ట్రిపుల్​ఆర్ రేట్లు చెల్లించండి..గంధమల్ల రిజర్వాయర్​ ముంపు రైతుల డిమాండ్​

ట్రిపుల్​ఆర్ రేట్లు చెల్లించండి..గంధమల్ల రిజర్వాయర్​ ముంపు రైతుల డిమాండ్​

యాదగిరిగుట్ట, వెలుగు : గంధమల్ల రిజర్వాయర్ కోసం భూములు కోల్పోతున్న తమకు ట్రిపుల్​ఆర్ బాధితుల భూములకు చెల్లించిన విధంగా పరిహారం ఇవ్వాలని గంధమల్ల రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం తుర్కపల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఆర్డీవో కృష్ణారెడ్డి నిర్వహించిన మీటింగ్ లో గంధమల్ల రిజర్వాయర్ ముంపు బాధిత రైతులు తమ అభిప్రాయం తెలిపారు. గంధమల్ల రిజర్వాయర్ కోసం వెయ్యి ఎకరాలు అవసరం అవుతుండగా, దాదాపుగా రెండు వేల మంది రైతులు తమ భూములను కోల్పోతున్నారు.

ప్రభుత్వ నిబంధనల ప్రకారం గంధమల్లలో ప్రస్తుతం ఉన్న భూముల రేట్లకు మూడింతలు చేసి పరిహారం ఇస్తామని అధికారులు చెప్పగా, బాధిత రైతులు ససేమిరా అన్నారు. దీంతో మూడింతల పరిహారంతోపాటు అదనంగా 50 శాతం కలిపి నష్టపరిహారం చెల్లిస్తామని రైతులను ఒప్పించే ప్రయత్నం చేశారు. కానీ రైతులు వినకపోగా.. కచ్చితంగా ట్రిపుల్​ఆర్​రేట్లు చెల్లించాల్సిందేనని తేల్చి చెప్పారు. దీంతో రైతుల అభిప్రాయాలు, డిమాండ్లను ప్రభుత్వానికి నివేదిక రూపంలో అందజేస్తామని అధికారులు తెలిపారు. తుర్కపల్లి తహసీల్దార్ దేశ్యానాయక్, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు, రైతులు పాల్గొన్నారు.