దేశంలో నిరుద్యోగం తగ్గుతోంది

దేశంలో నిరుద్యోగం తగ్గుతోంది
  • చత్తీస్ గఢ్ లో నిరుద్యోగులు 0.6%
  • రాజస్థాన్, కాశ్మీర్‌లో 25 శాతం
  • సీఎంఐఈ సంస్థ రిపోర్ట్ 

న్యూఢిల్లీ:  దేశ ఆర్థిక వ్యవస్థ క్రమంగా గాడిలో పడుతుండడంతో అన్​ఎంప్లాయిమెంట్ రేటు తగ్గుతోంది. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) సంస్థ  సోమవారం రిలీజ్ చేసిన లెక్కల ప్రకారం.. ఈ ఏడాది ఫిబ్రవరిలో దేశంలో 8.10 శాతంగా ఉన్న అన్​ఎంప్లాయిమెంట్ రేటు మార్చిలో 7.6 శాతానికి తగ్గింది. పట్టణ నిరుద్యోగిత రేటు 8.5 %గా ఉంటే  గ్రామీణ ప్రాంతాల్లో అది 7.1%గా నమోదైంది. ఇక దేశంలోనే అతి తక్కువ నిరుద్యోగులున్న రాష్ట్రంగా చత్తీస్‌గఢ్ నిలిచింది. అక్కడ అన్​ఎంప్లాయిమెంట్​ రేటు కేవలం 0.6 శాతమే. ఇదే ఇప్పటివరకు దేశంలో నమోదైన అతి తక్కువ నిరుద్యోగిత రేటు. హర్యానాలో అత్యధికంగా 26.7 శాతం అన్​ఎంప్లాయిమెంట్ రేటు నమోదు కాగా, ఆ తర్వాత రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్‌లో 25 శాతం చొప్పున, జార్ఖండ్‌లో 14.5% ఉన్నట్టు తేలింది. బీహార్​లో 14.4, త్రిపురలో  14.1, వెస్ట్​ బెంగాల్​లో 5.6 % నమోదైంది. కర్నాటక, గుజరాత్​లో1.8 %గా రికార్డైంది. చత్తీస్ గఢ్ ప్రభుత్వం మూడేండ్ల క్రితం తీసుకొచ్చిన గ్రామ స్వరాజ్,  సూరజీ గావ్ యోజన, గోధన్ న్యాయ్ యోజన వంటి పథకాలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచాయని సీఎంఐఈ వెల్లడించింది.