సిద్దిపేట రూరల్/ హుస్నాబాద్, వెలుగు: సిద్దిపేటలో గురువారం నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభకు వెళ్లి తిరిగొస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు ఓ మహిళ మృతి చెందింది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. హుస్నాబాద్ మండలం నాగారం గ్రామానికి చెందిన మహిళా స్వయం సహాయక సంఘం సభ్యురాలు కొమ్ము సారవ్వ (42) సభ అనంతరం బస్సు వద్దకు వెళ్లేందుకు రోడ్డు దాటుతుండగా, ఓ బస్సు వెనక్కి రావడంతో రెండు బస్సుల మధ్య ఇరుక్కుపోయింది. ఊపిరాడక కిందపడిన ఆమెను స్థానికులు సిద్దిపేట ప్రభుత్వాస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో సిద్దిపేట వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బాధిత కుటుంబానికి రూ.15 లక్షల సాయం..
సారవ్వ మృతిపై మంత్రి పొన్నం ప్రభాకర్ విచారం వ్యక్తం చేశారు. శుక్రవారం సిద్దిపేట ప్రభుత్వాస్పత్రి మార్చురీలో ఆమె భౌతికకాయానికి కలెక్టర్ హైమావతితో కలిసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రభుత్వం తరఫున తక్షణ సాయంగా రూ.5 లక్షల చెక్కును అందజేశారు.
మహిళా సంఘం సభ్యురాలిగా సారవ్వకు వర్తించే రూ.10 లక్షల ప్రమాద బీమా అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. సారవ్వ మృతి బాధాకరమని మంత్రి సీతక్క సంతాపం వ్యక్తం చేశారు. ఇప్పటికే రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించినట్లు పేర్కొంటూ, రూ.10 లక్షల ప్రమాద బీమా త్వరగా అందేలా చర్యలు తీసుకోవాలని ఆఫీసర్లను ఆదేశించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
