
- ఆర్టీఏ ఏజెంట్ వద్ద రూ.27 వేలు స్వాధీనం
- పూర్తి వివరాలతో సర్కార్‌కు రిపోర్ట్ ఇస్తామన్న డీఎస్పీ
నిజామాబాద్, వెలుగు : నిజామాబాద్ జిల్లా ట్రాన్స్‌పోర్ట్ ఆఫీస్‌పై బుధవారం ఏసీబీ అధికారులు దాడులు చేశారు. వెహికల్ రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్‌లు, రెన్యూవల్స్, వాహనాల ఫిట్‌నెస్ వంటి పనులు చేసేందుకు లంచాలు వసూలు చేస్తున్నారన్న సమాచారంతో డీఎస్పీ శేఖర్‌గౌడ్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఖలీల్ అనే ఓ ఏజెంట్ వద్ద రూ.27 వేలు ఉన్నట్లు గుర్తించిన ఏసీబీ ఆఫీసర్లు, వాటిని స్వాధీనం చేసుకొని, ఆయన ఎవరి కోసం పనిచేస్తున్నారన్న సమాచారాన్ని సేకరించారు.
అలాగే అతడి వద్ద బైక్‌లకు సంబంధించిన 14 ఒరిజినల్ ఆర్సీలు, మూడు ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్‌లు ఎందుకు ఉన్నాయని ఆరా తీశారు. ఆఫీస్‌లోని అన్ని ఫైళ్లను, అప్లికేషన్లను డీఎస్పీ శేఖర్‌గౌడ్ చెక్ చేశారు. ఏజెంట్లు లేకుండా ఏ పనికావడం లేదని నిర్ధారణ అయిందని, తమ తనిఖీల్లో బయటపడ్డ విషయాలపై సర్కార్‌కు రిపోర్ట్ ఇస్తామని డీఎస్పీ చెప్పారు.