ఈటల విషయంలో మాటమార్చిన సర్పంచ్

ఈటల విషయంలో మాటమార్చిన సర్పంచ్

ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌పై వచ్చిన భూకబ్జా ఆరోపణలన్నీ అవాస్తవమని చెప్పిన అచ్చంపేట గ్రామసర్పంచ్ లక్ష్మీ మాటమార్చారు. మంత్రి ఈటలపై రైతులు కావాలనే ఆరోపణలు చేస్తున్నారని రెండు గంటల ముందు మాట్లాడిన సర్పంచ్ లక్ష్మీ.. ఇప్పుడు మాటమార్చి తాజాగా  మరో వీడియో విడుదల చేశారు. మంత్రి ఈటల తమ మూడు ఎకరాల భూమి లాక్కున్నారని ఆరోపించారు. 

‘మా భూమి 3 ఎకరాలు ఈటల రాజేందర్ దగ్గర పోయింది. మాది గుంజేసుకున్నడు. అందరిది కూడా అట్లనే గుంజేసుకున్నడేమో. మాకైతే ఇప్పుడు కేసీఆర్ న్యాయం చేయాలి. మా పొలాల చుట్టూ కడీలు పాతిండు. అన్నీ దొబ్బేసిండు. పోలీసులను తీసుకొచ్చి బెదిరిస్తే మేం భయపడ్డం. అందుకే మళ్లీ అటువైపు పోలేదు. వాళ్ల దగ్గర గుండాలు ఉన్నరు. ఆ గుండాలకు భయపడి మేం అసలే అటువైపు పోలేదు. కేసీఆర్ ఏదో ఒకటి నువ్వే చేయాలి’ అని సర్పంచ్ లక్ష్మీ తాజా వీడియో విడుదల చేశారు.

అచ్చంపేట సర్పంచ్ రెండు గంటల్లోనే మాటమార్చడంపై తీవ్ర ఆసక్తి నెలకొంది. ఈ రెండు గంటల్లో ఏం జరిగిందా? అని అందరూ ఆలోచనలో పడ్డారు.

సర్పంచ్ లక్ష్మీ మొదటగా మాట్లాడిన మాటలు
మంత్రి ఈటలపై వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవమని అచ్చంపేట సర్పంచ్ లక్ష్మి అన్నారు. ఈ ఊరి గ్రామస్తులే గతంలో ఎకరానికి రెండు లక్షల చొప్పున ఈటల రాజేందర్‌కి అమ్ముకున్నారని ఆమె అన్నారు. ఇప్పుడు భూమి విలువ పెరగడంతో డబ్బులకు ఆశపడి వారంతా ఇలా ఆరోపణలు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. అప్పుడు అమ్ముకున్న రైతులే కావాలని ఇప్పుడు తిరగబడుతున్నారని ఆమె అన్నారు. వారి వెనకాల ఎవరో ఉండి చేయిస్తున్నట్లు ఆమె ఆరోపించారు. భూమి అమ్ముకున్న డబ్బులతో పిల్లల పెళ్లిళ్లు చేసుకున్నారు, ఇండ్లు కట్టుకున్నారు, అప్పులు తీర్చుకున్నారని ఆమె అన్నారు.