
హైదరాబాద్,వెలుగు : వ్యవసాయ శాఖలో అదనపు పోస్టులను వెంటనే మంజూరు చేసి ప్రమోషన్లు కల్పించాలని తెలంగాణ అగ్రి కల్చరల్ ఆఫీసర్స్అసోసియేషన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. అసోసియేషన్ చైర్మన్ బి. కృపాకర్ రెడ్డి, అధ్యక్షురాలు కె. అనురాధ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత 2016లో ప్రభుత్వం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసి, ఆయా జిల్లాల్లో కొత్త మండలాలను ఏర్పాటు చేసింది.
పాలనా పరంగా ఆయా జిల్లాలు, మండలాలకు అవసరమైన కొత్త పోస్టులను మంజూరు చేసి అన్ని శాఖల్లో రెగ్యులర్ పదోన్నతుల ప్రక్రియ కొనసాగుతుంటే... వ్యవసాయ శాఖలో మాత్రం పై స్థాయి అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఏ ఒక్కస్థాయిలో అదనపు పోస్టులను మంజూరు చేయలేదని, పదోన్నతులు కల్పించలేదని పేర్కొన్నారు. దీనిపై జిల్లా అధికారుల సమావేశంలో సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తే ఆయన వెంటనే పదోన్నతులు చేపట్టాలని ఆదేశించినా అప్పటి అధికారి పట్టించుకోలేదన్నారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వెంటనే జిల్లా, డివిజన్, మండల స్థాయిలోఅవసరమైన కొత్త పోస్టుల మంజూరుతో పాటు, వెంటనే పదోన్నతులు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.