- 20 శాతం పెరిగిన అదానీ ఎంటర్ప్రైజెస్
బిజినెస్ డెస్క్, వెలుగు: అదానీ గ్రూప్‌కు సుప్రీం కోర్టు ఎక్స్‌పర్ట్ కమిటీ నుంచి ఊరట లభించడంతో ఈ గ్రూప్ షేర్లు దూసుకుపోతున్నాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేర్లయితే సోమవారం సెషన్‌లో 19 శాతం వరకు పెరిగాయి. అదానీ విల్‌మార్ షేర్లు 10 శాతం పెరగగా, అదానీ పోర్ట్స్, అంబుజా సిమెంట్స్, ఏసీసీ, అదానీ పవర్, ట్రాన్స్‌మిషన్, గ్రీన్ ఎనర్జీ, టోటల్ గ్యాస్, ఎన్‌డీటీవీ షేర్లు కూడా ఐదు శాతం ఎగిసి అప్పర్ సర్క్యూట్‌ను టచ్ చేశాయి. హిండెన్‌బర్గ్ రిపోర్ట్ వెలువడిన తర్వాత షేర్లకు ఇదే బెస్ట్ డే. షార్ట్ పొజిషన్ల నుంచి ట్రేడర్లు ఎగ్జిట్ అవుతున్నారని, అంతేకాకుండా కొత్తగా లాంగ్ పొజిషన్లు బిల్డప్ అవుతున్నాయని బ్లూమ్‌బర్గ్ రిపోర్ట్ చేసింది. ఎంఎస్‌సీఐ ఇండెక్స్‌ల నుంచి బయటకు వచ్చేయడం, ఫండ్స్ సేకరణకు రెండు కంపెనీల్లో వాటాలను అమ్మాలనుకునే ప్లాన్‌కు తెరపడడంతో రెండు వారాల కిందట కంపెనీ షేర్లలో అమ్మకాలు మళ్లీ మొదలయ్యాయి. తర్వాత సుప్రీం కోర్ట్ ఎక్స్‌పర్ట్ ప్యానెల్ నుంచి ఊరట దొరకడంతో ఇన్వెస్టర్లలో కాన్ఫిడెన్స్ పెరిగిందని ఎనలిస్టులు పేర్కొన్నారు. ‘సుప్రీం కోర్టు రిపోర్ట్ కంపెనీపై ఇన్వెస్టర్లలో కాన్ఫిడెన్స్ పెంచింది. దీనికి అదనంగా అదానీ గ్రూప్ తన నాన్ కోర్ అసెట్లను అమ్మి ఫండ్స్ సేకరించాలని చూస్తోంది. ఈ అంశాలన్నీ ఇన్వెస్టర్ల కాన్ఫిడెన్స్ పెంచుతున్నాయి’ అని వెల్త్‌మిల్స్ సెక్యూరిటీస్‌కు చెందిన క్రాంతి బత్తిని అన్నారు. వోలటాలిటీ ఎక్కువగా ఉండడం వలన రిస్క్ తీసుకోవాలనుకునే వారే ఈ షేర్లలో ఇన్వెస్ట్ చేయాలని సలహా ఇచ్చారు. కాగా, అదానీ షేర్లు పెరగడంలో మానిప్యులేషన్ జరిగిందనడానికి ఆధారాల్లేవని సుప్రీం కోర్టు ఎక్స్‌పర్ట్ ప్యానెల్ పేర్కొన్న విషయం తెలిసిందే.
ఆస్తుల అమ్మకం..
కొన్ని రియల్ ఎస్టేట్ ఆస్తులను అమ్మి, ఫండ్స్ సేకరించాలని అదానీ గ్రూప్ చూస్తోంది. బంద్రా–కుర్లా కాంప్లెక్స్‌లోని ఇన్‌స్పైర్ బీకేసీ కమర్షియల్ ప్రాజెక్ట్ ఈ లిస్టులో ఉందని సంబంధిత వ్యక్తులు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్‌ను రూ.650 కోట్లకు అమ్మే ఆలోచనలో ఉన్నారు. మొదటిలో బ్రూక్‌ఫీల్డ్ అసెట్ మేనేజ్‌మెంట్ ఈ కమర్షియల్ ప్రాజెక్ట్‌ను కొనుగోలు చేయనుందనే వార్తలొచ్చాయి. నాన్ కోర్ అసెట్స్‌ను అమ్మడం ద్వారా సేకరించిన ఫండ్స్‌ను కంపెనీ తన రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్‌ల కోసం ఖర్చు చేయనుంది.
రెండు అదానీ కంపెనీలపై బై రేటింగ్..
అదానీ పోర్ట్స్, అదానీ ట్రాన్స్‌మిషన్ షేర్లపై ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ జెఫరీస్ ‘కొనొచ్చు’ రేటింగ్ ఇచ్చింది. ఈ సంస్థ అదానీ గ్రూప్‌కు చెందిన ఎనిమిది లిస్టెడ్ కంపెనీలు, గ్రీన్ హైడ్రోజన్, డేటా సెంటర్, డిజిటల్ ప్లే, ఏరోస్పేస్, డిఫెన్స్, వాటర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వంటి కొత్త బిజినెస్‌లను విశ్లేషించి ఈ రేటింగ్ ఇచ్చింది. గ్రూప్ అప్పులు ఎక్కువగా ఉన్నాయనే అంశంపై జెఫరీస్ రిపోర్ట్ స్పందించింది. షేర్ల తనఖాపై తీసుకున్న 2.15 బిలియన్ డాలర్ల లోన్‌ను డెడ్‌లైన్ కంటే ముందే గ్రూప్ తీర్చిందని గుర్తు చేసింది. అంబుజా కొనుగోలు కోసం చేసిన 500 మిలియన్ డాలర్ల లోన్‌ను కూడా తీర్చిందని వెల్లడించింది. 22 శాతం మార్కెట్ షేర్‌తో అదానీ పోర్ట్స్ మార్కెట్ లీడర్‌గా ఉందని జెఫరీస్ పేర్కొంది. కంపెనీ తాజాగా కొన్న పోర్టుల్లో కూడా వాల్యూమ్ హ్యాండ్లింగ్ మీడియం టెర్మ్‌లో రెండంకెల వృద్ధి సాధిస్తుందని అంచనా వేసింది. మార్కెట్‌లో లిస్ట్ అయిన ట్రాన్స్‌మిషన్, డిస్ట్రిబ్యూషన్ సెక్టార్‌లోని ఏకైక ప్రైవేట్ కంపెనీ అదానీ ట్రాన్స్‌మిషన్. డిస్ట్రిబ్యూషన్ అమెండమెంట్ యాక్ట్ వస్తే ఈ కంపెనీ ఎక్కువగా లాభపడుతుందని తెలిపింది. అదానీ పవర్ షేర్లు లాంగ్ టర్మ్‌లో మంచి రిటర్న్స్ ఇస్తాయని కూడా ఈ రిపోర్ట్ వెల్లడించింది. ఫుడ్ బిజినెస్‌లో విస్తరిస్తుండడంతో అదానీ విల్‌మార్‌పై పాజిటివ్‌గా ఉన్నామని పేర్కొంది. కానీ, అదానీ విల్‌మార్, పవర్ కంపెనీలకు బై రేటింగ్ ఇవ్వలేదు.
మార్కెట్ అప్..
అదానీ, ఐటీ షేర్లు పెరగడంతో బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లు సోమవారం లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 234 పాయింట్లు (0.38 శాతం) పెరిగి 61,963 వద్ద, నిఫ్టీ 111 పాయింట్లు ఎగిసి 18,314 వద్ద క్లోజయ్యాయి. నిఫ్టీ ఐటీ, ఫార్మా, పీఎస్‌యూ బ్యాంక్, ఎఫ్‌ఎంసీజీ ఇండెక్స్‌లు లాభాల్లో కదిలాయి. మిడ్‌క్యాప్100 ఇండెక్స్, స్మాల్‌క్యాప్ 100 ఇండెక్స్ 0.60 శాతం చొప్పున పెరిగాయి. డాలర్ మారకంలో రూపాయి విలువ 16 పైసలు తగ్గి 82.83 వద్ద 13 వారాల కనిష్టాన్ని నమోదు చేసింది.
