
కరీంనగర్, వెలుగు : మెడికల్ షాప్ ఓనర్ నుంచి లంచం తీసుకుంటూ.. కరీంనగర్ డ్రగ్ కంట్రోల్ ఆఫీసర్లు మంగళవారం ఏసీబీకి చిక్కారు. వివరాల్లోకి వెళ్తే... కరీంనగర్ డ్రగ్ కంట్రోల్ అసిస్టెంట్ డైరెక్టర్ మర్యాల శ్రీనివాస్, డ్రగ్ ఇన్‌స్పెక్టర్ కార్తీక్ భరద్వాజ్ కలిసి జిల్లాలోని పలు మెడికల్ షాపులు, ఏజెన్సీల్లో తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలోనే కరీంనగర్ లోని విజేత హాస్పిటల్‌కు సంబంధించిన మెడికల్ షాపులో పలు లోపాలను గుర్తించారు.
దీంతో సదరు షాపు నుంచి డబ్బులు వసూలు చేసేందుకు పుల్లూరి రాము అనే వ్యక్తిని రంగంలోకి దింపారు. రూ. 20 వేలు ఇవ్వాలని షాప్ ఓనర్‌పై రాముతో ఒత్తిడి తీసుకొచ్చారు. దీంతో మెడికల్ షాప్ నిర్వాహకులు ఏసీబీ ఆఫీసర్లకు ఫిర్యాదు చేశారు. వారి సూచన మేరకు మెడికల్ షాప్ నిర్వాహకులు మంగళవారం డ్రగ్ కంట్రోల్ ఆఫీసర్లను కలిసి డబ్బులు ఇచ్చారు. అప్పటికే అక్కడ వేచి ఉన్న ఏసీబీ ఆఫీసర్లు.. డ్రగ్ కంట్రోల్ అసిస్టెంట్ డైరెక్టర్ మర్యాల శ్రీనివాస్, డ్రగ్ ఇన్‌స్పెక్టర్ కార్తీక్ భరద్వాజ్‌తో పాటు పుల్లూరి రామును రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ముగ్గురిని అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టులో హాజరుపరిచినట్లు ఏసీబీ ఆఫీసర్లు తెలిపారు.