టీటీడీ పేరుతో ఆన్‌లైన్‌ గేమ్స్, వెబ్ సైట్లు పెడితే చర్యలు

టీటీడీ పేరుతో ఆన్‌లైన్‌ గేమ్స్, వెబ్ సైట్లు పెడితే చర్యలు
  • సెక్యూరిటీ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ గోపినాథ్ జెట్టి

తిరుపతి: టీటీడీ పేరుతో ఆన్ లైన్ గేమ్స్, వెబ్ సైట్స్ తయారు చేస్తే చర్యలు తప్పవని సెక్యూరిటీ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ గోపినాథ్ జెట్టి హెచ్చరించారు. తిరుపతికి చెందిన వరదాచారి సురేష్ అనే వ్యక్తి  ' తిరుపతి హిల్  క్లైబింగ్ రేసింగ్ గేమ్  అండ్  తిరుపతి బస్ డ్రైవర్ ’ అనే పేరుతో  ఆన్ లైన్ లో గేమ్  తయారు చేయడంతో పాటు,  ‘డిజిటల్ అన్నమయ్య’ పేరుతో వెబ్ సైట్ నిర్వహిస్తున్నట్లు టీటీడీ దృష్టికి వచ్చిందని సివిఎస్ఓ గోపీనాథ్ జెట్టి ఒక ప్రకటనలో తెలిపారు.
విజిలెన్స్ అధికారులు విచారణ జరపగా నిబంధనలకు విరుద్ధంగా టీటీడీ పేరుతో వరదాచారి సురేష్ అనే వ్యక్తి ఆన్లైన్ గేమ్ తయారు చేసి గూగుల్ ప్లే స్టోర్ లో ఉంచినట్లు నిర్ధారణ అయింది. అంతేకాదు ఒక వెబ్ సైట్ కూడా నిర్వహిస్తున్నట్లు నిరూపణ అయింది. నిందితుడిపై చట్ట ప్రకారం చర్యలుతీసుకుంటున్నామని సీవీఎస్ఓ గోపినాథ్ జెట్టి తెలిపారు. టీటీడీ పేరు ఉపయోగించుకుని ఇలాంటి ఆన్లైన్ గేమ్ లు,  వెబ్సైట్లు నిర్వహించడం చట్ట విరుద్ధమని, ఎవరైనా నిర్వహిస్తే అలాంటి వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని సివిఎస్ఓ హెచ్చరించారు. టీటీడీ పేరుతో ఇలాంటి ఆన్ లైన్ గేమ్ లు, వెబ్ సైట్లతో టీటీడీకి ఎలాంటి సంబంధం లేదనే విషయం ప్రజలు గుర్తించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.