చదువుని చదువుతోనే సాధించా

చదువుని చదువుతోనే సాధించా

జీవితం… బతకటం… బతికించటం… కూడా నేర్పిస్తుంది. ఆకలితో బాధపడ్దవాడికి పక్క వాడి ఆకలి కూడా అర్థమవుతుంది. అలానే చదువుకోవటానికి తాను పడ్డ ఇబ్బంది మరెవరూ పడకూడదనుకున్నాడు. చదువు అంటే సర్టిఫికెట్లు కాదు ‘నేర్చుకోవాల్సిన ఙ్ఞానం’ అని అర్థం చేసుకున్నాడు. పదిహేడేళ్ల వయసుకే కుటుంబ బాధ్యతలు భుజమ్మీద పడ్డా చదువునీ, జీవితాన్ని గెలిచి చూపించాడు. ఇప్పుడు పిల్లలకోసం ఇంట్లోనే ఒక లైబ్రరీ ఏర్పాటు చేసిమరీ వాళ్లకి అక్షరాన్ని దగ్గర చేస్తున్నాడు. ‘‘పేదరికం పై యుద్దానికి చదువే ఆయుధం” అంటున్న నర్సంపేటకు చెందిన కాసుల రవికుమార్ అనే ఈ స్కూల్ టీచర్  ఆయన లైఫ్ జర్నీ గురించి, ఇంకా చేయాలనుకున్న పనుల గురించి ఆయన మాటల్లోనే….

చిన్నప్పటినుంచీ ఆర్థికంగా ఉన్న కుటుంబమేమీ కాదు. నాన్న ఆటో నడిపేవాడు. అమ్మ బీడీలు చుట్టేది. తమ్ముడు, చెల్లె,  నేను.  మా ముగ్గురినీ చదివించటం  కష్టంగానే ఉండేది మా వాళ్లకు. నేను మూడో తరగతిలో ఉన్నప్పటికే నాన్న ఆర్థిక ఇబ్బందులతో ఆటో కూడా అమ్మేయాల్సి రావటంతో ఇంకా కష్టాల్లో పడ్డాం. మూడో తరగతిలో ఉన్నప్పుడు స్కూల్ ఫీజు కట్టలేదని నన్ను స్కూల్లోంచి పంపించేశారు. అప్పుడు మా టీచర్ అన్నమాట ‘‘చదువులో ఫస్ట్ ఉంటే ఇలా పంపేయరు’’ అని.  అప్పుడే అనుకున్నా ఎలాగైనా సరే నేను స్కూల్ ఫస్ట్ ర్యాంక్ కి తగ్గకూడదు అని. ఎలాగోలా మళ్లీ ఇంకో స్కూల్‌‌‌‌లో జాయిన్ చేశాడు మానాన్న. అప్పట్నించి ఎప్పుడూ చదువుని పక్కకు పెట్టలేదు. ప్రతీ సంవత్సరం స్కూల్ ఫస్ట్. అందుకే నాకూ, మా చెల్లెకు ఆ స్కూల్‌‌‌‌లో చదువు ఫ్రీ. అలా చదువుని చదువుతోనే సాధించుకున్నాం.

చేతిలో పైసా లేదు

టెన్త్‌‌‌‌ తర్వాత పాలిటెక్నిక్ రాసి ‘ట్రిపుల్‌‌‌‌ ఇ’  లో చేరాను. కానీ మినిమం ఫీజులు కూడా కట్టలేం కదా చేరకూడదు అనుకున్నా. కానీ అమ్మ ఒప్పుకోలేదు. ఇంట్లో ఉన్న ఒక పాత సైకిల్‌‌‌‌, ఇంకొన్ని సామాన్లు అమ్మేసి కాలేజ్‌‌‌‌లో జాయిన్ అయ్యాను. అయితే ఇక్కడ కూడా మళ్లీ ఇబ్బందులు మొదలయ్యాయి. చేతిలో పైసా లేదు. పుస్తకాలకీ, నోట్స్ కొనుక్కోవటానికి కూడా డబ్బులుండేవి కాదు. పొద్దున్నే పేపర్ వెయ్యటం, ఆ తర్వాత కాలేజ్ టైమింగ్స్‌‌‌‌ని బట్టి ఎస్టీడీ బూత్‌‌‌‌లో పని చేసేవాడ్ని. అలా వచ్చిన డబ్బుల్లో నా ఖర్చులకు పోను మిగిలిన కొన్ని డబ్బులు అమ్మకి పంపేవాడ్ని. ఎస్టీడీ బూత్‌‌‌‌లో ఉన్నప్పుడు  నాతో చదువుకున్న వాళ్లు చూస్తే నవ్వుతారేమో అని వాళ్లు కనిపిస్తే పక్కకు వెళ్లి దాక్కునే వాడ్ని. అప్పటికి డిగ్నిటీ ఆఫ్ లేబర్ లాంటి పెద్ద విషయాలు తెలియని వయసు. డిప్లొమాలో ఇంకో సమస్య ఇంగ్లీష్. అప్పటివరకూ చదువు తెలుగు మీడియం లోనే. అందుకే ఇంగ్లీష్ వల్ల చాలా ఇబ్బంది పడ్డాను. సాయంత్రాలు నా సబ్జెక్ట్స్ తో పాటు ఇంగ్లీష్ డిక్షనరీ పట్టుకొని చదివేవాడ్ని. ఒక పక్క ఆకలి, ఇంకో పక్క ఇంటిదగ్గర ఎలా ఉందో అనే బాధ. వీటన్నిటినీ పోగొట్టాలంటే చదువులో ముందుండి తీరాల్సిందే. అలా డిప్లొమా పూర్తి చేశా.

‘లీడ్‌‌‌‌’ అలా మొదలైంది

డిప్లొమా తర్వాత ఈ‌‌‌‌‌‌‌‌–సెట్‌‌‌‌లో మంచి ర్యాంక్ వచ్చింది. కానీ మళ్లీ డబ్బు సమస్య. ఏం చేయాలో అర్థం కాలేదు. పాలిటెక్నిక్ ఎగ్జామ్స్ రాసిన తర్వాతి రోజునుంచే ఓ ప్రైవేట్ స్కూల్‌‌‌‌లో టీచర్ గా జాయిన్ అయ్యా.  అలా ఇంజినీరింగ్ కల ముగిసిపోయింది. నేను చేస్తున్న స్కూల్ లో తమ్ముడుకి ఫీజు కట్టే పని లేదని వాడ్ని అక్కడే జాయిన్ చేశాను. నాలాగ చెల్లె అవ్వకూడదనుకున్నాను. తనని బీటెక్ లో చేర్చాం. కానీ చదువుకోవాలన్న ఆలోచన పోలేదు అందుకే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ లో బీఏ ఇంగ్లీష్ లిటరేచర్ ఫీజు కట్టాను. ఇంగ్లీష్ అంతు చూడాలన్న తపనతోనే డిగ్రీ పూర్తి చేశాను. అప్పటికి 21 ఏళ్లు. రూరల్ ఏరియాల్లో ఉండే స్టూడెంట్స్ కి ఇంగ్లీష్ ఎంత పెద్ద సమస్య అనేది నాకు తెలుసు.
అందుకే సమ్మర్ లో ఫ్రీగా ఇంగ్లీష్ క్లాసులు చెప్పాను. అలా వాళ్లకి చెబుతూనే నేనూ ఇంకా నేర్చుకునేవాణ్ణి.  ఆ ఇంగ్లీష్ క్లాసుల కోసం చేసిన ప్రోగ్రామ్‌‌‌‌కి నేను పెట్టుకున్న పేరు లీడ్‌‌‌‌ (LEAD).

స్టేట్ సెకండ్ ర్యాంక్ తెచ్చుకున్నా

ఆ తర్వాత ఎమ్మే ఇంగ్లీష్‌‌‌‌లో గోల్డ్ మెడల్ అందుకున్నాను. అప్పుడు కూడా నా టీచింగ్ నడుస్తూనే ఉంది. ఆ తర్వాత ఎడ్‌‌‌‌సెట్‌‌‌‌లో స్టేట్ సెకండ్ ర్యాంక్ తెచ్చుకున్నా. అప్పుడు నన్ను ఇంటర్వ్యూ చేయటానికి మా టౌన్‌‌‌‌లో ఉండే రిపోర్టర్స్ వచ్చి నన్ను చూసి “ఇతను కాదేమో” అనుకుని వెనక్కి వెళ్ళిపోయారట. అంటే మామూలుగా చిన్న చిన్న పనులు చేస్తూ వాళ్లముందే తిరిగిన వాడ్ని. వెదురు తడకల కింద ఇంగ్లీష్ క్లాసులు చెప్పుకుంటున్న నేను స్టేట్ ర్యాంక్ అంటే వాళ్లు నమ్మలేకపోయారు. అదే టైంలో అప్పటి సీఐ ‘బోనాల కిషన్‌‌‌‌’గారు నన్ను పిలిచి లీడ్ ప్రోగ్రాం బావుందని సమ్మర్ క్యాంప్ ప్లాన్ చేశారు. అందులో 200 మంది స్టూడెంట్స్ వచ్చారు. అది మేము ఊహించిన దానికంటే ఎక్కువ.  2010 లో గ్లోబల్ ఇంగ్లీష్ లెర్నింగ్ అనే బుక్ రాశాను. ఆ పుస్తకాన్ని, చిన్న పాకెట్ డిక్షనరీ కలిపి ఫ్రీగా పంచాం. డిక్షనరీల ఖర్చంతా ఆయనే పెట్టారు.  ఆ తర్వాత కూడా లీడ్ ఆగిపోకూడదనుకున్నాను. అందుకే అప్పటినుంచీ నేను ప్రైవేట్ స్కూల్‌‌‌‌లో చేసినా, గవర్నమెంట్ టీచర్‌‌‌‌‌‌‌‌ని అయినా నా ప్రతీ నెలజీతంలో 10% లీడ్ కోసం ఖర్చు పెడతాను.

నా భార్య సహకారంతో

అప్పట్నుంచి ఇంగ్లీష్ క్లాసులకి వచ్చే ప్రతీ స్టూడెంట్‌‌‌‌కీ నా గ్లోబల్ ఇంగ్లిష్ లెర్నింగ్ బుక్ ఫ్రీగా ఇచ్చేవాడ్ని. బయట ఆ బుక్ అమ్మితే వచ్చిన ప్రతీ పైసా లీడ్ కోసమే ఖర్చు చేస్తున్నాను.  లీడ్ నడుస్తోంది. నా లైఫ్ కూడా ఓ దారిలో పడింది. నాతో స్కూల్ లో పనిచేసే కొలిగ్ ‘‘శోభ” ను ఇష్టపడ్దాను. ఆమెనే పెళ్లి చేసుకున్నాను.  తర్వాత లైబ్రరీ ఒకటి పెట్టాలనే ఆలోచన వచ్చింది. అప్పటికే నేను చిన్నప్పుడు ఏస్కూల్‌‌‌‌లో అయితే ఫీజు కట్టలేదని పంపినారో అదే స్కూల్‌‌‌‌కి  ప్రిన్సిపల్​ అయ్యా. అప్పుడు మొదలైన ఆలోచన నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చాక నా భార్య హెల్ప్‌‌‌‌తో ఇట్లా ‘‘లీడ్ లైబ్రరీ’’ గా మారింది. :: నరేష్​ కుమార్​ సూఫీ

మొబైల్ లైబ్రరీ పెట్టాలనే ఆలోచన ఉంది. అది కాకుండా చుట్టు పక్కల తండాల్లో ఉండే నా స్టూడెంట్స్‌‌తో  చైన్ లైబ్రరీస్ ఏర్పాటు చేయాలన్న ఆలోచన కూడా ఉంది. అంటే ప్రతీ తండాలోనూ కొన్ని బుక్స్ ఉంచుతాం. వాటి బాధ్యత అక్కడ ఉండే ఒక స్టూడెంట్ చూసుకుంటాడు. రోజూ వచ్చేవాళ్లకి బుక్స్ ఇస్తాడు. అవి చదవటం అయిపోతే మళ్లీ పక్క ఊళ్లో ఉన్న లైబ్రరీ నుంచి బుక్స్ మార్చుకుంటారు. ఇలా చైన్ లైబ్రరీలు నడపాలనే ప్రయత్నాల్లో ఉన్నాను. దేనికోసమైనా ఫండ్స్ కలెక్ట్ చేయాలంటే నాకు భయం. డబ్బుతో ఆటలు నావల్ల కాదు.  అందుకే ఎవరు సాయం చేస్తామన్నా బుక్స్, పిల్లలు కూర్చునే చైర్స్ లాంటి ఫర్నిచర్ తప్ప ఏదీ తీసుకోవటం లేదు.

రోజూ నాదగ్గరికి వచ్చే పిల్లలు, స్కూల్‌‌లో నా స్టూడెంట్స్‌‌ని చూస్తుంటే ఒకప్పుడు యూనిఫాం వేసుకొని తిరిగిన నేనే నాకు కనిపిస్తుంటాను. నాదగ్గర చదువుకున్న చాలామంది పిల్లల్లో ఇప్పుడు ఇంజినీరింగ్, మెడిసిన్ చేస్తున్న వాళ్లు ఉన్నారు. ఒకప్పుడు ఇంజినీరింగ్ చేయలేకపోవటం నా ఫెయిల్యూర్ అనుకున్నాను. కానీ నేను ఇంజినీర్ అయి ఉంటే ఇదంతా చేసేవాడినా?? అనుకుంటే.. ఏమో….! అందుకే… కొన్ని సార్లు “జీవితాన్ని నమ్మాలి, అదేనమ్మకంతో బతికి చూపించాలి”.

చదువే ఆయుధం

నేను ఏ స్కూల్‌‌లో పని చేస్తే ఆ స్కూల్‌‌లో ఒక లైబ్రరీ నడిపేవాడ్ని. ఏదో ఒక రకంగా పిల్లలని చదువుకి దగ్గర చేయాలనే ఆలోచనే ఉండేది. అయితే నేను స్కూల్ మారగానే ఆ లైబ్రరీ కూడా ఆగిపోయేది. అలా కాకూడదనే ఒక సొంత లైబ్రరీ ఉండాలనుకున్నాను. ఒక వేళ అద్దె ఇల్లయినా తర్వాత సమస్యలు రావచ్చు అందుకే కొంత లేట్ అయినా నా ఇంట్లోనే లైబ్రరీ ఉండాలి అనుకున్నాను. నేను కట్టుకుంటున్న ఇంటిలోనే ఒక భాగాన్ని లైబ్రరీ కోసం కావాల్సిన విధంగా కట్టించాను. ‘‘భూమిక” సత్యవతిగారు ఫర్నిచర్‌‌‌‌లో కొంత హెల్ప్ చేశారు. ఆవిడ సలహాతోనే ఒక మొబైల్ లైబ్రరీ మొదలు పెట్టాలన్న ఆలోచనలో ఉన్నా. నాదగ్గరికి వచ్చే పిల్లలకోసం ఎలాంటి పుస్తకాలు కావాలో శోభ,నేను ప్లాన్ చేసుకుంటాం. ఇంగ్లీష్ లెర్నింగ్ బుక్స్, జనరల్ నాలెడ్జ్‌‌లతో పాటు అంబేద్కర్, పూలే, గాంధీ లాంటి నేషనల్ హీరోల పుస్తకాలని పిల్లలకి అందుబాటులో ఉంచాం. వాళ్లకి కావాల్సిన టెక్స్ట్ బుక్స్ తో పాటు తెలుగు సాహిత్యాన్ని కూడా ఉంచాం.  ప్రతీ పుస్తకం మనిషికి అవసరమైందే. చదువుంటే డబ్బుకూడా సంపాదించగలం.
అందుకే లీడ్ కి క్యాప్షన్ గా “పేదరికం పైన యుద్దానికి చదువే ఆయుధం” అని రాయించాను.