
నిర్మల్, వెలుగు : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఏటా దాదాపు 40 వేల టన్నుల చేపల ఉత్పత్తి జరుగుతున్నప్పటికీ స్థానికంగా మార్కెట్ అందుబాటులో లేకపోవడంతో మత్స్యకారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రం బయట మార్కెటింగ్ చేసేందుకు తెలంగాణ ఫిష్ పేరిట నోడల్ సెంటర్లను ఎంపిక చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. నోడల్ సెంటర్ల ద్వారా ప్రధాన పట్టణాలు, నగరాలకు చేపలను ఎగుమతి చేయాలని భావించారు. అయితే ఆ ప్రతిపాదనలు ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదు. స్థానికంగా చేపల మార్కెట్లను అభివృద్ధి చేస్తూనే ఇతర ప్రాంతాలకు ఎగుమతులను ప్రోత్సహిస్తే మత్స్యకారులకు ప్రయోజనం చేకూరుతుంది. ఇటీవలే ప్రభుత్వం ఇంటి గ్రేటెడ్ ఫిష్ మార్కెట్లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఉమ్మడి జిల్లాలో నీటి వనరులు పెద్ద సంఖ్యలో ఉండడంతో చేపల ఉత్పత్తి గణనీయంగా పెరుగుతోంది.
జిల్లాలోని గోదావరి, ఉప నదుల పరిధిలో ఉన్న అనేక రిజర్వాయర్లు, కాలువలు, చెరువులలోని చేపలు రుచిగా ఉండటం వల్ల హైదరాబాద్ మహారాష్ట్రలోని నాగపూర్ లలో విపరీతమైన డిమాండ్ ఉంటోంది. స్థానికంగా గిరాకీ లేకపోవడం, ఇతర నగరాలకు ఎగుమతి చేసే సౌకర్యాలు లేకపోవడం వల్ల మత్య్సకారులు నష్టపోతున్నారు.
భారీ సంఖ్యలో రిజర్వాయర్లు...
జిల్లాలో గోదావరి నది దాని ఉపనదులతో పాటు మొత్తం 14 రిజర్వాయర్లు, 1501 చిన్న నీటి వనరులు ఉన్నాయి. 320 మత్స్య సహకార సంఘాలు ఉండగా ఈ సంఘాల్లో 20 వేల కుటుంబాలు సభ్యత్వం కలిగి ఉన్నాయి. ఏటా10 కోట్ల చేప పిల్లలను ఈ నీటి వనరులలో వదులుతున్నారు. 40 వేల టన్నుల చేపలు ఉత్పత్తి అవుతున్నట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. జిల్లాలోని చిన్న నీటి వనరుల్లో బొచ్చ, రాహు, బంగారు తీగ, రిజర్వాయర్లలో మ్రిగాల అనే రకం చేప పిల్లలను పెంచుతున్నారు. ఈ రకం చేపలకు నాగపూర్, హైదరాబాద్ తో పాటు మరికొన్ని ప్రధాన నగరాల్లో విపరీతమైన డిమాండ్ ఉన్నట్లు చెబుతున్నారు. ఇతర చేపల కన్నా ఈ చేపలు ఎక్కువ రుచిగా ఉంటాయి.
చేపలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలి....
ధాన్యం, మొక్కజొన్న పంటల లాగా చేపలను కూడా ప్రభుత్వమే కొనుగోలు చేస్తే మత్స్యకారులకు ఆర్థికంగా ప్రయోజనం చేకూరుతుంది. జిల్లాలో నీటి వనరులు పెరిగిపోవడంతో చేప పిల్లల ఉత్పత్తి గణనీయంగా పెరుగుతోంది. దీని ద్వారా డిమాండ్ కన్నా ఉత్పత్తి ఎక్కువ అవుతోంది. ప్రభుత్వం చేపల ఎగుమతులకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలి. చేపల ఎగుమతి జరిగితేనే మత్స్యకార కుటుంబాలకు ఆర్థికంగా ప్రయోజనం దక్కుతుంది. స్థానిక మార్కెట్ లో అమ్మకాలతో పెద్దగా ప్రయోజనం ఉండడం లేదు.
బోయ యువరాజ్, మత్స్య సహకార సంఘం గౌరవ అధ్యక్షుడు, నిర్మల్ జిల్లా..
ఎగుమతులపై దృష్టి పెట్టాలి...
స్థానికంగా ఉత్పత్తయ్యే చేపలను ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసేందు కోసం అవసరమైన సౌకర్యాలను కల్పించాలని మత్స్యకారులు కోరుతున్నారు. ఇటీవలే నిర్మల్ జిల్లా కలెక్టర్ చేపల ఎగుమతులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. అనుకూలమైన చోట్ల ఐస్ ఫ్యాక్టరీల ఏర్పాటు అవకాశాలను పరిశీలించాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ సూచించారు. రైతులకు ఆర్థికంగా సహకరించి వారి చేత ఐస్ ఫ్యాక్టరీలను ఏర్పాటు చేయడం ద్వారా చేపల ఎగుమతి జరిగేటట్లు చూడడం లాంటి చర్యల పై కసరత్తు జరపాలని కలెక్టర్ మత్స్యశాఖ అధికారులకు సూచించారు. అనుకూలత ఉన్నచోట్ల కోల్డ్ స్టోరేజ్ లను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు కూడా ఉన్నాయి.
ఎగుమతుల దిశగా ఆలోచన చేస్తున్నాం...
జిల్లాలో చేపల ఉత్పత్తి పెరుగుతున్న కారణంగా స్థానిక మార్కెటింగ్ ను ప్రోత్సహిస్తూనే ఎగుమతుల దిశగా కూడా దృష్టి సారిస్తున్నాం. జిల్లా కలెక్టర్ వరుణ్ రెడ్డి ఇప్పటికే ఈ అంశంపై సమీక్ష జరిపారు. ఎగుమతుల కోసం ప్రోత్సాహకాలతో ఐస్ ఫ్యాక్టరీల ఏర్పాటుపై ప్రతిపాదనలు రూపొందిస్తున్నాం. మత్స్యకారుల కోసం మొబైల్ ఫిష్ రిటైల్ అవుట్ లైట్స్ ను ఏర్పాటు చేయనున్నాం. డిమాండ్ కనుగుణంగా స్థానికంగా చేపల వినియోగం పెరిగేటట్టు చర్యలు తీసుకుంటున్నాం. మత్స్యకారుల కోసం త్రీ వీలర్స్ స్కీంను కూడా అమలు చేస్తున్నాం.
పి. నరసింహారావు, జిల్లా మత్స్యశాఖ అధికారి, నిర్మల్ జిల్లా