కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి అద్దంకి దయాకర్ క్షమాపణ

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి అద్దంకి దయాకర్ క్షమాపణ

హైదరాబాద్: కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ క్షమాపణ చెప్పారు. మునుగోడు సభలో తాను చేసిన వ్యాఖ్యలు బాధించి ఉంటే తనను క్షమించాలని కోమటిరెడ్డి  వెంకట్ రెడ్డిని కోరారు. మునుగోడు సభలో కోమటిరెడ్డిపై అభ్యంతకర వ్యాఖ్యలపై అద్దంకి దయాకర్ స్పందించారు. పార్టీకి నష్టం జరగొద్దనే ఆ వ్యాఖ్యలు చేశాను తప్ప... వెంకట్ రెడ్డిని విమర్శించాలని కాదన్నారు. తెలంగాణలో ఆ పదాన్ని కామన్ గా వాడుతారన్న ఆయన... తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. కాగ... అంతకు ముందు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలపై వివరణ కోరుతూ అద్దంకి దయాకర్ కు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. 

ఇకపోతే... నిన్న చండూరు కాంగ్రెస్ పార్టీ సభలో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పై  అద్దంకి దయాకర్ తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. దీంతో కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి తీవ్ర మనస్థాపానికి గురి కాగ... ఆయన అనుచరులు అద్దంకి దయాకర్ పై చర్యలు తీసుకోవాలంటూ టీపీసీసీ క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేశారు. స్పందించిన క్రమశిక్షణ కమిటీ వారంలోగా అద్దంకి దయాకర్ వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఇక చండూరు సభలో అద్దంకి దయాకర్ మాట్లాడుతూ... ఓ వైపు తన నియోజకవర్గంలో కాంగ్రెస్ సభ జరుగుతోంటే...  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఢిల్లీలో అమిత్ షాను కలవటమేంటని ప్రశ్నించారు. 

కాంగ్రెస్ కు రాజీనామా చేసిన మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి విషయంలో తన వైఖరేమిటో చెప్పాలని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని అద్దంకి దయాకర్ డిమాండ్ చేశారు. లేకుంటే పార్టీ నుంచి బయటకు పోవాలని పరుష పదజాలంతో విమర్శించారు. దీంతో కోమటిరెడ్డి వర్గీయుల్లో తీవ్ర ఆగ్రహం, అసంతృప్తి చెలరేగాయి. అనంతరం కోమటిరెడ్డిపై వ్యాఖ్యలను నిరసిస్తూ ఆయన అనుచరులు అద్దంకి దయాకర్ దిష్టి బొమ్మను దహనం చేశారు. దీంతో స్పందించిన అద్దంకి క్షమాపణ చెబుతున్నట్లు ప్రకటించారు.