మాజీ మంత్రికి నోటీసు ఇచ్చిన నటి చాందిని

మాజీ మంత్రికి నోటీసు ఇచ్చిన నటి చాందిని
  • పెళ్లి చేసుకుంటానని మోసం చేసినందుకు కేసు పెట్టిన నటి
  • నష్టపరిహారంగా రూ.10 కోట్లు చెల్లించాలంటూ కోర్టులో పిటిషన్ దాఖలు

చెన్నై: తమిళనాడు అన్నాడీఎంకే మాజీమంత్రి మణికంఠన్‌కు నటి చాందిని లీగల్ నోటీసులు ఇచ్చారు. పెళ్లి చేసుకుంటానని తనతో సహజీవనం చేసి మోసం చేశారని గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు పెట్టిన విషయం తెలిసిందే. తనతో కలసి వ్యాపారం చేస్తానని చెప్పి పరిచయం పెంచుకుని.. సన్నిహితుడిగా ఉంటానని నమ్మించాడని.. చివరకు భార్యకు విడాకులిస్తానంటూ తనతో సహజీవనం చేసి మోసం చేశాడని.. పెళ్లి చేసుకోమని అడిగిన ప్రతిసారి వాయిదా వేస్తూ వచ్చాడని, గర్భం దాలిస్తే అబార్షన్ చేయించాడని బహిరంగంగా చేసిన ఆరోపణలు తమిళనాట కలకలం రేపాయి. కేసు గురించి తెలిసిన వెంటనే మాజీ మంత్రి మణికందన్ బెంగళూరుకు వెళ్లిపోగా తమిళనాడు పోలీసులు అక్కడికి వెళ్లి అరెస్టు చేసి చెన్నై తీసుకొచ్చారు. ఒకవైపు ఈ కేసు నడుస్తుండగా.. తాజాగా మణికంఠన్ తనకు రూ.10 కోట్లు నష్టపరిహారం చెల్లించాలంటూ సైదాపేట కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాను చెన్నైలోనే ఉంటూ కోర్టు కేసు వ్యవహారాలను చూసుకోవాల్సి వస్తోందని, దీని కోసం తనకు అయ్యే నెలవారి ఖర్చులు కూడా మాజీ మంత్రి మణికంఠన్ చెల్లించాలని నటి చాందిని సదరు పిటిషన్‌లో కోరారు.