
కొత్తపల్లి, వెలుగు: చట్ట వ్యతిరేక పనులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అడిషనల్ డీసీపీ వెంకటరమణ హెచ్చరించారు. బుధవారం కొత్తపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని శాంతినగర్, వినాయకనగర్‌లో కార్డెన్ సెర్చ్ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేరాలను నియంత్రించడమే పోలీసుల లక్ష్యమని, అందులో భాగంగానే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం చేపడుతున్నట్లు తెలిపారు. కొత్త వ్యక్తులు, నేరస్తులు షెల్టర్ తీసుకుంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామన్నారు.
యువత చెడు అలవాట్లకు బానిసలుగా మారి ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు ఎవరైనా పాల్పడితే డయల్ 100 చేయాలన్నారు. సైబర్‌నేరాల పట్ల జాగ్రత్తగా ఉండాలని, స్వీయరక్షణకు సీసీ కెమెరాలు ఏర్పాటుచేసుకోవాలన్నారు. తనిఖీల్లో అనుమతి లేని 77 బైకులు, 27 ఆటోలు, ఒక ట్రక్‌ను స్వాధీనం చేసుకున్నారు. కార్యక్రమంలో రూరల్ ఏసీపీ విజయకుమార్, సీఐలు కోటేశ్వర్, ప్రదీప్‌కుమార్, సంజీవ్, సదన్‌కుమార్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.