
ఆదిలాబాద్‌టౌన్/నిర్మల్/బెల్లంపల్లి/ఇంద్రవెల్లి, వెలుగు: ఉమ్మడి జిల్లా అభ్యర్థులు గ్రూప్1లో సత్తా చాటారు. గురువారం వెలువడిన ఫలితాల్లో పలువురు ఉత్తమ ర్యాంకులు సాధించి ఉన్నతాధికారుల పోస్టులకు ఎంపికయ్యారు.
బోథ్మండల కేంద్రానికి చెందిన సీనియర్జర్నలిస్ట్కరిపె మల్లేశ్, రేవతి దంపతుల కొడుకు సాయికమల్ రాష్ట్రస్థాయిలో 113వ ర్యాంకు సాధించి డీఎస్పీ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. సాయికమల్ఇప్పటికే ఏఈగా ఉద్యోగం సాధించి మిషన్ భగీరథలో విధులు నిర్వహిస్తున్నారు.
రైతు బిడ్డకు 157 ర్యాంక్
భైంసా పట్టణంలోని పిప్పిరి కాలనీకి చెందిన సూర్వే సిద్దేశ్వర్–రత్నమాల కొడుకు సాయికుమార్ గ్రూప్ 1లో 157 ర్యాంకు సాధించి బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్ట్‌కు ఎంపికయ్యాడు. వీరిది వ్యవసాయ కుటుంబం. సాయికుమార్ టెన్త్ వరకు భైంసాలోని వాసవి స్కూల్లో, ఇంటర్, బీటెక్ హైదరాబాద్‌లో పూర్తిచేశాడు. ఐఏఎస్ కావడమే తన లక్ష్యమని సాయికుమార్ తెలిపాడు.
శశిధర్ రెడ్డికి నాలుగో ఉద్యోగం
ఆదిలాబాద్పట్టణానికి చెందిన సరసన్ శశిధర్‌రెడ్డి సత్తా చాటాడు. 2016లో ఎక్సైజ్‌లో కానిస్టేబుల్‌గా ఉద్యోగం సాధించిన శశిధర్.. 2017లో ఫైర్ కానిస్టేబుల్, 2024లో గ్రూప్4 సాధించాడు. గురువారం విడుదలైన గ్రూప్1 ఫలితాల్లో అసిస్టెంట్ట్రెజరర్ ఆఫీసర్ ఉద్యోగం సాధించాడు.
బెల్లంపల్లికి చెందిన కొత్తూరు సత్యనారాయణమూర్తి 280వ ర్యాంక్ సాధించి కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్‌గా ఎంపికయ్యాడు. ఇంద్రవెల్లి మండలంలోని వాగాయితాంద గ్రామానికి చెందిన రాథోడ్ ప్రమోద్ 458.5 మార్కులతో 420వ ర్యాంక్ సాధించి డీఎస్పీ ఉద్యోగం దక్కించుకున్నాడు.