వేగవంతమవుతున్న పర్యావరణ మార్పులు

వేగవంతమవుతున్న పర్యావరణ మార్పులు

భూగోళ ఉష్ణోగ్రతలు నూటికి నూరుపాళ్లూ మానవ కార్యకలాపాల కారణంగా గత వందేళ్లలో గణనీయంగా పెరిగాయి. వివిధ దేశాలు సాధిస్తున్న ఆర్థిక ప్రగతి ప్రజలను నగరీకరణవైపు పరుగులు తీయిస్తున్నాయి. నగరాల్లో జనాభా విపరీతంగా పెరిగింది. ఫలితంగా ప్రకృతి వనరుల వినిమయం అడ్డూ అదుపూ లేకుండా పెరిగింది. మితిమీరిన వనరుల వినిమయం పెద్దమొత్తంలో అడవులనూ, వ్యవసాయ భూములనూ హరించివేస్తోంది. భూగోళ ఉష్ణోగ్రతలలో పెరుగుదల ప్రమాద ఘంటికలను మోగిస్తోంది. గత కొన్ని దశాబ్దాలుగా భూగోళ ఉష్ణోగ్రతలలో చోటుచేసుకుంటున్న పెరుగుదల మానవాళి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. స్వచ్ఛమైన నీరు, గాలి లభించకపోవడంతో వ్యాధులు ఉద్ధృ తమవుతున్నాయి. వైద్య నిపుణులు సైతం ఊహించని రీతిలో ప్రాణాంతకమైన కొత్త కొత్త వ్యాధులకు ఎందరో గురవుతున్నారు. వైరస్‌‌లు వృద్ధి చెందడానికి భూగోళ ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరగడం ముఖ్య కారణం.

పారిశ్రామికీకరణతో విషవాయువులు

ఆధునిక యుగంలో మితిమీరిన పారిశ్రామికీకరణ వల్ల ఉత్పత్తి అవుతున్న కార్బన్ డయాక్సైడ్, మిథేన్ వంటి విషవాయువులు భూగోళ ఉష్ణోగ్రతలు పెరగడానికి ప్రధాన కారణమౌతున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే రాబోయే కాలంలో సంభవించే ఉపద్రవాలను నివారించడం ఎవరితరమూ కాదు.  అభివృద్ధి చెందుతున్న దేశాలు మాత్రం పర్యావరణం విషయంలో ఉదాసీనంగానే ఉన్నాయి. వాటి దృష్టి అంతా ఒకదానితో ఒకటి పోటీపడుతూ ఆర్థికంగా, రాజకీయంగా ఇంకా ఎంతో బలపడాలన్న విషయంపైనే.  

మంచు ఫలకలు కరిగితే..

ముఖ్యంగా ఆర్కిటిక్ వద్ద మంచు కరిగినట్లయితే అక్కడ వేల ఏండ్లుగా మంచు ఫలకాల క్రింద ఉండిపోయిన సూక్ష్మ జీవులు బయటపడతాయి. మానవ మనుగడకే ప్రమాదకారకమైన రోగాలు ప్రబలే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మృత కళేబరం మంచుదిమ్మల మధ్య ఉంటే చెడిపోకుండా ఉంటుంది. మంచు కరగడం మొదలవగానే ఆ కళేబరం నుండి దుర్గంధంతోపాటు రోగకారక క్రిములు కూడా బయటికి వ్యాపించడం మొదలవుతుంది.  మంచుకరగడం మొదలైతే అవి బయటపడే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు.

‘చిత్రిడ్స్’ అనే బూజు

రెండు దశాబ్దాల క్రితం ప్రపంచవ్యాప్తంగా పెద్దసంఖ్యలో కప్పలు మృతి చెందడాన్ని జీవ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆ తరువాత చాలా కాలానికి మాత్రమే ఇలా పెద్దమొత్తంలో కప్పలు చనిపోవడానికి కారణం ‘చిత్రిడ్స్’అనే ఒక రకమైన బూజు అని పరిశోధనల్లో తెలుసుకున్నారు. పర్యావరణంలో చోటు చేసుకుంటున్న అవాంఛనీయ పరిణామాల వల్లనే ఇలాంటి ప్రాణాంతకమైన ‘బూజు’వంటి పదార్థాలు పుట్టుకొస్తున్నాయని పరిశోధనల్లో తేలింది. ముఖ్యంగా ఈ ‘‘బూజు’’ ఉభయచర జీవులలో ప్రాణాంతక వ్యాధులు రావడానికి కారణమౌతోందని శాస్త్రవేత్తలు అంటున్నారు. అయితే వీటి విషయంలో ఇంకా లోతైన పరిశోధనలు జరగాలి. 

అంతరించిపోతున్న సైగా జాతి జింకలు

 సైగా జాతి జింకలు ఒకప్పుడు మంగోలియా నుంచి రొమేనియా వరకుగల ప్రదేశంలో పెద్దసంఖ్యలో సంచరిస్తుండేవి. అయితే ఈ జాతి జింకలు పెద్దసంఖ్యలో మరణిస్తుండడం 2015లో జీవ పరిరక్షణ శాస్త్రవేత్తల దృష్టికి వచ్చింది. 19వ శతాబ్దంలో, 20వ శతాబ్దం తొలి దశాబ్దాలలో మితిమీరిన వేట కారణంగా ఈ జాతి జింకలు 95శాతం వరకూ కనుమరుగైపోయాయి. కజకిస్తాన్‌‌లో మాత్రం ఇవి కొద్ది సంఖ్యలో మిగిలి ఉన్నాయి.  

మానవ మనుగడకు ముప్పు 

2015లో కేవలం నాలుగు రోజుల వ్యవధిలో వివిధ ప్రాంతాలలో 60వేల జంతువులు మరణించడం జీవ పరిరక్షణ శాస్త్రవేత్తలను ఒక్క కుదుపు కుదిపింది. అతి తక్కువ కాలంలో ఇంత పెద్దసంఖ్యలో జంతువులు మరణించడం ఇంతకు ముందెన్నడూ జరగలేదు. 2015 మే నెలాఖరు వచ్చేసరికి లక్షా 20వేల జంతువులు చనిపోయాయి. పరిశోధించగా బయటపడిన విషయం ఏమిటంటే  ‘క్లోస్ట్రిడియం’ అనే బ్యాక్టీరియా కారణంగానే ఇంత పెద్దసంఖ్యలో పశుమరణాలు  సంభవించి ఉండవచ్చు అని తేలింది. భూ ఉపరితల వాతావరణంలో ఎంత వేగంగా మార్పులు చోటుచేసుకుంటున్నాయో, అంతే వేగంగా మానవ జీవితాలలో కూడా మార్పులు చోటుచేసుకుంటున్నాయి.   వాతావరణ మార్పులకు, ప్రాణాంతక వ్యాధులు ప్రబలడానికి మధ్యగల సంబంధాన్ని దృష్టిలో పెట్టుకొని తగిన చర్యలు చేపట్టాలి. 

తరిగొప్పుల విఎల్ ఎన్ మూర్తి ..  ఫ్రీలాన్స్ రైటర్