
విలక్షణ నటనకు కంచు కోట.. కోట శ్రీనివాసరావు. పాత్ర ఏదైనా పరకాయ ప్రవేశం చేసే నటుడాయన. నాలుగు దశాబ్దాలకుపైగా కొనసాగిన ఆయన సినీ కెరీర్‌లో పిసినారి నుంచి పొలిటికల్ లీడర్ వరకు, కానిస్టేబుల్ నుంచి కన్నింగ్ విలన్ వరకు చేయని పాత్రంటూ లేదు. ఎవరినో మెప్పించాలనే ఆలోచనలు లేకుండా ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తిత్వం ఆయనది. నరనరాన నటనే నింపుకుని నాటకరంగం నుంచి తెలుగు చిత్ర పరిశ్రమలోకి వచ్చి విలక్షణ నటనకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు కోట శ్రీనివాసరావు. భౌతికంగా ఆయన అందర్నీ విడిచివెళ్లినా, మరపురాని పాత్రల రూపంలో ఎప్పటికీ జీవించే ఉంటారు..
‘ప్రతిఘటన’తో ప్రతి ఒక్కరి మనసుల్లో..
1942 జులై 10న కృష్ణాజిల్లా కంకిపాడులో కోట శ్రీనివాసరావు జన్మించారు. డిగ్రీ పూర్తయ్యాక స్టేట్ బ్యాంక్‌లో ఉద్యోగం చేశారు. అయితే బ్యాంకులో లక్షలు లెక్కబెడుతున్నా మనసంతా నటనపైనే ఉండేది. ఆ ఆసక్తితోనే తరచూ నాటక ప్రదర్శనల్లో పాల్గొంటూ రంగస్థలంపై తన ప్రతిభను చాటేవారు. ఒకసారి రవీంద్రభారతిలో నాటక ప్రదర్శనలో పాల్గొన్నారు.
అప్పుడు దర్శకుడు క్రాంతికుమార్ ఆయన టాలెంట్‌ను చూసి ‘ప్రాణం ఖరీదు’సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం చేశారు. మొదట్లో సినిమాలను సీరియస్‌గా తీసుకోకపోయినా, 1985లో వచ్చిన ‘ప్రతిఘటన’చిత్రంలోని ‘గుడిశెల కాశయ్య’పాత్రతో మంచి గుర్తింపును పొందారు. ఈ సినిమా తర్వాత ఆయన వెనుతిరిగి చూసుకోలేదు.
4 దశాబ్దాలు.. 750కి పైగా సినిమాలు:
ఒకే రోజు 3 రాష్ట్రాల్లో షూటింగ్‌లకి హాజరైన రికార్డ్ ఆయనకు ఉంది. రోజుకి నాలుగు కాల్‌షీట్స్, ఇతర భాషల్లో నటించిన ప్రత్యేకత ఆయన సొంతం. విలన్, కామెడీ, క్యారెక్టర్ ఆర్టిస్ట్, సపోర్టింగ్ క్యారెక్టర్ సహా ఎలాంటి పాత్రనైనా అవలీలగా పోషించి నవరసాలు పండించగల బహుముఖ నటుడిగా పేరు తెచ్చుకున్నారు.
‘అహ నా పెళ్లంట’లో పిసినారి లక్ష్మీపతి, ‘హలోబ్రదర్’లో కానిస్టేబుల్ తాడి మట్టయ్య,‘గణేష్’లో సాంబశివుడు,‘గాయం’లో గురునారాయణ, ‘ఆ నలుగురు’లో కోటయ్య, ‘అతడు’లో బాజిరెడ్డి పాత్రలను ప్రేక్షకులు మర్చిపోలేరు. తెలుగుతోపాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళ చిత్రాల్లోనూ ఆయన నటించారు. 40 ఏళ్ల సినీ ప్రస్థానంలో 750కిపైగా సినిమాల్లో నటించారు.
పాత్ర ఏదైనా.. పరకాయ ప్రవేశం చేయాల్సిందే:
ఎలాంటి పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేసేస్తారు కోట. ముఖ్యంగా మధ్యతరగతి జీవన శైలికి ఆయన పాత్రలు అద్దం పట్టినట్లుగా ఉంటాయి. పేదింటి బాబాయ్, పిసినారి నాన్న, కరుడుగట్టిన మావయ్య, నమ్మకమైన నాయకుడు, క్రమశిక్షణ గల ఇంటి పెద్ద ఇలా అనేక పాత్రలలో ఆయన జీవించారు. ప్రతి పాత్రలోనూ తనదైన హావాభావాలను పలికించేవారు.
ఆమె, ఆ నలుగురు, అమ్మో ఒకటో తారీఖు లాంటి చిత్రాల్లో తనదైన నటనతో ఆకట్టుకున్నారు. అలాగే ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’సినిమాలో అల్లరి తాతగా.. బొమ్మరిల్లు, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే సినిమాల్లో ఓ మధ్య తరగతి తండ్రిగా ఎమోషన్‌తో కన్నీళ్లు పెట్టించారు. విలనిజంలో అయితే సెపరేట్ ట్రెండ్ క్రియేట్ చేశారు.
వెరైటీ విలనిజం:
అప్పటివరకూ తెరపై చూసిన విలనిజంలోని నాటకీయతకు భిన్నంగా హాస్యం, పాత్రోచిత యాస కలగలిపి, వాస్తవికతకు దగ్గరగా ఉండే సరికొత్త విలన్‌గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు కోట. ఆయన నటనలో అసలైన విలనీజం పరాకాష్టకు చేర్చిన సినిమా‘గణేశ్’.ప్రజల ప్రాణాలను జలగలా పీల్చే ఆరోగ్యమంత్రి సాంబశివుడిగా ఆయన పాత్రలో చూపిన క్రూరత్వం, తీవ్రత, ప్రేక్షకులను హత్తుకునేలా ఉండేది.
మాటల్లోనే కాదు పాత్రల్లోనూ వ్యంగ్యం:
సమాజంలో మనం రోజూ చూస్తున్న మనుషుల వ్యక్తిత్వాలను, మూర్ఖత్వాలను వ్యంగ్యరీతిలో తను పోషించే పాత్రల్లోకి జొప్పించేవారు కోట. అందుకే ఆయన పొలిటీషియన్‌గానే కాదు కమెడియన్‌గా నటించినా అందులో ఒక సోషల్ సెటైర్ కనిపించేది. ఓ వైపు డైలాగ్స్‌లో కామెడీ పండిస్తూ అదే సమయంలో ముఖ కవలికల్లో విలనీ చూపించగల సమర్ధత ఆయనకే సొంతం. విలన్‌గా నటించిన పాత్రల్లో ఆయన ఫేస్ ఎక్స్‌ప్రేషన్స్ చూస్తే గగుర్పాటు కలగక మానదు.
చివరివరకూ నటించాలని:
ఆయనకు భార్య రుక్మిణి దేవి. ఒక కొడుకు, ఇద్దరు కూతుళ్లు కాగా.. కొడుకు కోట ప్రసాద్ 2010లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం ఆయనకు తీరని విషాదాన్ని మిగిల్చింది. ‘పెద్ద గుమ్మడికాయంత టాలెంట్ ఉంటే కుదరదు. ఆవగింజత అదృష్టం కూడా ఉండాలి’ఆ కోవలోనే తాను ప్రేక్షకులను మెప్పించగలిగానని ఆయన చెప్పేవారు.
‘చచ్చేదాకా నటించాలి.. చచ్చిన తర్వాత నటుడిగా బ్రతకాలి’అనేది ఆయన కోరిక. ఆయన కోరుకున్నట్టుగానే ఎన్నో అద్భుతమైన పాత్రలతో తెలుగు సినిమా ఉన్నంతకాలం జీవించే ఉంటారు. ఈనెల 24న వస్తున్న పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’సినిమా ఆయన నటించిన చివరి చిత్రం.