ముంబై ఎయిర్ పోర్టులో అదానీ ల్యాండింగ్

ముంబై ఎయిర్ పోర్టులో అదానీ ల్యాండింగ్

ఎంఐఏఎల్‌ లో జీవీకే వాటాలు అమ్మకం

అదానీ టేకోవర్ చేస్తున్నట్టు జీవీకే ప్రకటన

అప్పుల భారం తగ్గుతుందని ఆశాభావం

కరోనా మహమ్మారితో దెబ్బతిన్న వ్యాపారాలు

ముంబై :  ముంబై ఎయిర్ పోర్టులో, అదానీ ల్యాండ్ అయింది. ముంబై ఎయిర్ పోర్టు, నవీ ముంబై ఎయిర్ పోర్టు ప్రాజెక్ట్ కంట్రోల్ను, డెట్ను అదానీ గ్రూప్ టేకోవర్ చేస్తున్నట్టు జీవీకే పవర్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ సోమవారం ప్రకటించింది. ముంబై ఎయిర్ పోర్టు, నవీ ముంబై ఎయిర్ పోర్ట్ ప్రాజెక్టులో 74 శాతం చొప్పున వాటాను అదానీ గ్రూప్ పొందుతుందని తెలిపింది. లెండర్ల నుంచి ఒత్తిడి, కరోనా మహమ్మారితో దెబ్బతిన్న వ్యాపారాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు జీవీకే ఫౌండర్ జీవీ కృష్ణారెడ్డి తెలిపారు. అప్పుల భారంతో పాటు ఆర్థిక అవకతవకలపై సీబీఐ విచారణతో ఇప్పటికే తీవ్రంగా ఇబ్బందులు పడుతోన్న జీవీకే గ్రూప్ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు ప్రాజెక్ట్ నుంచి బయటికి వచ్చేయాలని చూసింది. సుమారు రూ.705 కోట్లు దారి మళ్లాయనే ఆరోపణలతో జీవీకే గ్రూప్ పై సీబీఐ విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే.

గోల్డ్ మ్యాన్ శాచ్స్ కన్సార్షియం, హెచ్ డిఎఫ్ సి వంటి లెండర్ల నుంచి జీవీకే తీసుకున్న అప్పుల బాధ్యత కూడా ఈ కొనుగోలులో భాగంగా అదానీ నెత్తినే పడుతుంది. ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుని మొత్తం వాటాలను జీవీకే గ్రూప్ హెచ్ డీ ఎఫ్ సి బ్యాంక్, యెస్ బ్యాంక్ వద్ద తనాఖా పెట్టింది. వాటాలు తనాఖా పెట్టి బ్యాంక్ల వద్ద తీసుకున్న అప్పులను క్లియర్ చేసేందుకు జీవీకే గ్రూప్కు ఈ డీల్ సహకరించనుంది. జీవీకే గ్రూప్ అప్పులు సుమారు రూ.6 వేల కోట్లుగా ఉన్నాయి. ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు చెందిన డెట్ ఇన్స్ట్రుమెంట్ల రేటింగ్ ను రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ ఇటీవలే డౌన్ గ్రేడ్ చేసింది. ఈ డీల్లో భాగంగా డెట్కు బదులుగా జీవీకే ఇచ్చిన పలు ఆబ్లిగేషన్స్, సెక్యూరిటీలు, కార్పొరేట్ గ్యారెంటీలు అన్ని కూడా ఇరు వర్గాల ఆమోదం మేరకు నిబంధనల ప్రకారం విడుదల చేయనున్నారు. అదానీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎంఐఏల్ కన్సార్షియంలోకి తాజాగా ఫండ్స్ను చొప్పించనుంది. నవీ ముంబై ఎయిర్పోర్ట్ ప్రాజెక్ట్కు ఫైనాన్షియల్ పరంగా సపోర్ట్ ఇవ్వనుంది. అయితే ఎంత మొత్తాన్ని ఇవ్వనుందో మాత్రం ప్రత్యేకంగా చెప్పలేదు. కరోనా కారణంతో ఏవియేషన్ ఇండస్ట్రీ బాగా కుదేలైంది. ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ ఆర్థికంగా చితికిపోయింది. ఎంఐఏఎల్ ఆర్థిక స్థితి మెరుగుపరిచేందుకు వీలైనంత తక్కువ టైమ్ లో ఆర్థికంగా బలంగా ఉన్న ఇన్వెస్టర్ను తీసుకురావాల్సి ఉందని జీవీకే గ్రూప్ ఛైర్మన్ జీవీకే రెడ్డి చెప్పారు. అదేవిధంగా నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రాజెక్ట్ను గడువు లోపల పూర్తి చేసేందుకు కూడా ఈ డీల్ సాయపడనుందని పేర్కొన్నారు.

ఒక డీల్.. రెండు లక్ష్యాలు..

ఈ పరిణామాల నేపథ్యంలో అదానీతో  కలిసి పనిచేసేందుకు తాము అంగీకరించామని జీవీకే రెడ్డి తెలిపారు. ఫలితంగా అప్పుల భారం తగ్గడంతో పాటు, నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రాజెక్ట్ను గడువు లోపల పూర్తి చేయడమనే రెండు లక్ష్యాలూ నెరవేరుతాయన్నారు. తమ లెండర్ల లయబులిటీలను కూడా ఈ లావాదేవీలో భాగంగా తగ్గించుకోనున్నామని తెలిపారు. జీవీకే గ్రూప్కు ఇది ఎంతో ముఖ్యమైనదని పేర్కొన్నారు. మరోవైపు, అమలుకు సాధ్యం కాకపోవడంతో గతంలో అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ, నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్, పీఎస్పీలతో కుదుర్చుకున్న ఒప్పందాలు రద్దు చేసినట్లు (టెర్మినేట్) జీవీకే గ్రూప్ నోటిఫై చేసింది. పై  ముగ్గురు ఇన్వెస్టర్లకు 79 శాతం వాటాను అమ్మేందుకు గతేడాది జీవీకే గ్రూప్ అగ్రిమెంట్లు కుదుర్చుకుంది. ఈ డీల్ వాల్యు రూ.7,614 కోట్లు. కానీ ఈ ట్రాన్సాక్షన్ కార్యరూపంలోకి రాలేదు. అంతేకాక ప్రత్యామ్నాయ ప్రతిపాదనలను కూడా లెండర్లకు ఈ ఆగస్ట్ చివరి నాటికి వారు సమర్పించ లేదు. దీంతో ఈ ట్రాన్సాక్షన్ అగ్రిమెంట్లు టెర్మినేట్ అయిపోయాయని జీవీకే గ్రూప్ తెలిపింది.

పోర్ట్ ల నుంచి ఎయిర్ పోర్ట్ ల వరకు..

పోర్ట్ ల నుంచి ఎయిర్ పోర్ట్ వరకు అదానీ గ్రూప్ విస్తరించింది. లక్నో, జైపూర్, గౌహతి, అహ్మదాబాద్, తిరువనంతపురం, మంగళూరులో ఎయిర్పోర్ట్ అథారిటీ నిర్మించిన 6 నాన్ మెట్రో ఎయిర్పోర్టుల మెయింటనెన్స్ కాంట్రాక్ట్లను అదానీ గ్రూప్ ఇటీవల దక్కించుకుంది. ఇప్పుడు ముంబై ఎయిర్పోర్ట్ను కూడా దక్కించుకోవడంతో, జీఎంఆర్ తర్వాత ప్రైవేట్ రంగంలో అతిపెద్ద ఎయిర్పోర్ట్ ఆపరేటర్ గా అదానీ నిలుస్తోంది.