ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్ బిజినెస్‌‌ల్లో..రూ.7 లక్షల కోట్ల పెట్టుబడులు

ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్ బిజినెస్‌‌ల్లో..రూ.7 లక్షల కోట్ల పెట్టుబడులు
  • వచ్చే పదేళ్లలో పెడతామంటున్న అదానీ గ్రూప్‌‌
  • ఎఫ్‌‌ఎంసీజీ సెక్టార్  కంటే తమ ఏడు కంపెనీలు ఎక్కువ సంపాదిస్తున్నాయన్న సీఎఫ్‌‌ఓ
  • వచ్చే ఏడేళ్లలో  ఐటీ సెక్టార్ కంటే ఎక్కువ సంపాదిస్తామని వెల్లడి
  • వచ్చే 30 ఏళ్లలో ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌లోనే సంపదంతా!

న్యూఢిల్లీ : ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌ బిజినెస్‌‌లను విస్తరించడానికి వచ్చే పదేళ్లలో  ఏకంగా రూ.7 లక్షల కోట్లు ( 84 బిలియన్ డాలర్లు) ఇన్వెస్ట్ చేస్తామని అదానీ గ్రూప్ టాప్ మేనేజ్‌‌మెంట్ ప్రకటించింది. యూఎస్ కంపెనీ  హిండెన్‌‌బర్గ్ రిపోర్ట్ వెలువడ్డాక ఈ గ్రూప్ కంపెనీలు నష్టపోయిన మొత్తం మార్కెట్ క్యాప్‌‌కు ఇది సమానం కావడం విశేషం. మరింత ఇన్వెస్ట్ చేయాలని చూస్తున్నామని  అదానీ గ్రూప్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌‌‌‌ (సీఎఫ్‌‌ఓ) జుగేషిందర్‌‌‌‌ సింగ్‌‌ పేర్కొన్నారు. ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్ సెక్టార్‌‌‌‌లో భారీగా ఇన్వెస్ట్ చేస్తామని  ఈ ఏడాది జులైలో జరిగిన యాన్యువల్ షేర్‌‌‌‌హోల్డర్ మీటింగ్‌‌లో గ్రూప్ కొన్ని సంకేతాలు ఇచ్చింది. పోర్ట్స్‌‌, ఎనర్జీ, ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌ బిజినెస్‌‌లలో పెట్టుబడులు పెడతామని పేర్కొంది.

ఎఫ్ఎంసీజీ కంటే ఇన్‌‌ఫ్రాస్ట్రక్చరే బెటర్‌‌‌‌..

ఎఫ్‌‌ఎంసీజీ బిజినెస్‌‌లో మార్జిన్స్ (లాభాలు) తక్కువగా ఉంటాయని,  ఇన్‌‌ఫ్రా బిజినెస్‌‌లపై అదానీ గ్రూప్ ఫోకస్ పెంచుతుందని  జుగేషిందర్ సింగ్ వెల్లడించించారు. అదానీ గ్రూప్‌‌కు చెందిన టాప్ ఏడు కంపెనీల మొత్తం సంపద కన్జూమర్ గూడ్స్ ఇండస్ట్రీ కంటే చాలా ఎక్కువ ఉంటుందని ఆయన అన్నారు. సంపద క్రియేట్ చేసే బిజినెస్‌‌లపై దృష్టి పెడుతున్నామని చెప్పారు.  ముంబైలో జరిగిన ఇండియా డెట్‌‌ క్యాపిటల్ మార్కెట్ సమ్మిట్‌‌ 2023 లో ఆయన మాట్లాడారు. ఈ ఈవెంట్‌‌ను ట్రస్ట్‌‌ గ్రూప్ ఆర్గనైజ్ చేసింది. గ్రూప్ ఎఫ్‌‌ఎంసీజీ కంపెనీ అదానీ విల్‌‌మార్ గురించి సింగ్ డైరెక్ట్‌‌గా మాట్లాడలేదు. అయినప్పటికీ తాజాగా చేసిన కామెంట్స్‌‌తో ఈ కంపెనీలో వాటాలను అదానీ గ్రూప్‌‌ అమ్మాలని చూస్తోందనే వార్తలకు బలం చేకూరింది.  జాయింట్ వెంచర్ కంపెనీ అయిన అదానీ విల్‌‌మార్‌‌‌‌లో అదానీ ఎంటర్‌‌‌‌ప్రైజెస్‌‌కు, విల్‌‌మార్‌‌‌‌ ఇంటర్నేషనల్‌‌కు 44 శాతం చొప్పున  వాటాలు ఉన్నాయి. మిగిలిన వాటా పబ్లిక్ చేతిలో ఉంది. రూల్స్ ప్రకారం, లిస్టెడ్ కంపెనీల్లో ప్రమోటర్ల వాటా 75 శాతం కంటే దిగువకు రావాలి. వాటాలు అమ్ముకోవడానికి ఇదొక కారణం. ‘ఎఫ్‌‌ఎంసీజీ సెక్టార్‌‌‌‌  సగటున 11 శాతం  వృద్ధి చెందుతోంది. ఎఫ్‌‌ఎంసీజీ ఇండెక్స్‌‌ 33 రెట్లు ఎక్కువకు ట్రేడవుతోంది. అయినప్పటికీ గత 12 నెలల్లోని  అదానీ గ్రూప్ కంపెనీల ఇబిటా (ట్యాక్స్‌‌లు, వడ్డీల  కంటే ముందు లాభం), ఎఫ్‌‌ఎంసీజీ సెక్టార్‌‌‌‌లోని మొత్తం కంపెనీల ఇబిటా కంటే ఎక్కువ. మొత్తం ఎఫ్‌‌ఎంసీజీ సెక్టార్‌‌‌‌ అదానీ గ్రూప్ కంటే తక్కువ సంపాదిస్తోంది. ఇది ఇండియన్ ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్ స్టోరీ’ అని సింగ్ వివరించారు. 

ఇప్పుడే  మొదలైంది..

వచ్చే 30 ఏళ్లలో  దేశ ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్ రూపురేఖలు పూర్తిగా మారుతాయని, భారీగా సంపద క్రియేట్ అవుతుందని సింగ్‌‌ అన్నారు. ఈ స్టోరీ ఇప్పుడే మొదలయ్యిందని చెప్పారు. వచ్చే ఏడేళ్లలో  మొత్తం టెక్ సెక్టార్ సంపాదిస్తున్న దాని కంటే ఎక్కువ అదానీ గ్రూప్ సంపాదిస్తుందని అంచనా వేశారు. ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌లో అదానీ గ్రూప్‌‌ నుంచి ఏడు కంపెనీలు ఉన్నాయి. అవి అదానీ ఎంటర్‌‌‌‌ప్రైజెస్‌‌, అదానీ పవర్‌‌‌‌, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ పోర్ట్స్ అండ్‌‌ స్పెషల్ ఎకనామిక్ జోన్‌‌, అదానీ గ్రీన్‌‌ ఎనర్జీ సొల్యూషన్స్‌‌, అదానీ టోటల్ గ్యాస్‌‌, అంబుజా సిమెంట్‌‌ (ఈ కంపెనీ సబ్సిడరీ ఏసీసీ) .  కాగా, ఇన్వెస్టర్లలో కాన్ఫిడెన్స్ పెంచేందుకు అదానీ గ్రూప్ తమ  నాన్ కోర్ (కీలకం కాని) ఆస్తులను విక్రయించి, అప్పులను తీరుస్తోంది. మరోవైపు బాండ్లను ఇష్యూ చేయడం ద్వారా ఫండ్స్ సేకరిస్తోంది.  అదానీ పోర్ట్స్‌‌ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్‌‌, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్‌‌  కంపెనీలు ప్రైవేట్ ప్లేస్‌‌మెంట్ విధానంలో బాండ్లు ఇష్యూ చేయనున్నాయి. అదానీ గ్రీన్ ఎనర్జీ  ఇష్యూ చేసిన బాండ్లు వచ్చే ఏడాది సెప్టెంబర్‌‌‌‌, డిసెంబర్‌‌‌‌లో మెచ్యూర్ కానున్నాయి. ఈ అప్పులు తీర్చేందుకు గ్రూప్ అదనంగా పెట్టుబడులు పెట్టనుందని సింగ్‌‌ వెల్లడించారు.  ప్రిపేమెంట్ పెనాల్టీని తప్పించుకోవడానికి వచ్చే ఏడాది జులైలోపు అదనంగా పెట్టుబడులు పెడతామని చెప్పారు.  కాగా, అదానీ గ్రూప్ షేర్లు ఈ వారం ర్యాలీ చేశాయి.  హిండెన్‌‌బర్గ్ ఆరోపణలపై  హియరింగ్ పూర్తి చేసిన సుప్రీం కోర్ట్‌‌ త్వరలో తీర్పు ఇవ్వనుంది. దీంతో గ్రూప్ కంపెనీల షేర్లు 20 శాతం వరకు పెరిగాయి.