచారంతో సీఐను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. సీఐ ఇంట్లో సోదాలు కొనసాగుతున్నాయి. ఏసీబీ దాడులలో 30 వేల రూపాయలు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. రైడ్స్ కంప్లీట్ అయ్యాక పూర్తి వివరాలను ఏసీబీ అధికారులు వెల్లడించనున్నారు. రాష్ట్రంలో యాంటీ కరప్షన్ బ్యూరో (ఏసీబీ) దూకుడు పెంచిన సంగతి తెలిసిందే. అన్ని శాఖలను జల్లెడ పడ్తున్నది. లంచగొండుల గుండెల్లో రైళ్లు పరుగెట్టిస్తున్నది. ఏడు నెలల్లో ఏకంగా 142 కేసులు నమోదు చేసింది. 145 మంది అవినీతి అధికారులను పట్టుకున్నది.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏసీబీకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది. అవినీతి అధికారులు ఏ శాఖలో ఉన్నా.. ఏ హోదాలో ఉన్నా.. ఉపేక్షించొద్దని తేల్చి చెప్పింది. ఫిర్యాదులు రాగానే వెంటనే రంగంలోకి దిగాలని ఆదేశించింది. దీంతో లంచాల విషయం తెలిస్తే తమకు సమాచారం అందించాలంటూ టోల్‌ఫ్రీ నంబర్‌ను, వాట్సాప్ నంబర్‌ను జనంలోకి విస్తృతంగా ఏసీబీ అధికారులు తీసుకెళ్తున్నారు. బాధితుల నుంచి భారీగా ఫిర్యాదులు అందుతున్నాయి. ఆ ఫిర్యాదుల ఆధారంగా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించి.. లంచగొండులకు చెక్ పెడ్తున్నారు. అక్రమాస్తులు ఉన్న ఆఫీసర్లనూ గుర్తిస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన 8 మంది ఉన్నతాధికారుల ఇండ్లలో ఇటీవల తనిఖీలు చేసి.. వందల కోట్లు విలువ చేసే ఆస్తులను ఏసీబీ సీజ్ చేసింది.
2025, జులై నాటికి.. ప్రతి నెల సగటున 20 మంది అవినీతి అధికారులు పట్టుబడుతున్నారు. నిరుడు సెప్టెంబర్ నుంచి 11 నెల వ్యవధిలో 211 కేసులను ఏసీబీ నమోదు చేసింది. ఇందులో ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు(జులై 20 వరకు) ఏడు నెలల వ్యవధిలో ఏకంగా 142 కేసులు నమోదవగా.. 145 మంది అరెస్టయ్యారు. అంటే సగటున నెలకు 20 కేసులు రికార్డవుతుండగా.. 20 మంది అరెస్టవుతున్నారు. ఏడునెలల్లో పట్టుబడ్డవాళ్లలో 20 మంది మహిళా అధికారులతోపాటు పలువురు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు కూడా ఉన్నారు. ఏడు నెలల్లో రూ.28.57 లక్షల లంచం డబ్బులను ఏసీబీ సీజ్ చేసింది.
ఏడు నెలల వ్యవధిలో ఏసీబీ నమోదు చేసిన కేసులు, పట్టుబడ్డ అధికారుల లెక్కలు చూస్తే.. అవినీతిలో ఫస్ట్ ప్లేస్‌లో రెవెన్యూ శాఖ, రెండో ప్లేస్‌లో పోలీస్ శాఖ, మూడో ప్లేస్‌లో మున్సిపల్ శాఖ ఉన్నాయి. రెవెన్యూలో 27 మందిని, పోలీస్ డిపార్ట్మెంట్లో 26 మందిని, మున్సిపల్ శాఖలో 18 మందిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఆ తర్వాత పంచాయతీరాజ్‌లో 17 మందిని, సబ్ రిజిస్టార్ ఆఫీసుల్లో 10 మందిని, ఎలక్ట్రిసిటీలో 9 మందిని, ఇరిగేషన్లో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.