
ఆదిలాబాద్, వెలుగు : మావోయిస్టు అగ్రనేత ఆజాద్, జర్నలిస్ట్ హేమచంద్ర పాండేల ఎన్‌కౌంటర్ కేసులో మంగళవారం ఆదిలాబాద్ జిల్లా కోర్టు సంచలన ఆదేశాలిచ్చింది. కేసుతో సంబంధమున్న 29 మంది పోలీసులపై విచారణ మొదలుపెట్టి మూడు నెలల్లో ముగించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంఆర్ సునీత ఆదేశాలిచ్చారని ఆజాద్ తరపు న్యాయవాది రహీం తెలిపారు. 2010 లో జరిగిన ఎన్కౌంటర్లో చెరుకూరి రాజ్ కుమార్ అలియాస్ ఆజాద్ తో పాటు జర్నలిస్ట్ హేమచంద్ర పాండే చనిపోయారు. అయితే ఇది బూటకపుగా ఎన్ కౌంటర్ అంటూ ఆజాద్ భార్య కోర్టులో కేసు వేసింది. అప్పటి నుంచి ఈ కేసు సుప్రీం కోర్టు, హైకోర్టు, జిల్లా కోర్టుల్లో సాగుతూ మళ్లీ జిల్లా కోర్టుకే చేరింది. ఇప్పుడు ఎన్కౌంటర్కు సంబంధమున్న పోలీసుల విచారణను మున్సిఫ్కోర్ట్ లో జరిపి తీర్పు ప్రకటించాలని జిల్లా జడ్జి ఆదేశాలు జారీ చేశారని ఆజాద్ తరపు అడ్వకేట్ తెలిపారు.
అసలేం జరిగిందంటే..
ప్రస్తుత కుమ్రంభీం జిల్లాలోని వాంకిడి మండలం సర్కేపల్లి జోగాపూర్అటవీ ప్రాంతంలో 2010 జులైలో ఎన్‌కౌంటర్ జరిగింది. కేంద్ర ప్రభుత్వం, మావోయిస్టు అగ్రనేతలకు మధ్య చర్చలకు స్వామి అగ్నివేశ్ మధ్యవర్తిత్వం జరుపుతున్న సమయంలో ఈ ఎన్‌కౌంటర్ జరగడంతో బూటకమైనదంటూ స్వామి అగ్నివేశ్ సుప్రీంకోర్టు పిటిషన్ వేశారు. సుప్రీంకోర్టు 2011 జనవరి 14న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. వాదనల అనంతరం 2011 ఏప్రిల్ 15న కేసును సీబీఐకి అప్పగించింది. ఆజాద్ కుటుంబం కూడా 2012లో కోర్టుకు రాగా, సీబీఐ విచారణకు ఆదేశించింది. దీంతో సీబీఐ పోలీసులకు క్లీన్ చిట్ ఇచ్చింది. సీబీఐ నివేదిక పోలీసులకు అనుకూలంగా ఉందంటూ ఆజాద్ భార్య పద్మ, ఆమె తరపు న్యాయవాది సురేశ్ 2013 జూలైలో ఆదిలాబాద్ ఫస్ట్ క్లాస్ కోర్టును ఆశ్రయించారు. స్వామి అగ్నివేశ్ సైతం 2014 ఫిబ్రవరి 17న వాదనలు వినిపించారు. 2015 మార్చి 24న కోర్టు పిటిషన్ను తిరస్కరించింది. దీనిపై 2015లో ఆజాద్ తరపు న్యాయవాదులు రివిజన్ పిటిషన్ వేశారు. పోలీసులు స్వయంగా కోర్టుకు హాజరై తమ నిర్ధోషిత్వాన్ని నిరూపించుకోవాలని సమన్లు జారీ చేసింది. విచారణ తర్వాత ఎన్ కౌంటర్ బూటకమని, 29 మంది పోలీసులపై 302 సెక్షన్ కింద కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. దీన్ని సవాలు చేసిన పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు. తమ వాదనలు జిల్లా కోర్టు సరిగ్గా వినలేదంటూ కేసు వేయగా రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశాలతో తిరిగి గత సెప్టెంబర్ లో జిల్లా కోర్టు చేరింది. పూర్తి స్థాయి వాదనలు విన్న తర్వాత జిల్లా కోర్టు మంగళవారం పోలీసులపై విచారణకు ఆదేశించడం సంచలనం కలిగించింది.