జంట హత్యల నిందితులు..మెంటల్ ఆస్పత్రి నుండి డిశ్చార్జ్

జంట హత్యల నిందితులు..మెంటల్ ఆస్పత్రి నుండి డిశ్చార్జ్
  • పోలీసు బందోబస్తుతో మదనపల్లె సబ్ జైలుకు తరలింపు
  • పునర్జన్మలపై  మూఢ నమ్మకంతో జనవరి 24న కుమార్తెలను చంపేసిన తల్లిదండ్రులు
  • పోలీసుల రాక కాస్త ఆలస్యమై ఉంటే భర్తను కూడా చంపేదే 

విశాఖపట్టణం: పునర్జన్మ మూఢ నమ్మకాలతో ఈడొచ్చిన ఇద్దరు పెద్ద కూతుళ్లను చేజాతులారా చంపేసిన తల్లిదండ్రులను మెంటల్ హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేశారు. వైద్యుల సూచన మేరకు వీరిని తీసుకెళ్లేందుకు వచ్చిన మదనపల్లి పోలీసులు ప్రత్యేక వ్యానులో తరలించారు. ఒక ఎస్.ఐ, ఐదుగురు కానిస్టేబుళ్ల రక్షణ మధ్య జంట హత్యల నిందితులను తరలిస్తున్నారు. చిత్తూరు జిల్లా మదనపల్లెకు చెందిన పురుషోత్తం నాయుడు, పద్మజ దంపతులు గత జనవరి 24న పునర్జన్మలపై తమ కుమార్తె చెప్పిన మాటలు నమ్మి క్షుద్రపూజలు చేసి ఇద్దర్నీ డంబెల్స్ తో కొట్టి చంపేసిన విషయం తెలిసిందే. మరునాడు గుర్తించి ఇంటికెళ్లిన పోలీసులను శవాలను పోస్టుమార్టంకు తరలించకుండా అడ్డుకుని పిచ్చిపిచ్చిగా ప్రవర్తించడం కలకలం రేపింది. విద్యావంతులైన ఈ దంపతులు పెద్ద చదువులు చదువుకుని ఉద్యోగాలకు సిద్ధమైన కుమార్తెలను మూఢ నమ్మకాలతో క్షుద్రపూజలు చేసి చంపుకున్న వైనం అప్పట్లో కలకలం రేగింది. 

మళ్లీ బతికిస్తామని పూజలు చేసి డంబెల్స్ తో కొట్టి చంపేశారు
పునర్జన్మ.. మూఢ నమ్మకాలతో క్షుద్ర పూజలు చేసి గత జనవరి 24న తమ ఇంట్లోనే ఇద్దరు కూతుళ్లను తల్లిదండ్రులు డంబెల్స్ తో కొట్టి చంపిన వైనం సంచలనం రేపింది. హత్యల గురించి బయటపడిన తర్వాత వీరింటికి వెళ్లిన పోలీసులను పురుషోత్తం నాయుడు ఆయన భార్య పద్మజలు అడ్డుకుని అభ్యంతరం వ్యక్తం చేశారు. పూజ ముగిసే వరకు ఆగండి.. మా అమ్మాయిలను బతికించుకుంటామంటూ వారు వేడుకున్న వైనం మీడియాలో వైరల్ అయ్యాయి. 

ఎలా జరిగిందంటే... 
జంట హత్యలు జరగడానికి ముందు జనవరి 15న చిన్న కుమార్తె దివ్య తమ పెంపుడు కుక్కతో బయటకు వెళ్లి వచ్చింది. బయట ఏదో తొక్కి భయపడింది. మరుసటి రోజు నుంచి తాను చనిపోతానేమోనంటూ అనారోగ్యం పాలైంది. రోజు రోజుకూ  మానసికంగా కుంగిపోవడం ప్రారంభించింది. దీంతో జనవరి 23న భూత వైద్యుడితో పూజలు చేయించిన అనంతరం తాయెత్తు కట్టించారు. మరుసటి రోజు ఇంటి మిద్దెమీద మధ్యాహ్నం 1 గంటలకు.. వేప మండలతోకొట్టి.. డంబెల్స్ తో చంపేశారు. 

తనను కూడా చంపాలని కోరిన ఆలేఖ్య
చెల్లిని చంపినట్లే తనను కూడా చంపితే.. తాను వెళ్లి తీసుకొస్తానని అలేఖ్య తల్లిదండ్రులను కోరింది. పునర్జన్మ పూజలు చేసి తాను కుక్కను బతికించానని తల్లిదండ్రులు పురుషోత్తం నాయుడు, పద్మజలను నమ్మించింది. ఇంట్లో పూజ గదిలోకి వెళ్లి సగం గుండు చేయించుకుని .. నోట్లో రాగి చెంబుతో పూజ చేస్తుండగా... తల్లిదండ్రులు డంబెల్స్ తో కొట్టి చంపేశారు. కుమార్తెలిద్దరి శవాలను పెట్టి ప్రత్యేక పూజలకు సిద్ధమైన విషయం బయట పడింది. పోలీసులు వెళ్లినా ఇంట్లోకి రానిచ్చేందుకు ససేమిరా నిరాకరించిన తల్లిదండ్రులు పిచ్చిపిచ్చిగా ప్రవర్తించి విసిగించారు. కొన్ని గంటలపాటు శ్రమించిన అనంతరం శవాలను పోస్టుమార్టంకు తరలించిన పోలీసులు.. తల్లిదండ్రులిద్దర్నీ తిరుపతి ఆస్పత్రిలో చికిత్స చేయించారు. శారీరకంగా ఇద్దరూ ఆరోగ్యంగానే ఉండడంతో మదనపల్లె సబ్ జైలుకు తరలించగా.. జైలులో పిచ్చిపిచ్చిగా ప్రవర్తించడంతో వైద్యుల సూచన మేరకు ఫిబ్రవరి 2న విశాఖఫట్టణం మెంటల్ హాస్పిటల్లో చేర్చారు. 

పశ్చాత్తాపంతో కుమిలిపోయిన పురుషోత్తం నాయుడు, పద్మజ దంపతులు
కుమార్తెలను చేజేతులారా చంపుకున్న వీరు.. పెద్ద వాల్తేరు మెంటల్ హాస్పిటల్ లో చికిత్స పొందారు. వైద్యుల చికిత్స అనంతరం తాము చేసిన పనికి.. చేజేతులారా కుమార్తెలను చంపుకున్నామని  పశ్చాత్తాపపడ్డారు. వీరి మానసిక ఆరోగ్యం మెరుగుపడడంతో వీరి కోసం విశాఖపట్నం చేరుకున్న చిత్తూరు జిల్లా మదనపల్లి పోలీసులు ఒక ఎస్.ఐ, ఐదుగురు పోలీసులు ఎస్కార్ట్ వెహికల్ తో మదనపల్లి సబ్ జైలుకు రోడ్డు మార్గంలో తీసుకెళ్లారు.