- మిర్యాలగూడ బస్టాండ్ వద్ద పట్టుకున్న అధికారులు
మిర్యాలగూడ, వెలుగు: వక్ఫ్ బోర్డు పరిధిలోని భూమి వ్యవహారంలో అనుకూల నివేదిక ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేసిన వక్ఫ్ బోర్డ్ ఇన్‌స్పెక్టర్‌ను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నల్గొండ జిల్లా పెద్దవూర మండలంలోని ఓ మసీదుకు సంబంధించిన 996.33 గజాల స్థలాన్ని గతంలో దాతలు మసీదు నిర్మాణం కోసం విరాళంగా ఇచ్చారు. ప్రస్తుతం భూముల విలువ పెరగడంతో దాతల వారసులు ఆ స్థలంపై హక్కులు కోరుతున్నట్లు సమాచారం. దీంతో ఆ భూమి మసీదుకు లేదా వక్ఫ్ బోర్డుకు చెందేలా చర్యలు తీసుకోవాలని మసీదు నిర్వాహకుడు వక్ఫ్ బోర్డుకు ఫిర్యాదు చేశాడు. ఈ అంశంపై విచారణ జరుపుతున్న వక్ఫ్ బోర్డ్ ఇన్‌స్పెక్టర్ మహమూద్, మసీదుకు అనుకూలంగా నివేదిక ఇవ్వాలంటే డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. మసీదు నిర్వాహకుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. పథకం ప్రకారం ఏసీబీ డీఎస్పీ జగదీశ్ ఆధ్వర్యంలో మిర్యాలగూడ బస్టాండ్ వద్ద మహమూద్‌కు రూ.10 వేల లంచం ఇస్తుండగా అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం మిర్యాలగూడలోని మందులవారి కాలనీలో ఉన్న మహమూద్ నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
