ఎంట్రీ ఫీజు లేని కాయిన్స్ మ్యూజియం 

ఎంట్రీ ఫీజు లేని కాయిన్స్ మ్యూజియం 

 హైదరాబాద్, వెలుగు: రాతి యుగం నాటి నుంచి నేటి ఆధునిక కాలంలో చెలామణి అవుతున్న నాణేల వరకు అన్నీ ఒకేచోట ఉన్న మ్యూజియం సిటీలో ఉంది తెలుసా..  సైఫాబాద్​లోని పాత మింట్​కాంపౌండ్​నే మింట్​మ్యూజియంగా మార్చగా గతేడాది జూన్​7న సెక్యూరిటీ ప్రింటింగ్‌‌, మింటింగ్‌‌ కార్పొరేషన్‌‌ ఇండియా లిమిటెడ్‌‌ (ఎస్‌‌పీఎంసీఐఎల్‌‌) సీఎండీ తృప్తి పాత్ర ఘోష్‌‌ ప్రారంభించారు. 1903 నుంచి ఇక్కడ నాణేలు తయారు చేయగా, బిల్డింగ్​శిథిలావస్థకి చేరుకోవడంతో 1997లో మింట్​ను చర్లపల్లికి షిఫ్ట్ ​చేశారు. అప్పటి నుంచి ఖాళీగా ఉన్న మింట్​కాంపౌండ్​ను ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగం మ్యూజియంగా మార్చారు. ఎలాంటి ఎంట్రీ ఫీజు లేకుండా ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 వరకు సందర్శకులను అనుమతిస్తున్నారు. పెద్ద పండుగల నాడు తప్ప మిగిలిన అన్ని రోజుల్లో ఈ మ్యూజియం తెరిచే ఉంటోంది1803లో నిజాం రాజైన మీర్ అక్బర్ అలీ ఖాన్ సికందర్ జా ముద్రించిన బంగారు నాణేలు మొదలు బ్రిటిష్ ఇండియా, జపాన్ కాయిన్స్, దేశంలో ఆయా కాలాల్లో చెలామణి అయిన కాయిన్స్​అన్నీ అందుబాటులో ఉంచారు.

గోల్డ్ నుంచి సిల్వర్, నికెల్ బ్రాంజ్, స్టీల్ వరకు అన్ని రకాల కాయిన్స్ ఇక్కడ చూడొచ్చు. ఆది మానవులు కూడా నాణేలు వాడేవారని, రాళ్లనే నాణేలుగా ఉపయోగించారని మింట్​మ్యూజియం సందర్శిస్తే తెలుస్తుంది. అలాగే స్వాతంత్ర్య సమరయోధుల పేర్లతో, ఇంటర్నేషనల్​ యోగా డే, ఫుడ్​డే నాడు రిలీజ్ ​చేసిన నాణేలను, భారత రత్న, పద్మ అవార్డులు, సైనిక మెడల్స్ సహా ఆర్థిక వ్యవస్థ ఎలా మారుతూ వచ్చిందో తెలిపేలా ఎన్నోరకాల వస్తువులను ఇక్కడ సందర్శనకు ఉంచారు. నాణేల తయారీకి వాడే వస్తువులు, మెటీరియల్​ను మింట్ మ్యూజియంలో చూడొచ్చు. మహనీయుల స్మారకార్థంగా వారి జయంతులు, వర్ధంతుల 
సందర్భంగా ముద్రించిన నాణేలు కూడా ఉన్నాయి. అలాంటి కాయిన్స్ ​కావాలనుకుంటే మ్యూజియంలోనే కొనుక్కోవచ్చు. లేదా ఎస్‌‌పీఎంసీఐఎల్ వెబ్​సైట్​ద్వారా తీసుకోవచ్చు. అయితే అలా తయారు చేసిన కాయిన్స్​ 2 వేలు మాత్రమే ఉంటాయి. ఉమ్మడి ఏపీ మాజీ సీఎం ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా రూ.100 కాయిన్​రిలీజ్ చేస్తున్నారు. ఒక్కో కాయిన్​ధర రూ.4,050 నుంచి 4,380వరకు ఉండొచ్చని మ్యూజియం అధికారులు తెలిపారు. అయితే అవి చెలామణి చేయడానికి కుదరదు. కేవలం జ్ఞాపకార్థం మాత్రమే.

అడ్మినిస్ట్రేషన్ ​స్టార్ట్ ​అయితే సందర్శకులు పెరగొచ్చు

ప్రస్తుతం సమ్మర్ ​హాలిడేస్​ కావడంతో డైలీ 80 మంది సందర్శకులు మాత్రమే వస్తున్నారు. స్కూళ్లు, కాలేజీలు ఉన్న టైంలో రోజూ 300 మంది దాకా వచ్చేవారు. ఆదివారం సహా ప్రతిరోజు 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓపెన్ లోనే ఉంటుంది. కొత్త సెక్రటేరియట్ వెనుక భాగంలో ఉండటంతో అక్కడ అడ్మినిస్ట్రేషన్ ప్రారంభమైతే సందర్శకులు పెరుగుతారని అనుకుంటున్నాం. 
- రామ్మోహన్, సీనియర్​ ఇంజనీర్, 
   (నాణేల మ్యూజియం)