కరోనా భయం.. సాయం కోసం వేలాది కాల్స్

కరోనా భయం.. సాయం కోసం వేలాది కాల్స్

న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకండ్ వేవ్ వేగంగా వ్యాప్తి అవుతోంది. వైరస్ విజృంభణతో రోజుకు 2 లక్షలకు పైనే కేసులు నమోదవుతున్నాయి. చాలా రాష్ట్రాల్లో ఆస్పత్రుల్లో బెడ్‌‌లు దొరక్కపోవడం, ఆక్సిజన్ సిలిండర్ల కొరత, పేషెంట్లతో హాస్పిటళ్లు నిండిపోవడం లాంటివి చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో కరోనా సిచ్యువేషన్ మీద ప్రముఖ నటుడు సోనూ సూద్ స్పందించారు. కరోనాతో భయానక పరిస్థితులు నెలకొన్నాయని, అందరూ తప్పనిసరిగా జాగ్రత్తలు పాటిస్తూ ఇళ్ల వద్దే ఉండాలని సోనూ ట్వీట్ చేశారు. 

‘ఉదయం నుంచి నాకు ఎన్నో ఫోన్ కాల్స్ వచ్చాయి. ఆస్పత్రుల్లో బెడ్‌‌లు, మెడిసిన్స్, ఇంజెక్షన్‌‌లు దొరకట్లేదని వేలాది మంది ఫోన్‌లో వాపోయారు. వాళ్లకేమీ చేయలేకపోతున్నానని నాకు బాధేస్తోంది. పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది. దయచేసి అందరూ ఇళ్లలోనే ఉంటూ మాస్కులు వేసుకొని ఇన్ఫెక్షన్ బారిన పడకుండా జాగ్రత్త వహించండి. మనమందరమూ కలిస్తే చాలా మంది ప్రాణాలను కాపాడగలం. ఇప్పుడు ఎవర్నీ తప్పుబట్టలేం. ఆపదలో ఉన్న వారిని దయచేసి ఆదుకోండి’ అని సోనూ విజ్ఞప్తి చేశారు.