
హైదరాబాద్, వెలుగు: సిటీలో ప్రతి ఏటా వెహికల్స్ సంఖ్య భారీగా పెరిగిపోతోంది. అధికారిక లెక్కల ప్రకారం ప్రస్తుతం గ్రేటర్ రోడ్లపై దాదాపు 90 లక్షల వెహికల్స్ తిరుగుతున్నాయి. ఇతర జిల్లాలు,రాష్ట్రాల నుంచి మరో 5 లక్షల వెహికల్స్ ట్రావెల్ చేస్తున్నాయి. దీంతో పాటు ప్రతి రోజు 1200కు పైగా కొత్త వెహికల్స్ రిజిస్ట్రేషన్ అవుతున్నాయి. ఇలా రోజురోజుకు పెరిగిపోతున్న వెహికల్స్‌కు అనుగుణంగా సిటీ రోడ్లను విస్తరించడం లేదు. ఫుట్‌పాత్‌ల ఆక్రమణ, ఇరుకైన రోడ్లతో వాహనదారులకు ట్రాఫిక్ తిప్పలు తప్పట్లేదు. ట్రాఫిక్ జామ్స్‌లో చిక్కుకుని ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దీంతో రోడ్డెక్కాలంటే సిటిజన్లు జంకుతున్నారు.
అల్టర్నేట్ మార్గాలపై ఫోకస్..
ఇలాంటి ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు పోలీసులు కొత్త యాక్షన్ ప్లాన్ సిద్దం చేశారు. రద్దీ ఎక్కువగా ఉండే ఏరియాల్లో అల్టర్నేట్ రూట్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం వెహికల్ మూవ్‌మెంట్ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఇప్పటికే ట్రయల్ రన్ పూర్తి చేశారు. రోడ్లపై రద్దీని తగ్గించేందుకు తీసుకోవల్సిన ప్రత్యామ్నాయ చర్యలను స్టడీ చేశారు. లైట్ మోటార్ వెహికల్స్, బైక్స్, కార్లు, ఆటోలు ట్రావెల్ చేసేందుకు ప్రత్యేక రూట్లను ఏర్పాటు చేసేందుకు ప్లానింగ్ రెడీ చేశారు. ట్రాఫిక్ ఎక్కువగా ఉండే డైవర్షన్స్, రోప్ డివైడర్స్‌తో ఫ్రీ వెహికల్ మూవ్‌మెంట్ కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. సిటీ కమిషనరేట్ పరిధిలోని మెయిన్ రోడ్లలో ట్రాఫిక్‌ను పరిశీలించారు. సికింద్రాబాద్, రసూల్‌పురా, బేగంపేట, పంజాగుట్ట, మెహిదీపట్నం, మాసబ్ ట్యాంక్, లక్డీకపూల్, మలక్‌పేట, జూబ్లీహిల్స్‌లో ట్రాఫిక్ స్లో మూవ్‌మెంట్ ఏరియాలను పరిశీలించారు.
షార్ట్‌కట్ రూట్ ఏర్పాటు
వాహనదారుల ట్రావెలింగ్ సమయం, ట్రాఫిక్ ఇబ్బందులు పరిష్కరించేందుకు సిటీ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యామ్నాయ మార్గాలను గుర్తించారు. ఇందులో భాగంగా మెహిదీపట్నం నుంచి బంజారాహిల్స్ రోడ్ నం.1కు వెళ్ళేందుకు షార్ట్ కట్ ఏర్పాటు చేశారు. మరొకటి అజీజ్‌నగర్ మాస్క్ నుంచి గుడిమల్కాపూర్, అత్తాపూర్ పిల్లర్ నం. 68 వరకు వెళ్లేందుకు రూట్ ఏర్పాటు చేశారు. ఈ రూట్లలో హెవీ వెహికల్స్ మినహా బైక్‌లు, కార్లు, ఆటోలు, లైట్ మోటార్ వెహికల్స్ వెళ్లేందుకు అనుమతి ఇస్తారు. ట్రావెల్ చేయాల్సిన రూట్లను సూచిస్తూ సైన్ బోర్డులు పెట్టారు. దీంతో సిగ్నల్స్, ట్రాఫిక్ జామ్స్ లేకుండానే షార్ట్ కట్‌లో తక్కువ సమయంలో ఎక్కువ దూరం ట్రావెల్ చేస్తున్నారు. ఇది సక్సెస్ కావడంతో సిటీలోని అన్ని రోడ్లలో మినీ డైవర్షన్లను ప్లాన్ చేస్తున్నారు.
దూరం, టైమ్ తగ్గించే ప్రయత్నం
వాహనదారుల ట్రావెలింగ్ టైం తగ్గించాలన్నదే మా ప్రయత్నం. పీక్ అవర్స్‌లో ఫ్రీగా వెళ్లేలా ప్లాన్ చేస్తున్నాం. కొత్తగా తీసుకొచ్చిన మినీ డైవర్షన్లతో ట్రాఫిక్, దూరం రెండూ తగ్గుతాయి. మెయిన్రోడ్లపై ట్రాఫిక్ సమస్యలు ఉండవు. బేగంపేట, రసూల్‌పురా, సికింద్రాబాద్, నల్గొండ క్రాస్ రోడ్స్, అంబర్‌పేట 6 నంబర్ వద్ద కూడా పీక్ అవర్స్‌లో డైవర్షన్స్ చేస్తున్నాం. దీంతో వాహనదారులకు చాలా ఈజీ జర్నీ ఉంటోంది. సిటీలోని అన్ని ప్రాంతాల్లోనూ ఇదే పద్ధతిని అమలు చేస్తాం.
-
జి. సుధీర్‌బాబు, అడిషనల్ సీపీ, సిటీ ట్రాఫిక్ చీఫ్
రోడ్డు ప్రమాదాల నివారణకు గ్రూప్
సిటీలో రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఆర్టీఏ, జీహెచ్ఎంసీ, ఎస్‌సీబీ, నేషనల్ హైవే అథారిటీస్, ఆర్ అండ్ బీ అధికారులతో కలిసి ‘ రోడ్ యాక్సిడెంట్ అనాలిసిస్ గ్రూప్’(ఆర్‌ఏఏజీ) ఏర్పాటు చేశారు. శనివారం సిటీ ట్రాఫిక్ చీఫ్ సుధీర్‌కుమార్ సమావేశం నిర్వహించారు.ఈ ఏడాది 10 నుంచి 15 శాతం ప్రమాదాలు తగ్గించేందుకు చర్చలు జరిపామన్నారు. 65 బ్లాక్ స్పాట్లలో ప్రమాదాల నివారణ చర్యలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.