ODI World Cup 2023: పాక్‌కు మరో అవమానం.. శత్రువులుగా మారుతున్న ఆఫ్ఘన్లు!

ODI World Cup 2023: పాక్‌కు మరో అవమానం.. శత్రువులుగా మారుతున్న ఆఫ్ఘన్లు!

వన్డే ప్రపంచ కప్‌లో అసలు పోరు ఇప్పుడు మొదలైంది. ఇన్నాళ్లు అరకొరగా మజా అందించినా.. ఇకపై ప్రతి మ్యాచ్ చావో రేవో వంటిదే. గెలిస్తే తప్ప అడుగు ముందుకు పడని పరిస్థితి. దీనంతటికి కారణం ఆఫ్ఘనిస్తాన్ జట్టు. ఎలాంటి అంచనాలు లేకుండా టోర్నీలోకి అడుగుపెట్టిన ఆఫ్ఘన్లు.. సెమీస్ ముంగిట మేటి జట్లను భయపెడుతున్నారు. ఇప్పటికే ఇంగ్లాండ్, పాకిస్తాన్, శ్రీలంకను చిత్తుచేసిన ఆఫ్ఘనిస్తాన్.. ఇప్పుడు నెదర్లాండ్స్‌పై విజయంతో సెమీస్ రేసులోకి దూసుకొచ్చింది.

శుక్రవారం నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. తొలుత డచ్ బ్యాటర్లను 179 పరుగులకే కట్టడి చేసిన ఆఫ్ఘన్లు.. అనంతరం లక్ష్యాన్ని మూడు వికెట్లు కోల్పోయి మరో 18.3 ఓవర్లు మిగిలి ఉండగానే చేధించారు. ఈ  విజయంతో ఆఫ్ఘన్ జట్టు.. పాయింట్ల పట్టికలో పాకిస్తాన్‌ను కిందకు నెట్టి ఐదో స్థానంలోకి దూసుకొచ్చింది. ప్రస్తుతానికి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, ఆఫ్ఘనిస్తాన్ జట్లు విజయాల (8 పాయింట్లు) పరంగా సమానంగా ఉండటం గమనార్హం.

అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా

ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఓటమిని పాక్ మాజీ ఆటగాళ్లు, ఆ దేశ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. మ్యాచ్ ముగిసి పది రోజులు గడుస్తున్నా.. ఇప్పటికీ నిద్రలో కలవరిస్తున్నారు. అలాంటిది ఇప్పుడు పాయింట్ల పట్టికలో కిందకు నెట్టడమే కాకుండా, పాక్ సెమీస్ అవకాశాలకు గండి కొడుతుండటం వారికి మరింత ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. నెదర్లాండ్స్‌పై ఆఫ్ఘన్లు విజయం సాధించగానే.. పాక్ అభిమానులు సోషల్ మీడియాలో వాలిపోయారు. సంబరపడకండి.. ముందుంటది మీకు అంటూ ఆఫ్ఘన్ క్రికెటర్లకు హెచ్చరికలు పంపారు. ఈ వ్యాఖ్యలను బట్టి చూస్తే భారత్ - పాక్ మ్యాచ్‌ను చూసినట్లే, ఇకపై ఆఫ్ఘన్- పాక్ ఉంటుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.