
దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి జంటగా వెంకీ అట్లూరి రూపొందించిన చిత్రం ‘లక్కీ భాస్కర్’. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. దీపావళి కానుకగా అక్టోబర్ 31న వరల్డ్‌వైడ్‌గా సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ ‘ట్రైలర్ చాలా బాగుంది. దుల్కర్ ఫైనెస్ట్ యాక్టర్. ఆయన సినిమాలకు నేను పెద్ద ఫ్యాన్‌ని. ఆయనతో మహానటి, కల్కి చిత్రాల్లో నటించాను.
వెంకీ అట్లూరి చెప్పిన పాయింట్ అందరికీ నచ్చుతుంది. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నా’ అని చెప్పాడు. మరో గెస్ట్‌గా హాజరైన దర్శకుడు త్రివిక్రమ్ మాట్లాడుతూ ‘ఈ సినిమాకు లక్కీ భాస్కర్ యాప్ట్ టైటిల్. సినిమా చూశాక.. ప్రతి ఒక్కరి నటన గుర్తుండిపోయింది. ఇందులోని నటీనటులను వెంకీ ప్రెజెంట్ చేసిన విధానం చాలా బాగుంది. ప్రతి యాక్టర్ ఎమోషన్ క్రియేట్ చేశారు. దుల్కర్ సల్మాన్ నెక్స్ట్ లెవల్‌లో నటించాడు. మిడిల్ క్లాస్ వ్యక్తి ఒక అడ్వెంచర్ చేస్తే గెలవాలని కోరుకుంటాం. తడిచిన కళ్లతో నవ్వుతున్న పెదాలతో ప్రేక్షకులు థియేటర్స్ నుంచి బయటికి వస్తారని నమ్ముతున్నా’ అని అన్నారు.
దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ ‘ఇదొక హానెస్ట్ అటెంప్ట్. వెంకీ రాసిన కథలో జీవితం ఉంది. ఈ సినిమాకు నేను మూడు భాషల్లో డబ్బింగ్ చెప్పాను. ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యేలా సినిమా ఉంటుంది’ అని చెప్పాడు. సుమతి పాత్రలో ఆకట్టుకుంటానంది మీనాక్షి చౌదరి. డబ్బు అవసరమున్న ప్రతి ఒక్కరికీ ఈ సినిమా నచ్చుతుంది అని వెంకీ అట్లూరి అన్నాడు. ఈ కార్యక్రమంలో మూవీ టీమ్ అంతా పాల్గొన్నారు.