హీరో విశ్వక్ సేన్ ప్రవర్తనపై అర్జున్ అభ్యంతరం

హీరో విశ్వక్ సేన్ ప్రవర్తనపై అర్జున్ అభ్యంతరం

హీరో విశ్వక్ సేన్ మరో వివాదంలో చిక్కుకున్నాడు. కూతురు ‘ఐశ్వర్య’ ను పరిచయం చేస్తూ... సీనియర్ హీరో, యాక్షన్ కింగ్ ‘అర్జున్’ ఓ సినిమాను రూపొందిస్తున్నారు. ఇందులో ‘విశ్వక్ సేన్’ హీరోగా నటిస్తున్నారు. కానీ ఈ సినిమా నుంచి విశ్వక్ సేన్ తప్పుకుంటున్నట్లు ప్రచారం జరిగింది. దీనిపై ‘అర్జున్’ క్లారిటీ ఇచ్చారు. ఫిల్మ్ ఛాంబర్ లో అర్జున్ ప్రెస్ మీట్ నిర్వహించారు. షూటింగ్ మొదలు పెట్టాలని.. కటింగ్ కూడా చేసుకున్నట్లు విశ్వక్ సేన్ గతంలో ఫొటో కూడా పంపించాడని వెల్లడించారు.

‘‘నాకు ఉదయం 4 గంటలకు ఓ మెసేజ్ వచ్చింది. షూటింగ్ క్యాన్సిల్ చేయాలని ఆ మెసేజ్ లో విశ్వక్ పేర్కొన్నాడు. అది చూసి ఏమి చేయాలో నాకు అర్ధం కాలేదు. కథ, డైలాగ్..ఇతరత్రా వాటిలో కనీసం మార్పు చేయలేదు. కానీ.. ఇలా ఎందుకు చేశాడో అర్ధం కావడం లేదు. ఎంతో కష్టపడి పని చేశాం. ఇది జీర్ణించుకోలేక పోతున్నా. ప్రొడ్యూసర్, డైరెక్టర్ లకు గౌరవం ఇవ్వలేదు. ఒక్కరిపై కూడా నేను ఇంతవరకు ఫిర్యాదు చేయలేదు. 42 సంవత్సరాల అనుభవం కలిగిన నాకు అవమానం జరిగింది. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ , బుర్ర సాయి మాధవ్ డైలాగ్స్, చంద్రబోస్ పాటల విషయంలో విశ్వక్ నాతో విభేదించాడు. విశ్వక్ ప్రవర్తన వల్ల ప్రస్తుతం సినిమా ఆపేశా. అతడికి కమిట్మెంట్ లేదు. రూ. 100 కోట్లు వచ్చినా విశ్వక్ తో సినిమా చేయను. త్వరలోనే కొత్త హీరో, టైటిల్ తో సినిమాను ప్రకటిస్తా. ఈ విషయంలో కొంచెం టైం ఇవ్వాలని విశ్వక్ సేన్ మేనేజర్ చెప్పాడు. కానీ.. షూటింగ్ చేయాల్సిన సమయంలో ఇలా జరగడం కరెక్టు కాదు. విశ్వక్ ప్రవర్తనను ప్రొడ్యూసర్స్ గిల్డ్ దృష్టికి తీసుకెళ్తా. ఇలా మరొకరికి జరగొద్దని సూచిస్తా. వివాదం చేయాల్సిన అవసరం నాకు లేదు’’ అని అర్జున్ వివరించారు. 

తనకు పెద్దగా డబ్బు సంపాదించాలనే ఆశ లేదని.. ఏ ఒక్క ఫైనాన్షియర్ దగ్గర డబ్బులు తీసుకోలేదని అర్జున్ వెల్లడించారు. ఈ సినిమా కోసం డేట్స్ ఇవ్వాలని హీరో జగపతి బాబును సంప్రదించామన్నారు. కానీ.. ఇతరులకు డేట్స్ ఇవ్వడం వల్ల కుదరదని ఆయన చెప్పారన్నారు. కమిట్ మెంట్ అంటే ఇలా ఉండాలన్నారు. ఒక సినిమా తీసేటప్పుడు ఎన్నో అంశాలు ముడిపడి ఉంటాయనే విషయాన్ని అర్ధం చేసుకోవాలన్నారు. కేజీఎఫ్ మ్యూజిక్ డైరెక్టర్ గా పెట్టుకుంటాననే విషయం అనూప్ రూబెన్స్ కు చెప్పినట్లు వివరించారు. కానీ.. తర్వాత.. కేజీఎఫ్ మ్యూజిక్ డైరెక్టర్ సెట్ కాదని భావించి..మరలా అనూప్ రూబెన్స్ పిలిపించడం జరిగిందన్నారు.