మిగ్​జాం బీభత్సం..ఖమ్మం జిల్లాలో ఎకరాల కొద్దీ పంటలు ఆగమాగం

మిగ్​జాం బీభత్సం..ఖమ్మం జిల్లాలో ఎకరాల కొద్దీ పంటలు ఆగమాగం
  • వరదలతో రోడ్లు బ్లాక్.. ఇబ్బందుల్లో ప్రజలు 

కొత్తగూడెం/భద్రాచలం/నెట్​వర్క్, వెలుగు :  ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మిగ్​జాం తుఫాన్​ బీభత్సం సృష్టించింది. మూడు రోజుల నుంచి కురుస్తున్న ముసురుతో చేతికొచ్చిన పంట కళ్ల ముందే పాడవుతుంటే రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు. వరదలతో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. చాలా చోట్ల రాకపోకలకు ఇబ్బంది కలిగింది.  భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో ఈ ఎఫెక్ట్​ ఎక్కువగా ఉంది. జిల్లాలో దాదాపు 13,608 ఎకరాల్లో వరి, వేరుశనగ, పత్తి, మొక్కజొన్న, మిర్చి పంటలకు తుఫాన్​ నష్టం మిగిల్చింది.

మరో వైపు దాదాపు 262 ఎకరాల్లో పండ్లు, కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. దాదాపు రూ. 30 కోట్ల మేర నష్టం జరిగి ఉండవచ్చని అగ్రికల్చర్​ ఆఫీసర్లు అంచనా వేస్తున్నారు. అశ్వారావుపేట, దమ్మపేట, పాల్వంచ, లక్ష్మీదేవిపల్లి, గుండాల, ఆళ్లపల్లి, ఇల్లెందు, చండ్రుగొండ, అశ్వాపురం, మణుగూరు, ముల్కలపల్లి, అన్నపురెడ్డి తదితర మండలాల్లో తీవ్ర పంట నష్టం జరిగింది. మరో వైపు కల్లాల్లోని ధాన్యం తడిసి ముద్దైంది. 

విలీన మండలాలు విలవిల

మన్యంలోని ఆంధ్రా విలీన మండలాలైన ఎటపాక, కూనవరం, వీఆర్​పురం, చింతూరు, కుక్కునూరు, వేలేరుపాడులను పోలవరం బ్యాక్​ వాటర్​, తుఫాన్​లు వణికిస్తున్నాయి. గోదావరి దాని ఉపనదుల్లోకి నీరు వచ్చి చేరుతోంది. దీనితో బ్యాక్​ వాటర్​ గోదావరి, శబరి పరివాహక ప్రాంతాల్లోని మిరప, లంకపొగాకు, వరి, మొక్కజొన్న, మినుము తోటల్లోకి చేరింది. తుఫాన్​తో మొక్కలు విరిగిపోయాయి. గోదావరి,శబరి సంగమం కూనవరం మండల కేంద్రంలో బ్యాక్​ వాటర్​ కారణంగా ఒడ్డున ఉన్న శివాలయం మునిగింది.

పరిహారం చెల్లించకుండా, ఆర్​ఆర్​ ప్యాకేజీలు ఇవ్వకుండా ఆంధ్రా సర్కారు తమ ఉసురు పోసుకుంటుందని నిర్వాసితులు లబోదిబోమంటున్నారు. కాగా రోడ్డుపై నీరు ప్రవహిస్తున్నచోట అధికారులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. సుజాతనగర్​ మండలంలోని లక్ష్మీపురం గ్రామం వద్ద, జూలూరుపాడు మండలం కాకర్ల నుంచి అనంతారం వెళ్లే రోడ్డు, పడమట నర్సాపురం-బేతాళపాడు రోడ్డు, చండ్రుగొండ మండలంలోని బాల్యాతండా-పోకలగూడెం,

పాల్వంచ మండలం రాజాపురం-యానంబైలు వద్ద, ములకపల్లి మండలంలోని చాపరాలపల్లి -కుమ్మరిపాడు, ములకలపల్లి మండలం ముత్యాలంపాడు బ్రిడ్జిపై, అశ్వాపురం మండలం గొందిగూడెం వద్ద ఇసుక వాగుపై నీరు ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలు నిలిపివేశారు. పోలీసులు రక్షణ చర్యలు చేపట్టారు.

రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదు

భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో మంగళవారం నుంచి బుధవారం ఉదయం వరకు రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. జిల్లాలోని అశ్వారావుపేటలో రాష్ట్రంలోనే అత్యధికంగా 337.8మిల్లిమీటర్ల వర్షపాతం నమోదు కాగా, ఇది ఈ దశాబ్దకాలంలోనే రికార్డు వర్షపాతం అని ఆఫీసర్లు పేర్కొంటున్నారు. 

భద్రాద్రి జిల్లాలో పంట నష్టం ప్రాథమిక అంచనా వివరాలు 

పంట    నష్టపోయిన    దెబ్బతిన్న పంట 
                రైతులు            (ఎకరాల్లో) 

వరి               5298                 8816
వేరుశనగ     464                   1602
మిర్చి           1285                  2475
మొక్కజొన్న  323                   585
పత్తి                 80                    130
మొత్తం          7,450             13,608