అదానీ క్యాపిటల్ ఐపీఓకి వచ్చే ఆలోచనలో ఎన్‌‌బీఎఫ్‌‌సీ కంపెనీ

అదానీ క్యాపిటల్ ఐపీఓకి వచ్చే ఆలోచనలో ఎన్‌‌బీఎఫ్‌‌సీ కంపెనీ

న్యూఢిల్లీ: అదానీ గ్రూప్‌‌‌‌కు చెందిన ఎన్‌‌బీఎఫ్‌‌సీ కంపెనీ అదానీ క్యాపిటల్ ఐపీఓకి వచ్చే ఆలోచనలో ఉంది. ఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ. 1,500 కోట్లను సేకరించాలని కంపెనీ ప్లాన్స్ వేస్తోంది. 2 బిలియన్ డాలర్ల (రూ. 16 వేల కోట్ల) వాల్యుయేషన్ దగ్గర కంపెనీలో 10 శాతం వాటాను ఐపీఓ ద్వారా అమ్మాలని చూస్తున్నామని అదానీ క్యాపిటల్‌‌ ఎండీ గౌరవ్‌‌ గుప్తా అన్నారు. మార్కెట్‌‌లో లిస్ట్‌‌ అయ్యాక క్యాపిటల్‌‌ను సేకరించడం మరింత ఈజీగా ఉంటుందని అని పేర్కొన్నారు. ముంబైకి చెందిన ఈ కంపెనీ రైతులు, చిన్న, మధ్యతరహా బిజినెస్‌‌లకు అప్పులిస్తోంది. గౌతమ్ అదానీ చైర్మన్‌‌గా ఉన్న అదానీ క్యాపిటల్‌‌ ఫైనాన్షియల్ సెక్టార్‌‌‌‌లో పెద్దగా విస్తరించలేదు. 

ఈ కంపెనీ రూ. 30 వేల నుంచి రూ. 30 లక్షల మధ్య లోన్ మార్కెట్‌‌పైనే ఎక్కువగా ఫోకస్ పెట్టింది. ‘మేము ఫిన్‌‌టెక్ కంపెనీ కాదు. కస్టమర్లకు మెరుగైన సేవలను అందించేందుకు టెక్నాలజీని వాడుతున్న ఒక క్రెడిట్‌‌ కంపెనీ’ అని గుప్తా అన్నారు. అదానీ క్యాపిటల్‌‌ ఎనిమిది రాష్ట్రాల్లో154 బ్రాంచులను ఆపరేట్‌‌ చేస్తోంది. 60 వేల మంది బారోవర్లకు ఇప్పటి వరకు లోన్లు ఇచ్చిందని గుప్తా పేర్కొన్నారు. రూ. 3 వేల కోట్ల లోన్‌‌బుక్‌‌ను మెయింటైన్ చేస్తున్నా, కంపెనీ గ్రాస్ ఎన్‌‌పీఏల రేషియో మాత్రం 1 శాతంగానే ఉందని చెప్పారు.